అప్పుడే తెల్లవారింది. మెల్లిమెల్లిగా సూర్య కిరణాలు భూమిని తాకుతున్నాయి. పదహారో నంబర్ జాతీయ రహదారిపై వాహనాలు సర్రు.. సర్రుమంటూ దూసుకుపోతున్నాయి. ఆరు గంటల సమయం.. రెండు స్పోర్ట్స్ బైక్‌లు వేగంగా దూసుకెళ్తున్నాయ్. తిమ్మాపురం వద్దకు చేరుకోగానే.. ఏం జరిగిందో.. ఏమైందో తెలియదు గానీ.. రెండు బైక్‌లు ఢీకొని.. ఆ వాహనదారులు ఇద్దరూ కిందపడ్డారు. ఒక్కసారిగా బైక్‌లపై ఉన్న ప్యాకెట్లు కిందపడ్డాయి. వాహనాలపై నుంచి కిందపడిన యువకులు వాటిని గబగబా తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. అయితే అదే సమయంలో అటుగా వచ్చిన స్థానికులు ఆ ప్యాకెట్స్‌లో ఉన్న దాన్ని చూసి అవాక్కయ్యారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు వారిద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
వివరాల్లోకెళ్తే.. విశాఖపట్నం సీలేరు నుంచి హైదరాబాద్‌కు రెండు బైక్‌లు బయల్దేరాయి. బైక్‌లపై ఇద్దరు యువకులున్నారు. వారి పేర్లు శంకర్, శివలు.. ఇద్దరూ కూడా జోరుగా రహదారిపై బైక్‌లతో సాగిపోతున్నారు. అయితే విశాఖ నుంచి హైదరాబాద్ వెళ్లాల్సిన యువకులు ఎందుకో దారి మళ్లారు. చెన్నై హైవేలో దూసుకుపోతున్న యువకులు యడ్లపాడు మండలం తిమ్మాపురం వద్దకు వచ్చేసరికి బైక్‌లు రెండు కిందపడిపోయాయి. బైక్‌లపై ఉన్న ప్యాకెట్స్ కూడా చెల్లాచెదురుగా పడ్డాయి. శంకర్, శివలు ఆ ప్యాకెట్స్‌ను ఏరుకునే క్రమంలోనే ఘర్షణ పడ్డారు. దీంతో కొన్ని ప్యాకెట్స్‌లో ఉన్న గంజాయి రోడ్డుపై పడిపోయింది. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగన యడ్లపాడు పోలీసులు.. వారిద్దరి యువకులకు వెంబడించి పట్టుకున్నారు. మొత్తం యాబై ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. రెండు కేజీల బరువున్న ప్యాకెట్లలో మొత్తం 98 కేజీల గంజాయి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. అయితే ఆ యువకులిద్దరూ ఏ ప్రాంతానికి చెందినవారు.? ఎక్కడికి గంజాయి తీసుకెళ్తున్నారు.? జాతీయ రహదారిపైకి ఎందుకు వచ్చారు.? వంటి అంశాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పొరపాటున ప్రమాదానికి గురయ్యారా.? లేక గంజాయి తరలించే అంశంలో ఘర్షణ పడ్డారా.? అన్న విషయాన్ని పోలీసులు కూపీ లాగుతున్నారు. అయితే ప్రాధమికంగా హైదరాబాద్ వెళ్లాల్సిన యువకులు మద్య విబేధాలు రావడంతోనే దారి మళ్లినట్లు తెలుస్తోంది. గొడవ పడిన సమయంలోనే గంజాయి ప్యాకెట్స్ కింద పడినట్లు స్థానికులు చెబుతున్నారు. త్వరలోనే అన్ని వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.