బాబోయ్.. బైక్‌ స్టార్ట్ చేస్తుండగా ఏవేవో శబ్ధాలు.. కట్ చేస్తే, వణికిపోయే సీన్.. ఇదిగో వీడియో

విజయనగరం జిల్లా రాజాం ఆదర్శనగర్ కాలనీలో ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ద్విచక్రవాహనంలోకి సుమారు ఐదు అడుగుల నాగుపాము దూరడంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న స్నేక్ క్యాచర్ రమణయ్య ప్రత్యేక పరికరాల సహాయంతో పామును సురక్షితంగా బయటకు తీసి అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు.

బాబోయ్.. బైక్‌ స్టార్ట్ చేస్తుండగా ఏవేవో శబ్ధాలు.. కట్ చేస్తే, వణికిపోయే సీన్.. ఇదిగో వీడియో
Snake

Edited By:

Updated on: Jul 21, 2026 | 10:01 AM

విజయనగరం జిల్లా రాజాం మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్ కాలనీలో ఊహించని ఘటన చోటుచేసుకుంది. ఇంటి ముందు పార్క్ చేసి ఉన్న ఓ ద్విచక్రవాహనంలోకి సుమారు ఐదు అడుగుల పొడవున్న నాగుపాము దూరడంతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. బైక్‌ను బయటకు తీసేందుకు యజమాని ప్రయత్నిస్తున్న సమయంలో పాము కనిపించడంతో వెంటనే అప్రమత్తమయ్యాడు. విషయం తెలుసుకున్న కాలనీవాసులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని పరిస్థితిని గమనించారు. పాము విష సర్పం కావడంతో ఎవరూ దాని దగ్గరకు వెళ్లేందుకు సాహసం చేయలేదు. దీంతో స్థానికులు వెంటనే స్నేక్ క్యాచర్ రమణయ్యకు సమాచారం అందించారు. కొద్దిసేపటికే అక్కడికి చేరుకున్న రమణయ్య జాగ్రత్తగా బైక్‌ను పరిశీలించి, ఎలాంటి ప్రమాదం జరగకుండా ప్రత్యేక పరికరాల సహాయంతో నాగుపామును చాకచక్యంగా బయటకు తీశారు. ఈ ప్రక్రియ మొత్తం ఆసక్తిగా గమనించిన స్థానికులు పామును బంధించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

వీడియో..

నాగుపాము బయటకు వచ్చిన తర్వాత చాలామంది మొబైల్ ఫోన్లతో ఫోటోలు, వీడియోలు తీసుకున్నారు. పిల్లలు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో కొంతసేపు కాలనీలో సందడి నెలకొంది. అనంతరం పట్టుకున్న నాగుపామును జనావాసాలకు దూరంగా ఉన్న అటవీ ప్రాంతంలో సురక్షితంగా విడిచిపెట్టినట్లు స్నేక్ క్యాచర్ రమణయ్య తెలిపారు.

వీడియో చూడండి..

ఈ సందర్భంగా పాములు కనిపించినప్పుడు వాటిని చంపేందుకు ప్రయత్నించకుండా వెంటనే అటవీశాఖ అధికారులు లేదా శిక్షణ పొందిన స్నేక్ క్యాచర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు. వర్షాకాలంలో పాములు ఆశ్రయం కోసం ఇళ్లలోకి, వాహనాల్లోకి లేదా ఇతర వస్తువుల్లోకి చేరే అవకాశం ఎక్కువగా ఉంటుందని, అందువల్ల వాహనాలను ఉపయోగించే ముందు ఒకసారి జాగ్రత్తగా పరిశీలించడం మంచిదని తెలిపారు. ఈ ఘటనతో రాజాం ఆదర్శనగర్ కాలనీలో కొద్దిసేపు ఉత్కంఠభరిత వాతావరణం నెలకొంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us