Vizianagaram Train Accident Live: విజయనగరం రైలు ప్రమాదం.. కారణం అదేనా..!

|

Oct 30, 2023 | 1:12 PM

రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్‌ విచారం వ్యక్తం చేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. మృతుల్లో ఏపీకి చెందిన వారికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం అందిస్తామని సీఎం ప్రకటించారు.

Vizianagaram Train Accident Live: విజయనగరం రైలు ప్రమాదం.. కారణం అదేనా..!
Vizianagaram Train Accident

కంటకాపల్లి రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. సహాయక చర్యలు పూర్తయితే.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు 10 మృతదేహాలను వెలికితీయగా.. బోగీల మధ్య నలిగిపోయిన మృతదేహాలను ఇంకా తీయాల్సి ఉందని తెలుస్తోంది. బాధితులకు సహాయం, సమాచారం అందించడం కోసం విజయనగరం కలెక్టర్ కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేసినట్టు జిల్లా కలెక్టర్ ఎస్. నాగలక్ష్మి తెలిపారు. బాధితుల సమాచారం కోసం కలెక్టర్ కార్యాలయంలో 9493589157, రైల్వే కార్యాలయంలో 8978080006 ఫోన్‌ నంబర్లకు సంప్రదించాలని సూచించారు. అలాగే బాధితులకు సంబంధించి సమాచారం కోసం.. 0891 2746330, 0891 2744619 నెంబర్లకు ఫోన్‌ చేయాలని రైల్వే అధికారులు సూచించారు.

రైలు ప్రమాద ఘటనపై ఏపీ సీఎం జగన్‌ విచారం వ్యక్తం చేశారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని ఆదేశించారు. మృతుల్లో ఏపీకి చెందిన వారికి 10 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షల సహాయం అందిస్తామని సీఎం ప్రకటించారు. మృతుల్లో ఇతర రాష్ట్రాలకు చెందినవారు ఉంటే రూ.2 లక్షల రూపాయల ఎక్స్‌గ్రేషియా, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50వేల చొప్పున సహాయం చేస్తామని ప్రకటించారు. మరోవైపు మృతులకు కేంద్రం తరఫున రూ.10 లక్షల పరిహారం అందిస్తామని రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ తెలిపారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.2 లక్షలు, స్వల్పంగా గాయపడ్డవారికి రూ.50,000 అందిస్తామన్నారు. రైలు ప్రమాదంపై ప్రధాని మోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలిపారు. రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో మాట్లాడిన ప్రధాని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

అసలేం జరిగిందంటే…

విశాఖ నుంచి పలాస వెళ్తున్న ప్రత్యేక ప్యాసింజర్‌ రైలు కొత్తవలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద సిగ్నల్‌ కోసం పట్టాలపై ఆదివారం రాత్రి 7 గంటల సమయంలో ఆగి ఉండగా వెనకాలే వస్తున్న విశాఖ-రాయగడ రైలు ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మొత్తం 5 బోగీలు పట్టాలు తప్పాయి. సమాచారం అందగానే ఎన్డీఆర్‌ఎఫ్, రెవెన్యూ, పోలీసు సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. అటు ప్యాసింజర్‌ రైలు కావడంతో ప్రయాణికుల వివరాలు తెలుసుకోవడం అధికారులకు కష్టంగా మారింది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 30 Oct 2023 01:12 PM (IST)

    కంటకాపల్లిలో రెస్క్యూ ఆపరేషన్.. మరో గంటలో ట్రయల్‌ రన్‌ నిర్వహించే అవకాశం

    విజయనగరం జిల్లా కంటకాపల్లి దగ్గర ట్రాక్‌ పునరుద్ధరణ పనులు యుద్ధ ప్రాతిపదికన జరుగుతున్నాయి. ప్రమాదంలో 7 బోగీలు నుజ్జునుజ్జు అయ్యాయి. బోగీలను తొలగించేందుకు విశాఖ నుంచి బాహుబలి క్రేన్‌ను తీసుకొచ్చి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు. రాత్రి నుంచి 7 సహాయ బృందాలు నిరంతరాయంగా శ్రమిస్తున్నాయి. బోగీల తరలింపు, ట్రాక్‌ పునరుద్ధరణను వేగవంతం చేశారు.

