విశాఖ తెన్నేటి పార్క్ సమీపంలో భారీ నౌక ఒడ్డుకు కొట్టుకు వచ్చింది. వాయుగుండం ప్రభావంతో గత రాత్రి సముద్రంలో గాలుల తాకిడికి ఈ నౌక ఒడ్డుకు కొట్టుకు వచ్చినట్లు తెలుస్తుంది. విషయం తెలిసిన నగరవాసులు భారీ నౌకను ఆసక్తిగా చూస్తున్నారు.
వాయుగుండం ప్రభావంతో గత రాత్రి గాలితీవ్రత ఎక్కవగా ఉండటంతో నౌక ఒడ్డుకు కొట్టుకుని వచ్చిన నౌక… పార్క్ సమీపంలోని రాళ్లలో చిక్కుకుంది. అర్ధరాత్రి సమయంలో ఇసుక తిన్నుల మధ్య చిక్కుకోగా.. నౌకలో ఉన్న 15 మంది సిబ్బంది సురక్షితంగా బయటపడ్డారు. యాంకర్లు రెండూ ధ్వంసం కావడంతో సమస్య తలెత్తినట్లు అధికారులు చెబుతున్నారు. విషయం తెలుసుకున్న నేవీ అధికారులు, పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నౌకను బయటకు తీసేందుకు సహాయక చర్యలు చేపట్టారు.
మరోవైపు, బంగాళాఖాతంలో కొనసాగుతున్న వాయుగుండం కారణంగా తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. హైదరబాద్‌లో పలు చోట్ల అర్ధరాత్రి నుంచి వర్షం పడుతోంది. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో వాయుగుండం కొనసాగుతోంది. పశ్చిమ వాయవ్య దిశగా పయనించి ఇవాళ తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం పేర్కొంది. విశాఖ-నరసాపురం మధ్య కాకినాడ సమీపంలో తీరందాటే అవకాశం ఉన్నట్లు తెలిపింది. తీరం వెంబడి గంటకు 55-75 కిలో మీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది.