తూర్పుగోదావరి జిల్లా కచ్చలూరు దగ్గర గోదావరిలో జరిగిన బోటు ప్రమాదంలో గల్లంతైన 38 మంది కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. 80 మంది ఎన్డీఆర్ఎఫ్ సభ్యులు, ఒక ఎస్డీఆర్ఎఫ్ బృందం, ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్లు జోరుగా గాలిస్తున్నారు. రెండు హెలికాప్టర్లను రెస్క్యూ ఆపరేషన్ కోసం వాడుతున్నారు. గల్లంతైన వారు నీటిలో కొట్టుకుపోయారా..? లేక బోటులోనే చిక్కుకుపోయారా..? అన్నది ఇంకా తెలియరాలేదు. తాజాగా ధవళేశ్వరం బ్యారేజీ గేట్ల నుంచీ ఓ డెడ్ బాడీ కిందికి కొట్టుకుపోయినట్లు అధికారులు చెబుతున్నారు. పోలవరం దాటిన తరువాత గోదావరి రకరకాల పాయలుగా చీలిపోతుంది. నీటిలో కొట్టుకోని పోయి ఉంటే ఎవరు ఏ పాయ వైపు కొట్టుకుపోయారో తెలుసుకోవడం చాలా కష్టం.
ఇదిలా ఉంటే ప్రమాదంలో మునిగిపోయిన బోటు.. ఏకంగా 315 అడుగుల లోతులో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఉత్తరాఖండ్ నుంచి తీసుకొచ్చిన సైడ్ స్కాన్ సోనార్ బోటు జాడను కనిపెట్టింది. ఇక దాన్ని బయటకు తీయడమే మిగిలి ఉంది. అది చాలా కష్టమైన వ్యవహారంగా చెబుతున్నారు. అంత లోతులో ఉండటం వల్ల బయటకు తీసేలోపు అది ముక్కలైపోయే అవకాశాలు ఉన్నాయని పలువురు అంటున్నారు. చూడాలి మరి అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో.