Andhra News: ఆ ఒక్క ప్రయాణం.. ఈ యువతి జీవితాన్ని ఎలా మార్చేసిందో చూశారా?

హైదరాబాద్‌ నగరంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదం.. విజయనగరం జిల్లాలోని ఓ చిన్న కుటుంబాన్ని చిద్రం చేసింది. ఈ ప్రమాదంలో ఆ పేద కుటుంబానికి పెద్ద ఆశగా మిగిలిన అక్షిత అర్ధాంతరంగా తనువుచాలించి ఆ కుటుంబాన్ని శోకసంద్రంలో ముంచింది. హైదరాబాద్‌లోని బంజారాహిల్స్‌లోని రోడ్‌ నెంబర్ 10లో ట్యాంకర్‌ బైక్‌ను ఢీకొట్టిన ప్రమాదంలో అక్షిత ప్రాణాలు కోల్పోయింది. ఈ ఘటన యువతి స్వగ్రామంలో తీవ్ర విషాదాన్ని నింపింది.

Andhra News: ఆ ఒక్క ప్రయాణం.. ఈ యువతి జీవితాన్ని ఎలా మార్చేసిందో చూశారా?
Hyderabad Road Accident

Edited By:

Updated on: Feb 26, 2026 | 9:12 PM

పసితనంలోనే తండ్రిని కోల్పోయి తండ్రి ప్రేమకి నోచుకోని అక్షితకు అన్నీ తానై పెంచింది ఆమె కన్నతల్లి. అక్షితతో పాటు తన అన్నయ్యని కూడా కంటికి రెప్పలా కాపాడుకుంది. అన్నీ తానై పిల్లలను ముందుకు నడిపించింది ఆ తల్లి. అన్నయ్య కూడా చిన్ననాటి నుండి ప్రతి అడుగులో చెల్లి అక్షితకు బలంగా తోడుంటూ వచ్చాడు. పసివయస్సు నుంచి కష్టాలు చూసి పెరిగిన అక్షిత పెద్దదైన తర్వాత తన కుటుంబానికి అండగా ఉండాలనుకుంది. విదేశాలకు వెళ్తే జీవితం మెరుగుపడుతుందని నిర్ణయించుకొని ఎలాగైనా ఫారెన్‌కు వెళ్లాలని టార్గెట్‌గా ఎంచుకుంది. కానీ ఆ కలలను మృత్యువు ముందే ఛిద్రం చేస్తుందని ఒక్క క్షణం కూడా ఏనాడు ఊహించలేదు.

గజపతినగరానికి చెందిన 22 ఏళ్ల అక్షిత విదేశాలకు వెళ్లేందుకు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తనకు సరైనదని హైదరాబాద్‌లోని హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ లో జాయిన్ అయ్యి కష్టపడి చదువుకుంది. ఆ కోర్స్ పూర్తైన తరువాత గత రెండేళ్లుగా ఉద్యోగం కూడా చేస్తోంది. ఇటీవల మలేషియాలో హోటల్ మేనేజ్మెంట్ కు సంబంధించిన మంచి అవకాశం వచ్చింది. విషయం తెలుసుకున్న కుటుంబసభ్యుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. వారం క్రితమే ఇంటికి వచ్చి ఆ శుభవార్తను చెప్పి ఇంట్లో వారితో సరదాగా గడిపి తిరిగి ఉద్యోగం కోసం హైదరాబాద్‌కు వెళ్లింది. అలా వెళ్లిన అక్షిత హైదరాబాద్ లో మెడికల్ సర్టిఫికెట్స్ కోసం ర్యాపిడో పై ప్రయాణిస్తుండగా ఎదురుగా వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో అక్కడికక్కడే ఆమె ప్రాణాలు కోల్పోయింది.

విషయం తెలుసుకున్న కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ఎన్నో ఆశలు పెట్టుకున్న తమ కుమార్తె అర్ధాంతరంగా తనువు చాలించడంతో వారిని ఓదార్చడం ఎవరి వల్ల కాలేదు. అనంతరం మృతదేహాన్ని హైదరాబాద్ నుంచి స్వగ్రామానికి తరలించారు. ఆమె అంత్యక్రియలు విజయనగరంలో కన్నీళ్ల మధ్య పూర్తయ్యాయి. విదేశాలకు వెళ్లి కుటుంబాన్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లాలన్న కల చేరువలో ఉండగానే జరిగిన ఈ దుర్ఘటన స్థానికంగా తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. కుటుంబానికి ఆధారం అయిన అక్షిత మృతిచెందడంతో తల్లి, అన్నయ్య, బంధువులు అంతా శోకసముద్రంలో మునిగిపోయారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us