Vizag Steel Plant: విశాఖ ఉక్కు కోసం ఉద్యమం మళ్లీ మొదలైంది. స్టీల్ ప్లాంట్‌ను ప్రైవేటైజేషన్ చేయాలని కేంద్రం నిర్ణయించడంతో వివిధ పార్టీల నేతలు, ప్రజా సంఘాలు రోడ్డెక్కుతున్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తక్షణం వెనక్కి తీసుకోవాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. విశాఖ ఉక్కు కర్మాగారం దేశంలోని మిగతా కర్మాగారాల లాగా కేవలం ఒక పరిశ్రమగా మాత్రమే చూడొద్దని, విశాఖ ఉక్కు మా ఆత్మ గౌరవం, మా నగరం పేరే ఉక్కు నగరం అని అన్నారు. ఉక్కు సంకల్పంతోనే సాధించుకున్నాం. విశాఖ ఉక్కు నుంచి విశాఖ ను వేరు చేయడం అంటే మా ప్రాణాల్ని మా దేహాల నుంచి వేరు చేయడమే. విశాఖ ఉక్కు 5 కోట్ల ఆంధ్రుల, 20 కోట్ల తెలుగు ప్రజల మనోభావాలు, రాజీ లేని పోరాటాలకు ప్రతీక. దయచేసి మా సెంటిమెంట్ ని ముట్టుకోవద్దంటున్నాయి.
కాగా, 1966 నుంచి దశాబ్దకాలం పాటు ‘విశాఖ ఉక్కు-ఆంధ్రుల హక్కు’ నినాదంతో తెలుగు ప్రజలు సుదీర్ఘ పోరాటంలో 32మంది ప్రాణ త్యాగాలు, 64 గ్రామాల ప్రజలు ఇళ్ళు ఖాళీ, 22,000 ఎకరాల భూమిని త్యాగం చేసి సాధించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని కాపాడుకునేందుకు ఎలాంటి పోరాటానికైనా సిద్దమేనని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ఆదాయ వనరుల కోసం ఇతర ప్రత్యామ్నాయాలు చూసుకోవాలి. ఇంత పెద్ద ఉక్కు ఫ్యాక్టరీకి సొంత కాప్టివ్ ఐరన్ ఓ ఖనిజ వ్యవస్థ లేదు. దీన్ని బయట నుంచి కొనాల్సి రావడం వల్లే టన్నుకు 5,000 రూపాయల నష్టం వాటిల్లుతోందని స్టీల్ మినిస్ట్రీ చెబుతోంది.
కాగా, 1966 నవంబర్ 1న విశాఖలో ప్రదర్శన చేస్తున్న నిరసనకారులపై పోలీసులు కాల్పులు జరిపారు. ముగ్గురు విద్యార్థులు, మరో ఆరుగురు వ్యక్తులు మరణించారు. ఆ రోజు విశాఖతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పోలీసు కాల్పుల్లో మొత్తం 32 మంది మరణించారు. అర్ధశతాబ్దం కిందట విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో చేపట్టిన ఉద్యమంలో జరిగిన ఘటన ఆ తర్వాత మూడేళ్లకు కేంద్ర ప్రభుత్వం కర్మాగారం ఏర్పాటును ప్రకటించింది. 1971లో శంకుస్థాపన చేస్తే రెండు దశాబ్దాల తర్వాత పూర్తి స్థాయి పని ప్రారంభించింది. ఇప్పుడు కడప ఉక్కు కర్మాగారం కోసం కూడా మళ్లీ ఆ స్థాయి పోరాటం చేయాలని అధికార, ప్రతిపక్ష పార్టీలు పులుపునిస్తున్నాయి. కానీ ఈ పిలుపు వెనుక ఉక్కు పరిశ్రమ సాధించడం కన్నా రాజకీయ ప్రయోజనాల మీదే పార్టీలు దృష్టి కేంద్రీకరిచాయన్న విమర్శలు వస్తున్నాయి.
1966 అక్టోబర్, నవంబర్ నెలలో ఉద్యమం బలపడింది. విశాఖ ఉక్కు- ఆంధ్రుల హక్కు అనే నినాదంతో ప్రజలు ఉద్యమించారు. గుంటూరు జిల్లా తాడికొండకు చెందిన టి. అమృతరావు 1966 అక్టోబర్ 15న విశాఖలో అమరణ నిరాహార దీక్ష ప్రారంభించారు. కొద్ది రోజులకే కాలేజీలు, స్కూళ్ల విద్యార్థులు ఉద్యమంలోకి వచ్చి ముందు వరుసలో నిల్చున్నారు. వారికి రాజకీయ పార్టీలు మద్దతుగా నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు ప్రారంభించారు. దశల వారీగా తరగతుల బహిష్కరణ, బంద్‌లు, హర్తాళ్లు, సభలు, సమ్మెలు, నిరాహార దీక్షలు సాగాయి. అన్ని రాజకీయ పక్షాలతో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో తెన్నేటి విశ్వనాథం, వి.భద్రం, రవిశాస్త్రి తదితరులు ప్రసంగించారు.
1966 నవంబర్ 1న విశాఖలో విద్యార్థులు భారీ ప్రదర్శన చేపట్టారు. ఆందోళనకారులను చెరగొట్టేందుకు చేసిన ప్రయత్నం విఫలం కావడంతో పోలీసులు కాల్పులు జరిపారు. తొమ్మిదేళ్ల బాలుడు కె. బాబురావు సహా తొమ్మిది మంది మరణించారు. వారిలో ముగ్గురు విద్యార్థులున్నారు.
కాగా, ప్రస్తుతం ఈ ప్లాంట్ 26,000 ఎకరాలలో విస్తరించి ఉంది. దీని సామర్థ్యం ఏటా 7.3 మిలియన్ టన్నులు. దాదాపు 16,000 మంది శాశ్వత ఉద్యోగులు, 17,500 మంది కాంటాక్ట్ కార్మికులు పని చేస్తున్నారు. పరోక్షంగా మరో లక్ష మంది ఉపాధి పొందుతున్నారు. కానీ విశాఖ ఉక్కు కర్మాగారానికి ఇనుప ఖనిజం గనులు లేకపోవడంతో తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటోంది.