
విశాఖపట్నం మెట్రోపై ఏపీ ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. మెట్రో ప్రాజెక్ట్ కేంద్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ స్పష్టం చేశారు. రైడర్స్ సంస్థ మెట్రో ప్రాజెక్టుపై అధ్యయనం చేస్తోందని, రెండు నెలల్లో అధ్యయనం పూర్తయ్యే అవకాశముందని తెలిపారు. అటు హైదరాబాద్‌లో ఓఆర్ఆర్ తరహాలో విశాఖపట్నంలో సెమీ రింగ్ రెడ్డు నిర్మాణం చేపడతామని అన్నారు. ఈ రింగ్ రోడ్డు నిర్మాణం పూర్తయితే విశాఖలో ట్రాఫిక్ రద్దీ తగ్గతుందని చెప్పారు. సెమీ రింగ్ రోడ్డు నిర్మాణానికి వీఎఆర్డీఏ అధ్యయనం చేస్తోందని, విశాఖపట్నం అభివృద్దికి హడ్కో సహకారం కీలకమని వ్యాఖ్యానించారు.
విశాఖపట్నం మెట్రోకు త్వరలోనే కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతులు వచ్చే అవకాశముందని మంత్రి నారాయణ ప్రకటించారు. రెండు, మూడు రోజుల్లో కేంద్రం నుంచి అనుమతి వస్తుందని తెలిపారు. త్వరలో మెట్రో నిర్మాణం కోసం టెండర్లను ఆహ్వానించనున్నట్లు చెప్పారు. మూడేళ్లల్లో మెట్రోను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలనే లక్ష్యం పెట్టుకున్నట్లు స్పష్టం చేశారు. విశాఖలో పట్టణ గృహ నిర్మాణశాఖపై జరిగిన రిజినల్ వర్క్ షాప్‌లో నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కార్పొరేషన్లు, మున్సిపాలిటీలకు ఆదాయ మార్గాలను ఆన్వేషించనున్నట్లు తెలిపారు. ఇక రాంబిల్లి-భోగాపురం ప్రాజెక్టును వీఎంఆర్‌డీయే పరిశీలిస్తోందన్న ఆయన.. మాస్టర్‌ప్లాన్ రోడ్డులో ఒక రోడ్డుకు అటవీ భూమి అడ్డంకిగా ఉందని అన్నారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌తో మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.
విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ నుంచి కొమ్మాది వరకు తొలి దశలో మెట్రో నిర్మాణం చేపట్టనున్నారు. తొలి దశలో 46.23 కిలోమీటర్ల మేర నిర్మించనుండగా.. ఇందులో మూడు కారిడార్లు ఉంటాయి. స్టీల్ ప్లాంట్-కొమ్మాది, ఓల్డ్ పోస్టాఫీస్-గురుద్వారా, చినవాల్తేరు-తాటిచెట్లపాలెం మార్గంలో మెట్రో నిర్మించనున్నారు. ఇక 20.16 కిలోమీటర్ల మేర డబుల్ డెక్కర్ విధానంలో మెట్రో ప్రాజెక్ట్ ఉంటుంది. ఇప్పటికే మెట్రో ప్రాజెక్టుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. ఇప్పటికే డీపీఆర్‌ను రూపొందించగా.. దీనికి కూడా కేంద్రం నుంచి అనుమతి రావాల్సి ఉంది. డీపీఆర్‌కు త్వరలో కేంద్రం అనమతి జారీ చేయనుంది. అనంతరం టెండర్లను పిలిచి పనులు చేపట్టనున్నారు. కేంద్ర, రాష్ట్రం కలిసి ఈ మెట్రో నిర్మాణం చేపట్టనున్నాయి. కేంద్రం తన వాటాగా కొంతమొత్తం కేటాయించేందుకు ముందుకొచ్చింది. అటు విజయవాడ మెట్రోకు కూడా కేంద్రం అనుమతి ఇచ్చింది. త్వరలో సర్వే చేపట్టనుండగా.. ఆ తర్వాత డీపీఆర్‌ను రూపొందించనున్నారు. అనంతరం కేంద్ర ప్రభుత్వ ఆమోదానికి పంపనున్నారు.