    పలాస ప్యాసింజర్‌లోని 11 బోగీలను అలమండ స్టేషన్‌కు, రాయగడ ప్యాసింజర్‌ 9 బోగీలను కంటకాపల్లి స్టేషన్‌కు తరలించారు. సహాయ చర్యల్లో దక్షిణ మధ్య రైల్వే, వాల్తేరు, తూర్పు కోస్తా రైల్వే సిబ్బందితో పాటు NDRF‌, SDRF‌, RPF, పలు విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. ఘటనాస్థలి దగ్గర రెండు అంబులెన్స్‌లను అందుబాటులో ఉంచారు.

    మరోవైపు రైలు ప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణ జరగుతోంది. మానవ తప్పిదమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. విశాఖ-రాయగడ ప్యాసింజర్ లోకోపైలట్‌ రైలు సిగ్నల్‌ను ఓవర్‌షూట్ చేసినట్టు అనుమానిస్తున్నారు. డెడ్‌స్లోగా వెళ్లాలన్న సిగ్నల్‌ను గమనించని లోకోపైలట్.. వేగంగా వెళ్లడంతో ఈ ప్రమాదం జరిగినట్టు అనుమానిస్తున్నారు. ఇంటర్‌ లాకింగ్ సిస్టమ్ వైఫల్యం లేదంటున్న నిపుణులు చెప్తున్నారు.

  • 30 Oct 2023 12:48 PM (IST)

    వైయస్‌.జగన్‌ విజయనగరం జిల్లా పర్యటనలో స్వల్ప మార్పు.

    • రైల్వే అధికారుల విజ్ఞప్తి మేరకు రైలు ప్రమాద ఘటనా స్ధల పరిశీలనకు కాకుండా నేరుగా ఆసుపత్రికి వెళ్లనున్న సీఎం.

    • ఘటనా స్ధలంలో ప్రమాదానికి గురైన బోగీలను తొలగించి యుద్ద ప్రాతిపదికన ట్రాక్‌ పునురుద్ధరణ పనులు చేపడుతున్నట్టు తెలిపిన అధికారులు.

    • ముఖ్యమంత్రి ఘటనా స్ధలానికి వస్తే… ట్రాక్‌ పునరుద్ధరణ పనులు ఆలస్యమయ్యే అవకాశం ఉందని… విజ్ఞప్తి చేసిన రైల్వే అధికారులు.

    • రైల్వే అధికారుల విజ్ఞప్తితో ప్రమాద ఘటనా స్ధల పరిశీలనకు కాకుండా… నేరుగా విజయనగరం వెళ్లనున్న సీఎం.

    • విజయనగరం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను పరామర్శించనున్న ముఖ్యమంత్రి శ్రీ వైయస్‌.జగన్‌.


  • 30 Oct 2023 12:27 PM (IST)

    రైలు ప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణ

    • — రైలు ప్రమాదంపై అత్యున్నత స్థాయి విచారణ
    • — మానవతప్పిదమే ప్రమాదానికి కారణమని ప్రాథమిక నిర్ధారణ
    • — విశాఖ-రాయగడ ప్యాసింజర్ లోకోపైలట్‌ రైలు సిగ్నల్‌ను ఓవర్‌షూట్ చేసినట్టు అనుమానం
    • — డెడ్‌స్లోగా వెళ్లాలన్న సిగ్నల్‌ను గమనించని లోకోపైలట్
    • — వేగంగా వెళ్లడంతో ప్రమాదం జరిగినట్టు అనుమానం
    • — ఇంటర్‌ లాకింగ్ సిస్టమ్ వైఫల్యం లేదంటున్న నిపుణులు
  • 30 Oct 2023 12:13 PM (IST)

    24 రైళ్ల రద్దు.. 26 రైళ్ల దారి మళ్లింపు..

    కంటకాపల్లి రైలు ప్రమాదంతో విశాఖ మీదుగా వెళ్లాల్సిన 24 రైళ్ల రద్దు అయ్యాయి.. మరో 26 రైళ్ల దారి మళ్లించారు..ఐతే విజయవాడ మీదుగా విశాఖ వెళ్లే రత్నాచల్, సింహాద్రి, MGR చెన్నై సెంట్రల్-పూరీ ఎక్స్‌ప్రెస్‌ రైళ్ల రద్దు కావడంతో విజయవాడ రైల్వే స్టేషన్‌ ఖాళీగా కనిపిస్తోంది.

  • 30 Oct 2023 12:00 PM (IST)

    బాలాసోర్ ఘటన మరువకముందే..

    విశాఖపట్నం నుంచి పలాస వెళ్తోన్న ప్యాసింజర్.. కొత్త వలస మండలం అలమండ-కంటకాపల్లి వద్ద ప్రమాదానికి గురైంది.సిగ్నల్ అందక మెయిన్ లైన్‌పై ఆగివున్న ప్యాసింజర్‌ను.. అదే ట్రాక్‌పై వచ్చిన విశాఖపట్నం-రాయగఢ మధ్య నడిచే పలాస ఎక్స్‌ప్రెస్ వేగంగా ఢీకొట్టింది. రైలు ప్రమాద ఘటనలో ఏడు రైలు బోగీలు ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది.క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలంలో రెస్య్కూ ఆపరేషన్ కొనసాగుతోంది.ప్రమాదంలో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముంది. అయితే, ఈ ఘోర రైలు ప్రమాదానికి సిగ్నలింగ్ ఫెయిల్యూర్ కారణమని సమాచారం. సిగ్నల్ లోపం వల్లే విశాఖపట్టణం-పలాస, విశాఖ-రాయగఢ ఒకే ట్రాక్‌పై పరస్పరం ఢీకొన్నట్లు తెలుస్తోంది. భారత దేశ రైల్వే చరిత్రలోనే అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచిన ఒడిషా బాలాసోర్ ట్రైన్ యాక్సిడెంట్ తరహాలోనే విజయనగరం ప్రమాదం సైతం జరిగింది. అయితే ఇంత అప్డేటేడ్ టెక్నాలజీ ఉన్న ఈ కాలంలో దేశంలో వరుస రైలు ప్రమాదాలు చోటుచేసుకోవడం ఆందోళనకు గురి చేస్తోంది. రైలు ప్రమాదాలను నివారించేందుకు ఇండియన్ రైల్వే తీసుకొచ్చిన ‘కవచ్’ టెక్నాలజీపై విజయనగరం ఘటనతో మరోసారి అనుమానాలు తలెత్తున్నాయి.

  • 30 Oct 2023 11:37 AM (IST)

    రైలు ప్రమాదంపై రివ్యూ..

    కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రమాదంపై రివ్యూ నిర్వహించారు.. అసలేం జరిగింది, ప్రమాదానికి కారణాలేంటి అని అధికారులను అడిగి తెలుసుకున్నారు.. మరోవైపు ప్రమాదం స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలపై ఆరా తీస్తున్నారు మంత్రి. అటు ఇదే రైలు ప్రమాదం కలచివేసిందని ఆవేదన వ్యక్తం చేశారు తమిళనాడు సీఎం స్టాలిన్.. తరచూ ఇలాంటి ప్రమాదాలు సంభవించడం.. ప్రమాద ఘంటికలను సూచిస్తోందని రైల్వే మంత్రిత్వ శాఖ.. తన భద్రత చర్యలను అత్యవసర పునఃసమీక్షించుకోవాల్సిన అన్నారు.

  • 30 Oct 2023 11:17 AM (IST)

    బాలాసోర్ ఘటన మరవకముందే.. మరో ఘోరం..

    బాలాసోర్ ఘటన జరిగి నాలుగు నెలలు గడిచినా..ఆ మహా విషాదం ఇంకా కళ్లముందే కదులుతోంది.ఇంతలోనే మరో ఘోరం కళ్లు మూసి తెరిచేలోపు క్షణాల్లో ప్రమాదం జరిగిపోయింది.విజయనగరం జిల్లాలో జరిగిన రైలు ప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది.. మరికాసేపట్లో విజయనగరం జిల్లాకు వెళ్లనున్నారు ఏపీ సీఎం జగన్‌..రైలు ప్రమాద ఘటనాస్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో క్షతగాత్రులను పరామర్శిస్తారు..ఇప్పటికే రైలుప్రమాద మృతుల కుటుంబాలకు పదిలక్షల చొప్పున, నష్టపరిహారం ప్రకటించారు..

     

  • 30 Oct 2023 11:02 AM (IST)

    కంటకాపల్లి రైలు ప్రమాదంతో ప్రయాణికుల అవస్థలు

    — కంటకాపల్లి రైలు ప్రమాదంతో ప్రయాణికుల అవస్థలు
    — విశాఖ మీదుగా వెళ్లాల్సిన 24 రైళ్ల రద్దు
    — మరో 26 రైళ్ల దారి మళ్లింపు
    — విశాఖ రైల్వే స్టేషన్లో చిక్కుకున్న రద్దైన రైళ్ల ప్రయాణికులు

    – వారంతా హెల్ప్ లైన్ కేంద్రాల వద్ద క్యూ
    – ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్న హెల్ప్ లైన్ సిబ్బంది
    – రద్దైన రైళ్ల టికెట్ల సొమ్ము వాపసు చేసేందుకు రైల్వే అధికారుల కసరత్తు
    – రోడ్డుమార్గం ద్వారా గమ్యస్థానాలకు చేరుతున్న కొంతమంది ప్రయాణికులు
    – ప్రత్యామ్నాయ రైళ్ల కోసం స్టేషన్‌లో పడిగాపులు కాస్తున్న మరికొంత మంది

  • 30 Oct 2023 10:20 AM (IST)

    కంటకాపల్లి రైలు దుర్ఘటనతో ప్రయాణికుల అవస్థలు

    – కంటకాపల్లి రైలు దుర్ఘటనతో ప్రయాణికుల అవస్థలు

    – విశాఖ నుంచి విశాఖ మీదుగా వెళ్లాల్సిన 24 రైళ్ల రద్దు.. మరో 26 రైళ్ల దారి మళ్లింపు

    – విశాఖ రైల్వే స్టేషన్లో చిక్కుకున్న రద్దయిన రైళ్ల ప్రయాణికులు

    – హెల్ప్ లైన్ కేంద్రాల వద్ద ప్రయాణికుల క్యూ

    – ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందిస్తున్న హెల్ప్ లైన్ సిబ్బంది

    – రద్దు అయిన రైళ్ల టికెట్ల సొమ్ము వాపసు చేసేందుకు రైల్వే సన్నహాలు

    – రోడ్డు మార్గం ద్వారా గమ్యస్థానాలకు చేరుతున్న కొంతమంది ప్రయాణికులు

    – ప్రత్యామ్నాయ రైళ్ల కోసం స్టేషన్లో పడిగాపులు కాస్తున్న మరి కొంతమంది

  • 30 Oct 2023 10:00 AM (IST)

    12.45కు ఘటనాస్థలిని పరిశీలించనున్న సీఎం

    విశాఖ ఎయిర్ పోర్ట్ నుంచి 12.30 కి హెలికాప్టర్ లో అలమండ చేరుకోనున్న సీఎం

    12.45 కు అలమంద నుంచి ప్రత్యేక కోచ్ లో ఘటనా స్థలాన్ని పరిశీలించనున్న ముఖ్యమంత్రి

    అనంతరం విజయనగరం మహా రాజా హాస్పిటల్ లో క్షతగాత్రులను పరామర్శించమున్న ముఖ్యమంత్రి

  • 30 Oct 2023 09:53 AM (IST)

    రైలు దుర్ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతిలో సిబ్బంది ఉద్యోగులు

    – రైలు దుర్ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతిలో సిబ్బంది ఉద్యోగులు

    – ట్రైన్ గార్డ్ శ్రీనివాసరావు, లోకో అసిస్టెంట్ పైలెట్ రావు మృతితో ఆవేదనలో సహ సిబ్బంది

    – టీవీ9తో రైల్వే గార్డ్

    – దుర్ఘటన దురదృష్టకరం.. తోటి సహచరులతో పాటు ప్రయాణికులను కోల్పోయాం

    – కొద్దిరోజుల క్రితమే గార్డ్ శ్రీనివాసరావుతో మాట్లాడా.. సిన్సియర్ ఉద్యోగి శ్రీనివాసరావు

    – దురదృష్టకరమైన వార్త వినాల్సి వచ్చింది

    – రైల్వేలో అంతా ఆటోమేటిక్ సిస్టమేటిక్ పై నడుస్తుంది

    – ముందు రైలు ఉంటే వెనుకున్న ట్రైన్ డ్రైవర్ కు టెక్నికల్ గా డిస్టెన్స్ ఇండికేషన్ కూడా కనిపిస్తుంది

  • 30 Oct 2023 09:20 AM (IST)

    రాజమండ్రి నుంచి రద్దైన రైళ్లు ఇవే..

    రాజమండ్రి నుండి విజయనగరం మీదుగా వెళ్లే రైలును రద్దు చేశారు దక్షిణ మధ్య రైల్వే అధికారులు. విజయనగరం రైల్వే ప్రమాదం ఘటన నేపథ్యంలో రాజమండ్రి మీదుగా వచ్చే పలు రైళ్లు రద్దు చేసినట్లు వెల్లడించారు. ప్రయాణికులు ఇబ్బందులు పడకుండా హెల్ప్ డెస్క్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడిస్తున్నారు. రద్దయిన రైలుకు సంబంధించిన ప్రయాణికులకు రిఫండ్ ఇస్తున్నట్లుగా వెల్లడించారు.

    విజయవాడ, విశాఖ నుండి రాజమండ్రి మీదుగా మొత్తం 7 ప్రధాన రైళ్లను రద్దు చేసింది రైల్వే శాఖ. దీంతో పాటు నాలుగు రైళ్ళను విజయవాడ మీదుగా డైవర్ట్ చేశారు రైల్వే అధికారులు.

    రద్దయిన రైలు వివరాలు..

    మద్రాస్ టూ పూరి..

    రాయగడ – గుంటూరు..

    గుంటూరు విశాఖపట్నం(సింహాద్రి ఎక్స్‌ప్రెస్)..

    రాజమండ్రి – విశాఖపట్నం..

    బెజవాడ – విశాఖపట్నం(రత్నాచల్)..

    గుంటూరు – రాయగడ..

    విశాఖపట్నం – రాజమండ్రి ట్రైన్లు ప్రస్తుతం రద్దు అయినట్లు రైల్వే అధికారులు వెల్లడించారు.

  • 30 Oct 2023 09:03 AM (IST)

    రైల్వే ప్రమాద ఘటనపై అత్యున్నత విచారణ

    – సికింద్రాబాద్ నుంచి ప్రత్యేక రైల్లో కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ప్రంజీవ్ సక్సేన

    – విశాఖ చేరుకున్న కమిషనర్ ఆఫ్ రైల్వే సేఫ్టీ ప్రత్యేక రైలు

    – విశాఖ నుంచి ఘటన స్థలికి వెళ్తున్న సేఫ్టీ కమిషనర్ సక్సెనా

    – మూడు భోగిలతో ప్రత్యేక రైలు.. ఘటనా స్థలంలో విచారణ చేయనున్న రైల్వే సేఫ్టీ కమిషనర్ సక్సేనా

  • 30 Oct 2023 08:50 AM (IST)

    విజయనగరం రైలు ప్రమాదం.. కాసేపట్లో ఘటనాస్థలికి సీఎం..

    విజయనగరం రైలు ప్రమాద ఘటన తెలుగు రాష్ట్రాల ప్రజలను దిగ్బ్రాంతికి గురి చేసింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 14 మంది చనిపోగా.. 100 మందికి పైగా ప్రయాణీకులు గాయాలపాలయ్యారు. మరో ఐదుగురి పరిస్థితి విషయంగా ఉంది. ఇదిలా ఉంటే.. ఏపీ సీఎం వైఎస్ జగన్ మరికాసేపట్లో కంటకాపల్లి ఘటనాస్థలికి వెళ్లనున్నారు. రైలు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించనున్నారు.

