Vizag: మ్యాట్రిమోనిలో పరిచయమైన అందాల బొమ్మ.. ఆరాటపడితే ఆఖరికి ఇది సినిమా..

| Edited By: Ram Naramaneni

Aug 02, 2024 | 1:00 PM

మోసపోయే మనుషులు ఉన్నంతకాలం.. మోసాలు చేసే మనుషులు పుట్టుకొస్తూనే ఉంటారు. దొంగ చేతికి తాళం ఇస్తే ఊరుకుంటారా మరి..?! భలే ఛాన్సులే అంటూ.. ఉన్నదంతా ఉడ్చేస్తారు. తాజాగా ఆన్లైన్లో అటువంటి వాళ్లే మిమ్మల్ని టార్గెట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మోసాలు చేసిన వారిలో మహిళలు కూడా ఉండడం ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం. మగాళ్లు జర భద్రం. విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు కటకటాల్లోకి నెట్టిన ఆ కన్నింగ్ లేడీ క్రైమ్ కథ చిత్రం తెలుసుకుందాం పదండి..

Vizag: మ్యాట్రిమోనిలో పరిచయమైన అందాల బొమ్మ.. ఆరాటపడితే ఆఖరికి ఇది సినిమా..
Sai Priya
Follow us on

డేటింగ్ యాప్.. ఇన్స్టా… వాట్సాప్.. మ్యాట్రిమోనీ సైట్.. వాట్ నాట్.. ఇవన్నీ ఇప్పుడు మోసాలకు కేరాఫ్‌గా మారిపోతున్నాయి. మేము తక్కువా అన్నట్లు ఈ మధ్య.. లేడీ క్రిమినల్స్ సీన్‌లోకి వస్తున్నారు.  ఏమార్చి మాటల్లోకి దింపి నమ్మించి నిలువునా ముంచేస్తున్నారు.

విశాఖ సాఫ్ట్ వేర్ ఉద్యోగికి..

విశాఖకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి పెళ్లై.. భార్యకు దూరమయ్యాడు. వ్యక్తిగత కారణాలతో విడాకులు కూడా తీసుకున్నాడు. ఈ క్రమంలో మరో జీవిత భాగస్వామి కోసం ఎదురు చూశాడు. ఆన్లైన్లో సెర్చ్ చేయడం ప్రారంభించాడు. మ్యాట్రిమోనీ సైట్‌లో చెక్ చేస్తుండగా ఓ అందమైన అమ్మాయి కనిపించింది. ఓ అడుగు ముందుకు వేశాడు. ఇన్స్టా ద్వారా ఇద్దరు దగ్గరయ్యారు. ఇక అప్పుడు నుంచి ఇద్దరు చాటింగ్ మొదలు పెట్టుకున్నారు. కుర్రాడి వాట్సప్ నెంబర్ తీసుకొని అందమైన ఫోటోలు పెట్టింది.

నమ్మించి.. ఉరించి..

దీంతో.. అప్పటికే జీవిత భాగస్వామికి దూరమై.. నైరాశ్యంలో ఉన్న ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి.. మరో ఆడ తోడు దగ్గరవ్వడంతో.. సంబరపడిపోయాడు. ఇద్దరు మాటలు కలిసాయి.. మనసులు దగ్గరయ్యాయి.. ఎమోషనల్ టచ్ కూడా తోడైంది. వ్యక్తిగత సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకున్నారు. పెళ్లి చేసుకుంటానని చెప్పడంతో మరింత నమ్మేశాడు. కేవలం మెసేజ్‌లే తప్ప డైరెక్ట్‌గా కాల్ మాట్లాడుకోలేదు. కాల్ కలిపేందుకు ఎప్పుడు ప్రయత్నించినా.. ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు అని కట్ చేసేది ఆమె. ఆ తర్వాత క్రమంలో కేవలం వాట్సాప్ కాల్స్ మాత్రమే మాట్లాడేది. అది కూడా ఆడియో కాల్స్ మాత్రమే మాట్లాడేది.

ఎమోషన్ టచ్‌తో 22 లక్షలు..

