Andhra Pradesh: ఓర్నాయనో.. టీవీ సౌండ్ తగ్గించమంటే ఇంత ఘోరమా.. భార్య చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంకే..

మనిషి ప్రాణానికి విలువ లేకుండా పోతోంది. క్షణికావేశం.. కట్టుకున్న వ్యక్తినే కాలయముడి దగ్గరకు పంపిస్తోంది. మంగళగిరిలో జరిగిన ఒక దారుణ ఘటన ఇప్పుడు అందరినీ షాక్‌కు గురిచేస్తోంది. టీవీ సౌండ్ తగ్గించమన్నందుకు ఒక భార్య.. తన భర్తను దారుణంగా చంపేసింది. అసలు ఏం జరిగిందనేది ఇప్పుడు తెలుసుకుందాం..

Andhra Pradesh: ఓర్నాయనో.. టీవీ సౌండ్ తగ్గించమంటే ఇంత ఘోరమా.. భార్య చేసిన పని తెలిస్తే మైండ్ బ్లాంకే..
Wife Kills Husband Over Tv Volume Dispute

Edited By:

Updated on: Feb 20, 2026 | 10:10 AM

క్షణికావేశం ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చిన్నపాటి మాటకు పంతానికి పోయి, కట్టుకున్న భర్తనే కడతేర్చిందో భార్య. టీవీ వాల్యూమ్ విషయంలో మొదలైన చిన్న గొడవ.. ఒకరిని స్మశానానికి, మరొకరిని జైలుకు పంపింది. ఈ దారుణ ఘటన మంగళగిరి మండలం పెదవడ్లపూడిలో కలకలం రేపింది. మంగళగిరికి చెందిన క్రాంతికి గతంలోనే వివాహం జరిగింది. అయితే ఆమె మొదటి భర్త నేర ప్రవృత్తి కారణంగా జైలు పాలు కావడంతో ఆమె ఒంటరిగా ఉంటోంది. ఈ క్రమంలో ఏసీ మెకానిక్‌గా పనిచేసే అహ్మద్‌తో క్రాంతికి పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం కాస్తా ప్రేమగా మారి, సహజీవనం వరకు వెళ్లింది. ఎనిమిది నెలల క్రితమే వీరిద్దరూ పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకున్నారు. ప్రస్తుతం వీరిద్దరూ టిడ్కో అపార్ట్‌మెంట్స్‌లో అద్దెకు ఉంటూ జీవనం సాగిస్తున్నారు.

ఉపవాసం వేళ.. ఊహించని విషాదం

ప్రస్తుతం రంజాన్ మాసం కావడంతో అహ్మద్ భక్తిశ్రద్ధలతో ఉపవాసం ఉంటున్నాడు. నిన్న మధ్యాహ్నం పని ముగించుకుని నీరసంగా ఇంటికి వచ్చిన అహ్మద్‌కు, ఇంట్లో టీవీ సౌండ్ భారీగా వినిపించింది. ఉపవాసంలో ఉన్న తనకు ఆ శబ్దం ఇబ్బందిగా అనిపించడంతో టీవీ వాల్యూమ్ తగ్గించాలని క్రాంతిని కోరాడు. కానీ ఈ చిన్న విషయంపై క్రాంతి అహ్మద్‌తో గొడవకు దిగింది. ఇద్దరి మధ్య మాటా మాటా పెరిగి అది కాస్తా రణరంగంగా మారింది. ఆగ్రహంతో ఊగిపోయిన క్రాంతి.. వంటగదిలోకి వెళ్లి కత్తి తీసుకువచ్చి అహ్మద్ పొట్టలో బలంగా పొడిచింది.

తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన అహ్మద్‌ను స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అహ్మద్‌ లివర్ తీవ్రంగా దెబ్బతిన్నట్లు గుర్తించి, మెరుగైన చికిత్స కోసం విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ మృత్యువుతో పోరాడుతూ అహ్మద్ కన్నుమూశాడు. కన్నకొడుకును కోల్పోయిన అహ్మద్ తల్లి రోదనలు మిన్నంటాయి. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు మంగళగిరి పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితురాలు క్రాంతిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. చిన్నపాటి కారణాలకే ప్రాణాలు తీసే స్థాయికి సమాజం వెళ్తుండటం ఆందోళన కలిగిస్తోంది. కోపం వచ్చినప్పుడు ఒక్క క్షణం ఆలోచించి ఉంటే, ఈరోజు ఒక కుటుంబం రోడ్డున పడేది కాదు.

Follow Us