Andhra News: సర్పంచి బరిలోకి ఎమ్మెల్యే కుమార్తె.. కోళ్ల ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి మరో తరం

సర్పంచ్ ఎన్నికల వేళ విజయనగరం జిల్లా రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుమార్తె హసితానాయుడు ఖాసాపేట సర్పంచ్ పదవికి నామినేషన్ దాఖలు చేయడంతో మరో తరం రాజకీయాల్లోకి ప్రవేశించింది. మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు రాజకీయ వారసత్వాన్ని లలితకుమారి కొనసాగిస్తుండగా, ఇప్పుడు ఆమె కుమార్తె గ్రామస్థాయిలో పోటీ పడటం ఆసక్తిని రేపుతోంది.

Andhra News: సర్పంచి బరిలోకి ఎమ్మెల్యే కుమార్తె.. కోళ్ల ఫ్యామిలీ నుంచి రాజకీయాల్లోకి మరో తరం
Third Generation Enters Politics

Edited By:

Updated on: Nov 18, 2026 | 2:56 PM

Vizianagaram: విజయనగరం జిల్లా రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. ఎస్.కోట ఎమ్మెల్యే కోళ్ల లలితకుమారి కుటుంబం నుంచి మరో తరం రాజకీయాల్లోకి అడుగుపెడుతోంది. ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారి స్వగ్రామమైన ఎల్.కోట మండలం ఖాసాపేట గ్రామ సర్పంచి పదవికి ఆమె కుమార్తె హసితానాయుడు పోటీకి సిద్ధమయ్యారు. ఈ మేరకు కుటుంబ సభ్యులు, పార్టీ నాయకుల సమక్షంలో ఆమె నామినేషన్ పత్రాలను దాఖలు చేశారు. ఎల్ కోట పంచాయతీ కార్యాలయానికి కుటుంబ సభ్యులతో కలిసి చేరుకున్న హసితానాయుడు ఎన్నికల అధికారులకు తన నామపత్రాలను అందజేశారు.

కోళ్ల కుటుంబానికి రాజకీయాలతో విడదీయలేని అనుబంధం ఉంది. ఈ కుటుంబ రాజకీయ ప్రస్థానంలో మాజీ మంత్రి కోళ్ల అప్పలనాయుడు కీలకమైన నాయకుడు. కోళ్ల లలితకుమారికి తాత, మామ అయిన అప్పలనాయుడు సుమారు నాలుగు దశాబ్దాల పాటు రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరించారు. 1962లో రేగిడి నియోజకవర్గం నుంచి, 1967లో శృంగవరపుకోట నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం అనంతరం ఎన్టీఆర్‌తో కలిసి టీడీపీలో కొనసాగారు. ఉత్తరాపల్లి నియోజకవర్గం నుంచి 1983, 1985, 1989, 1994, 1999 ఎన్నికల్లో వరుసగా ఐదుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.

మొత్తంగా ఏడుసార్లు శాసనసభకు ప్రాతినిధ్యం వహించిన ఆయన ఎన్టీఆర్ మంత్రివర్గంలో దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. 1999లో అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా కూడా వ్యవహరించారు. కోళ్ల అప్పలనాయుడు రాజకీయ వారసత్వాన్ని అందిపుచ్చుకున్న కోళ్ల లలితకుమారి 2009, 2014 ఎన్నికల్లో ఎస్ కోట ఎమ్మెల్యేగా విజయం సాధించారు. అనంతరం 2024 ఎన్నికల్లో మరోసారి ఎమ్మెల్యేగా ఎన్నికై ప్రస్తుతం నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అంతకుముందు లక్కవరపుకోట మండల పరిషత్ అధ్యక్షురాలిగా, విజయనగరం జిల్లా టీడీపీ అధ్యక్షురాలిగా కూడా బాధ్యతలు నిర్వహించారు.

ఇప్పుడు ఆమె కుమార్తె హసితానాయుడు ఖాసాపేట సర్పంచి ఎన్నికల బరిలోకి దిగడంతో కోళ్ల కుటుంబ రాజకీయ ప్రస్థానంలో మరో తరం ప్రవేశించినట్లయింది. తాత మాజీ మంత్రి, తల్లి ఎమ్మెల్యే.. ఇప్పుడు కుమార్తె గ్రామస్థాయి ప్రజాప్రతినిధిగా ఎన్నికల బరిలో నిలవడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది. కుటుంబానికి ఉన్న రాజకీయ నేపథ్యం, గ్రామంతో ఉన్న అనుబంధం నేపథ్యంలో ఖాసాపేట సర్పంచి ఎన్నికపై ఆసక్తి నెలకొంది.

హసితానాయుడు ఎన్నికల ప్రచారంలో ఎలాంటి వ్యూహంతో ముందుకు వెళ్తారు? గ్రామస్థుల స్పందన ఎలా ఉంటుంది? అన్నది ఎన్నికల వేళ ఆసక్తికరంగా మారింది. సహజంగా ఎమ్మెల్యే కుమారులు, కుమార్తెలు ఎమ్మెల్యే స్థాయి పదవి ఆశించడం పరిపాటి. కానీ ఎమ్మెల్యే లలిత కుమారి కుమార్తె గ్రామ సర్పంచ్ గా బరిలోకి దిగడం చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Loading...
Unable to load recommendations.
Follow Us