  • 30 Oct 2023 08:40 AM (IST)

    ఆంధ్రప్రదేశ్ రైలు ప్రమాదం.. 14 రైళ్లు రద్దు.. ఐదు దారి మళ్లింపు

    రద్దైన రైళ్లు..

    30 అక్టోబర్ – రైలు నం. 08527 – రాయ్‌పూర్-విశాఖపట్నం ప్యాసింజర్
    30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – రైలు నం. 08528 – విశాఖపట్నం-రాయ్‌పూర్ ప్యాసింజర్
    30 అక్టోబర్ – పలాస నుండి – పలాస-విశాఖపట్నం స్పెషల్
    30 అక్టోబర్ – పారాదీప్ నుండి – పారాదీప్-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
    30 అక్టోబర్ – కోర్బా నుండి – కోర్బా-విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్
    30 అక్టోబర్ – రాయగడ నుండి – రాయగడ-విశాఖపట్నం ప్యాసింజర్
    30 అక్టోబర్ – విజయనగరం నుండి – విజయనగరం-విశాఖపట్నం స్పెషల్
    30 అక్టోబర్ – విశాఖపట్నం నుండి – విశాఖపట్నం-గుణపూర్ స్పెషల్

  • 30 Oct 2023 08:28 AM (IST)

    రైలు ప్రమాదంపై సీఎం జగన్‌తో మాట్లాడిన అశ్విని వైష్ణవ్

    రైలు ప్రమాదంపై ఏపీ సీఎం జగన్‌, ప్రధాని నరేంద్ర మోదీ దిగ్భ్రాంతి చెందారు. రైల్వేమంత్రి అశ్వినివైష్ణవ్‌తో ఫోన్‌లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. రైలుప్రమాదంపై సీఎం జగన్‌తో ఫోన్‌లో మాట్లాడారు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌. ఘటనాస్థలిలో సహాయక చర్యల వివరాలను మంత్రికి తెలిపారు సీఎం జగన్‌

  • 30 Oct 2023 08:27 AM (IST)

    రైలు ప్రమాద ఘటనలో ముమ్మరంగా కొనసాగుతోన్న సహాయక చర్యలు..

    రైలుప్రమాద స్థలంలో సహాయకచర్యలను దగ్గురండి పర్యవేక్షించారు మంత్రి బొత్స సత్యనారాయణ.. రైలుప్రమాద ప్రాంతంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు విజయనగరం కలెక్టర్‌ నాగలక్ష్మి. రైలు ప్రమాదధాటికి బోగీలు నుజ్జునుజ్జయ్యాయి. సాయం కోసం బోగీల్లో చిక్కుకున్న ప్రయాణికుల ఆర్తనాదాలతో ఆ ప్రాంతం మార్మోగింది.రైలుప్రమాదంలో మృతిచెందిన వారి డెడ్‌బాడీలను ఒక్కొక్కటిగా బయటకు తీసి ఆసుపత్రికి తరలించారు అధికారులు. రైలుప్రమాద స్థలంలో బాధితులకు కొనసాగుతున్న సహాయకచర్యలను దగ్గురండి పర్యవేక్షించారు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ.. రైలు ప్రమాదంలో లోకో పైలెట్‌ ఎంఎస్‌ రావులుతోపాటు ట్రెయిన్‌ గార్డ్‌ మృతి చెందడంపై రైల్వే ఉద్యోగులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విజయనగరం సమీప జిల్లాలైన విశాఖపట్నం, అనకాపల్లి నుంచి వీలైనన్ని అంబులెన్స్‌లను పంపించాలని, మెరుగైన వైద్యం అందించడానికి సమీప ఆస్పత్రుల్లో అన్నిరకాల ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. వేగంగా సహాయక చర్యలు చేపట్టి, క్షతగాత్రులకు వైద్య సేవలు అందేలా చూడాలని సీఎం ఆదేశాలు జారీచేశారు.