మరి కాస్త దగ్గర అయిన తర్వాత అక్కడ నుంచి మొదలుపెట్టింది తన అసలు వ్యవహారం. తనకు గతంలో ఒక బాయ్ ఫ్రెండ్ ఉండేవాడని.. తాను తనను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని.. డబ్బులు అడుగుతూ వేధిస్తున్నాడని.. చెప్పింది. ఎంతలా అంటే ఈ సాఫ్ట్వేర్ ఉద్యోగి మనసు కరిగిపోయేంత. ఇటువంటి మరికొన్ని మాటలతో.. అవతల మనిషిని కట్టి పడేసింది. ఎందుకు అంత కష్టం నేనున్నాను కదా అన్నాడు. ఇదే అదునుగా దప దఫాలుగా అతని నుంచి ఏకంగా 22 లక్షలు లాగేసింది. ఆ తర్వాత మరింత క్లోజ్ అవ్వడంతో.. ఎప్పుడు కలిసేందుకు ట్రై చేశాడు.. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్. కానీ ఆమె అందుకు నిరాకరిస్తూ ఉండటంతో.. అనుమానం కలిగింది. దీంతో విశాఖలో సైబర్ క్రైమ్ పోలీసులకు ఆశ్రయించాడు బాధితుడు. రంగంలోకి దిగిన పోలీసులు.. వాట్సప్ కాల్స్, టెక్నికల్ ఎవిడెన్స్‌తో ప్రత్యేక బృందాన్ని హైదరాబాద్‌కు పంపారు. అక్కడ వారం రోజులపాటు శ్రమించిన విశాఖ సైబర్ క్రైమ్ పోలీసులు… ఎట్టకేలకు నిందితురాలని పట్టుకున్నారు.

పోలీసులకే షాక్.. ఆమె ఎవరంటే..

నిందితురాలు పేరు బత్తిన సాయి ప్రియ.. వయసు 30 ప్లస్.. హైదరాబాద్ మాదాపూర్ లో నివాసం. బాధితుడు ఇచ్చిన ఫోటోలు.. ప్రత్యక్షంగా కనిపించిన ఆ మహిళ ఒకటి కాదు. కానీ.. టెక్నికల్ ఎవిడెన్స్ అన్ని ఆమె చుట్టే తిరిగాయి. పోలీసుల ప్రశ్నిస్తే అసలు విషయం బయటపడింది.. సాఫ్ట్వేర్ ఇంజనీర్ తో స్వీట్‌గా మాట్లాడి 22 లక్షల లాగేసింది సదరు ఆంటీ సాయి ప్రియే. ఆమె ఫోటోలకు బదులు.. అందమైన అమ్మాయిలు ఫోటోలను పంపించి.. ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి తాను అన్నట్టు నమ్మించింది. అందమైన అమ్మాయిల నటిస్తూ.. క్యూట్ గా స్వీట్ గా మాటలు కలుపుతూ.. ఎమోషన్ టచ్ చేస్తూ.. సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ తో ఆడుకుంది. 22 లక్షలు లాగేసి హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ.. ముఖం చాటేసే ప్రయత్నం చేసిందని తెలిపారు సైబర్ క్రైం సిఐ భవానీ ప్రసాద్.

ఆమె సోషల్ మీడియా అకౌంట్ చెక్ చేసి.. మరి కొంతమందితోనూ ఇలానే చాటింగ్ చేసినట్లు గుర్తించారు. ఆమెను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పాపం.. జీవిత భాగస్వామి కోసం వెతికి.. మోసపోయిన ఆ బాధితుడు ఎమోషన్స్ అన్నీ ఇన్నీ కావు. ఎందుకంటే డబ్బులు పోతే పోయాయి.. అంతలా దగ్గర మనసు పడ్డ మహిళ చీటర్ అని తెలిశాక.. అతని బాధ బాధ కాదు. అందుకే సోషల్ మీడియాలో ఉండే ఫోటోలను చూసి మోసపోవద్దని సూచిస్తున్నారు పోలీసులు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..