ఏపీలో తొలి దిశ పోలీస్ స్టేషన్ ప్రారంభమైంది. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఏర్పాటు చేసిన ఈ దిశ పోలీస్ స్టేషన్‌ను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో హోం మంత్రి మేకతోటి సుచరిత, పలువురు మహిళా మంత్రులు, ఏపీఐఐసీ చైర్ పర్సన్ రోజా, డీజీపీ గౌతం సవాంగ్ తదితరులు పాల్గొన్నారు. 24 గంటలూ ఈ పోలీస్ స్టేషన్ అందుబాటులో ఉండేలా కంట్రోల్ రూం కూడా ఏర్పాటు చేశారు. దిశ చట్టానికి సంబంధించిన ఓ ప్రత్యేక యాప్‌ను కూడా ఈ సందర్భంగా సీఎం జగన్ ప్రారంభించనున్నారు. దిశా చట్టం ప్రకారం అత్యాచార కేసుల విషయంలో 14 రోజుల్లో దర్యాప్తు పూర్తిచేసి.. 21 రోజుల్లోపే శిక్ష ఖరారయ్యేటట్టుగా ఈ చట్టాన్ని రూపొందించినట్లు సీఎం జగన్ తెలిపారు. మహిళల రక్షణే లక్ష్యంగా ఏపీ ప్రభుత్వం దిశ పోలీస్ స్టేషన్లను ఏర్పాటు చేస్తోందని.. వీటి ద్వారా మహిళలకు ప్రత్యేకంగా పూర్తిస్థాయి భద్రత కల్పించబోతున్నట్లు హోం మంత్రి సుచరిత తెలిపారు.
కాగా.. దిశ వంటి ఘటనల్లో కేసులు నమోదైతే.. రెండు వారల్లో దర్యాప్తు, విచారణ పూర్తి చేసి… సరైన సాక్ష్యాధారాలు ఉంటే.. దోషులకు కేసు ఫైల్ అయ్యినప్పటి నుంచీ.. 21 రోజుల్లో శిక్ష అమలు అయ్యేలా ఉంది. అయితే ఇందుకోసం ప్రతి జిల్లాలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలకు పాల్పడితే.. ఘటన తీవ్రతను బట్టి.. ఉరిశిక్షకూడా విధిస్తారు.