పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి

పుట్టినరోజే ప్రాణాలు కోల్పోయిన యువ ఇంజనీర్… కుటుంబాన్ని విషాదంలో ముంచేసింది. అమెరికాలో నదిలో ఈదేందుకు వెళ్లిన విజయనగరం యువకుడు సాయిశ్రీ హరికృష్ణ ప్రమాదవశాత్తూ మునిగి మృతి చెందాడు. నాలుగు నెలల క్రితమే ఉద్యోగం సంపాదించి కుటుంబానికి ఆనందం ఇచ్చిన కుమారుడు… ఇప్పుడు తిరిగి రాని లోకాలకు వెళ్లిపోవడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.

పుట్టినరోజు వేడుకల్లోనే అమెరికాలో యువ సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి
Harikrishna

Edited By:

Updated on: Apr 13, 2026 | 9:53 PM

అమెరికా కాలిఫోర్నియాలో విజయనగరం జిల్లాకు చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్ మృతి విషాదంగా మారింది. పుట్టినరోజే కొడుకు మృతి చెందటంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
బొబ్బిలి మండలం పిరిడి గ్రామానికి చెందిన యువ సాఫ్ట్వేర్ ఉద్యోగి సింగిరెడ్డి సాయిశ్రీ హరికృష్ణ (26) మృతి విషాదాన్ని మిగిల్చింది. చిన్ననాటి నుంచి ఈతపై మక్కువ కలిగిన హరికృష్ణ, అమెరికాలో కూడా అదే ఆసక్తితో నదిలో ఈదేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయాడు. ఇంజినీరింగ్ పూర్తి చేసిన హరికృష్ణ 2023లో ఎంఎస్ చదవడానికి అమెరికాకు వెళ్లాడు. నాలుగు నెలల క్రితం ఒక ప్రైవేట్ టెక్నాలజీ కంపెనీలో సాఫ్ట్‌వేర్ ఉద్యోగం సాధించి, కుటుంబానికి ఆనందాన్ని ఇచ్చాడు.

శనివారం తన పుట్టినరోజు సందర్భంగా ఐదుగురు స్నేహితులతో కలిసి హరికృష్ణ మెరమెక్ స్టేట్ పార్క్‌కు వెళ్లాడు. అక్కడ సమీప నదిలో ఈదేందుకు దిగాడు. మిగతా స్నేహితులు ఒడ్డున ఉండగా అతను ఒంటరిగా లోపలికి ఈదుకుంటూ వెళ్లాడు. కొద్దిదూరం వెళ్లిన తర్వాత నీటిలో ఉన్న చెట్టు వేళ్లలో చిక్కుకుని బయటకు రావడానికి వీలు లేక మునిగిపోయాడు. స్నేహితులు వెంటనే రెస్క్యూ సిబ్బందికి సమాచారం ఇచ్చినా వారు చేరుకునే సరికి ఆలస్యమైంది. కష్టపడి నదిలో నుంచి బయటకు తీసిన హరికృష్ణను కాపాడలేకపోయారు. ఈ ఘటనతో పిరిడి గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. తల్లిదండ్రులు శ్రీనివాసరావు, రమ కన్నీటి పర్యంతమయ్యారు. ఎంతో ఆశలతో ఉన్న కుమారుడు ఇలా దూరమవడం వారిని తీవ్రంగా కలచివేసింది. స్థానిక ప్రజాప్రతినిధులు కూడా ఈ ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాసరావు చర్యలు చేపట్టారు. సాధ్యమైనంత త్వరగా మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకురావడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది.

Follow Us