  • 30 Oct 2023 08:26 AM (IST)

    Update: 14 మంది మృతి.. ఐదుగురి పరిస్థితి విషమం..

    విజయనగరం జిల్లాలో విశాఖ-పలాస ప్యాసింజర్‌ను విశాఖ-రాయగడ రైలు ఢీకొట్టడంతో 7 బోగీలు పట్టాలు తప్పి నుజ్జు నుజ్జు అయ్యాయి. కొత్తవలస మండలం కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాదంలో 14 మంది చనిపోగా.. వంద మందికిపైగా గాయపడ్డారు. ఐదుగురి పరిస్థితి విషమంగా మారింది.

     

  • 30 Oct 2023 08:03 AM (IST)

    రైలు ప్రమాదంలో మృతి చెందినవారు వీరే..

    విజయనగరం రైలు ప్రమాదంలో ఇప్పటి వరకు మృతి చెందిన వారిలో గిడిజాల లక్ష్మీ, కంచు బాకత్ రవి, చల్లా సతీష్, లోకో పైలట్ ఎస్ ఎం రావు, కరణం అక్కల నాయుడు, నాగరాజు, టి. సుగుణమ్మలుగా గుర్తించారు అధికారులు. మృతులు అంతా ఉత్తరాంధ్రకు చెందిన వారేనని తెలుస్తోంది. కాగా, మృతదేహలను పోస్ట్ మార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

  • 30 Oct 2023 07:58 AM (IST)

    కంటకాపల్లి రైలు ప్రమాదం.. కొనసాగుతోన్న సహాయక చర్యలు..

    కంటకాపల్లి రైలు ప్రమాదంలో గాయపడిన బాధితురాలు కుమారి విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. కాలు ప్రాక్చర్ కావడంతో కుమారికి ప్రత్యేక వైద్య బృందం పర్యవేక్షణలో సర్జరీ చేశారు. పలాస ప్యాసింజర్ రైలులో విశాఖ నుంచి అలమండ వెళ్తూ ప్రమాదానికి గురైంది బాధితురాలు. తీవ్ర గాయాలతో భోగిపై ఇరుక్కుపోయింది కుమారి. ఫోన్ కాల్‌తో ఘటనా స్థలికి ఆమె బంధువులు చేరుకోగా.. గంటన్నర పాటు శ్రమించిన సిబ్బంది.. స్థానికుల సహకారంతో కుమారిని పైకి తీశారు. కిలోమీటర్ వరకు ఆర్పిఎఫ్ అధికారి కుమారిని మోసుకెళ్లారు. ప్రభుత్వ అధికారుల సహాయం మరువలేనిదని.. చిమ్మ చీకటిలోనూ స్థానికులు నిర్విరామంగా శ్రమిస్తూ ఉన్నారు కుమారి బంధువులు తెలిపారు.

  • 30 Oct 2023 07:51 AM (IST)

    రైలు ప్రమాద ఘటన వద్ద కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

    విజయనగరం రైలు ప్రమాద ఘటన వద్ద రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ప్రమాదానికి గురైన రైలు భోగీలను రెస్క్యూ చేస్తున్నారు రైల్వే సిబ్బంది. పదికి పైగా భారీ క్రేన్లు ఘటనాస్థలానికి చేరుకోగా.. సుమారు పన్నెండు గంటలకు పైగా రెస్క్యూ ఆపరేషన్లు కొనసాగిస్తున్నారు అధికారులు.

  • 30 Oct 2023 07:12 AM (IST)

    14కి చేరిన మృతుల సంఖ్య.. 100 మందికి గాయాలు..

    కంటకాపల్లి రైలు ప్రమాదంలో మృతుల సంఖ్య 14కి చేరింది. 100 మంది గాయాలపాలయ్యారు. సహాయక చర్యలు పూర్తయితే.. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని స్థానిక అధికారులు చెబుతున్నారు. అర్ధరాత్రి వరకు 10 మృతదేహాలను వెలికితీయగా.. బోగీల మధ్య నలిగిపోయిన మృతదేహాలను ఇంకా తీయాల్సి ఉందని తెలుస్తోంది.

Follow us on