నెల్లూరు జిల్లాలో చేతబడి కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్నాడని భార్గవ్ అనే వ్యక్తిపై చేతబడి చేసినట్లు అతడి తల్లిదండ్రులు, భార్య ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం అతడు తీవ్ర అనారోగ్యంతో ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
వివరాల్లోకి వెళ్తే.. నెల్లూరుకు చెందిన ముని భార్గవ్, కావలికి చెందిన ప్రత్యూష ప్రేమించుకున్నారు. అయితే వీరి ప్రేమను పెద్దలు అంగీకరించకపోవడంతో రహస్య వివాహం చేసుకున్నారు. అయితే భార్గవ్‌ను వదిలేసి రావాలని ప్రత్యూష తల్లిదండ్రులు ఆమె మీద ఒత్తిడి తీసుకొచ్చారు. కానీ భార్గవ్‌ను వదిలి రానని ప్రత్యూష తెగేసి చెప్పింది.
ఇదిలా ఉంటే ఇటీవల భార్గవ్ తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో అతడిపై బాణామతి ప్రయోగం చేశారని తల్లిదండ్రులు, భార్య ఆరోపిస్తున్నారు. క్షుద్ర పూజల కారణంగా తమ కుమారుడు అనారోగ్యం పాలయ్యాడని వారు ఆరోపణలు చేస్తున్నారు. కడప జిల్లా కమలాపురంకు చెందిన పవన్ కుమార్ అనే వ్యక్తి క్షుద్ర పూజలు చేసినట్లు భార్గవ్ తండ్రి చెబుతున్నారు. ఈ మేరకు ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పవన్‌ను అదుపులోకి తీసుకున్నారు. అయితే తాను గణపతి పూజ మాత్రమే చేశానని అతడు అంటున్నాడు.
మరోవైపు క్షుద్ర పూజల చేయాల్సిన అవసరం ఏంటని యువతి తల్లిదండ్రుల ప్రశ్నిస్తున్నారు. ఇలాంటి నమ్మకాలతో అబాండాలు వేయడం సరైంది కాదని కుటుంబసభ్యులు చెబుతున్నారు. హేతువాద సంఘాలు కూడా భార్గవ్ తల్లిదండ్రుల ఆరోపణలపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.