ఏపీ, తెలంగాణ వాతావరణంలో కీలక మార్పులు.. వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే..?

Weather Update: తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ కీలక అప్‌డేట్ అందించింది. ప్రస్తుతం అటు తెలంగాణ, ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో భిన్నమైన వాతావరణ పరిస్థితులు నెలకొన్నాయి. ఒకవైపు వేసవి తాపం ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేస్తుంటే, మరోవైపు ద్రోణి ప్రభావంతో అకాల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది.

ఏపీ, తెలంగాణ వాతావరణంలో కీలక మార్పులు.. వచ్చే 3 రోజులు ఎలా ఉంటుందంటే..?
Telangana And Andhra Pradesh Weather Update

Updated on: Apr 26, 2026 | 3:07 PM

తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. అటు ఎండలు మండిపోతుంటే, ఇటు అకాల వర్షాలు ప్రజలను పలకరిస్తున్నాయి. కర్ణాటక నుండి తమిళనాడు మీదుగా కొమరిన్ ప్రాంతం వరకు విస్తరించి ఉన్న ద్రోణి ప్రభావంతో రాగల మూడు రోజులు వాతావరణంలో కీలక మార్పులు చోటు చేసుకోనున్నాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వాతావరణం మిశ్రమంగా ఉండనుంది. రానున్న రెండు, మూడు రోజుల్లో సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీలు పెరిగే ఛాన్స్ ఉంది. ఎండలు పెరిగినప్పటికీ, రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఉరుములు, మెరుపులతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు.

ఆంధ్రప్రదేశ్ – యానాం పరిస్థితి

ఏపీలో ప్రాంతాల వారీగా వాతావరణం భిన్నంగా ఉండనుంది. ఉత్తర కోస్తాలో రాగల మూడు రోజులు ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది. ముఖ్యంగా వేడి, తేమతో కూడిన అసౌకర్యమైన వాతావరణం నెలకొంటుంది. సీమలో ఎండల తీవ్రత భయంకరంగా ఉండబోతుంది. రానున్న మూడు రోజుల్లో ఇక్కడ గరిష్ట ఉష్ణోగ్రతలు 42 నుండి 44 డిగ్రీల వరకు నమోదయ్యే అవకాశం ఉంది. అయితే సోమ, మంగళవారాల్లో అక్కడక్కడా తేలికపాటి వర్షాలు కురిసే ఛాన్స్ ఉంది. అయితే దక్షిణ కోస్తాలో మాత్రం వాతావరణం పొడిగా ఉంటుంది. ఉక్కపోత, వేడి గాలుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది.

ముఖ్య గమనిక

బయటకు వెళ్లే వారు ఎండ తీవ్రత దృష్ట్యా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ముఖ్యంగా వడగాల్పులు వీచే సమయంలో వృద్ధులు, పిల్లలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది. ప్రధానంగా రాయలసీమ, తెలంగాణలోని ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉన్న జిల్లాల ప్రజలు మధ్యాహ్నం 12 నుండి 4 గంటల మధ్య ప్రయాణాలు తగ్గించుకోవడం మంచిదని చెప్పారు. ఈదురుగాలులు వీచే అవకాశం ఉన్నందున, కోతకు సిద్ధంగా ఉన్న పంటలను భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉరుములు, మెరుపుల సమయంలో చెట్ల కింద ఉండవద్దని, విద్యుత్ స్తంభాలకు దూరంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు.

Follow Us