Anakapalli News: ఇల్లు కాలి ఒకడు ఏడుస్తుంటే.. చుట్టకి నిప్పు కావలన్నాడట ఇంకొకడు.. ఈ సామెత మన దగ్గర ఫుల్ పేమస్.. అలాంటి ఘటనే తాజాగా ఏపీలో చోటుచేసుకుంది. ఒకరేమో కష్టాల్లో ఉంటే.. మందు బాబులు మాత్రం ఖుషి ఖుషీగా ఛీర్స్ చెప్పుకున్నారు.. అనకాపల్లి జిల్లాలో బీరు వ్యాన్ బోల్తా మందుబాబులకు కలిసి వచ్చింది. కసింకోట మండలం పరవాడపాలెం హైవేపై బీరు లోడుతో వెళ్తున్న వ్యాన్ బోల్తా పడింది. దీంతో.. వ్యాన్ లో ఉన్న బీరు బాటిళ్లు భారీగా పగిలిపోయాయి. వందలాది లీటర్ల బీరు.. రోడ్డు పాలైంది. విషయం తెలుసుకున్న అటువైపుగా వెళ్తున్నా వాహనదారులు, సమీప గ్రామస్తులు అక్కడకు పరుగులు పెట్టారు.
పాపం బోల్తా పడిన వ్యాన్‌తో ఆ డ్రైవర్ తల పట్టుకుంటే.. వీళ్లంతా సందట్లో సడేమియా అన్నట్టు పగలకుండా ఉన్న మిగిలిన బాటిల్లను ఎత్తుకు వెళ్లేందుకు పోటీపడ్డారు. దొరికిన వాళ్లకు దొరికినంత అన్నట్టుగా.. బీరు బాటిళ్ల కోసం ఎగబడ్డారు. పగిలిన బాటిల్ల గాజు పెంకులు గుచ్చుకుంటాయి అన్న భయం కూడా లేకుండా.. బీరు బాటిల్లు ఎత్తుకెళ్లేందుకు పరుగులు తీశారు.
అసలే వేసవికాలం కదా.. ఎత్తుకెళ్లిన రెండు బీర్లు ఫ్రిజ్లో పెడితే చిల్లుగా లాగించేవచ్చని ఎగబడ్డారు. అవసరమైన వాళ్ళు ఎత్తుకెళ్తుంటే.. వాళ్లని చూసినా మిగతా వాళ్ళు నోరెళ్లపెట్టారు. అనకాపల్లి డిపో నుండి నర్సీపట్నంకు బీరు లోడు తో వెళ్తుంది వ్యాన్. ఈ సమయంలో లారీ బోల్తా పడటంతో జరగాల్సినదంతా జరిగిపోయింది..
మరిన్ని ఏపీ వార్తల కోసం..