నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవదహనం!

ఇద్దరు యువకులు మోటార్ సైకిల్ పై ప్రయాణిస్తుండగా ఎర్ర శనగ (కంది) పొలానికి చుట్టూ ఏర్పాటు చేసిన విద్యుదీకరణ తీగల కంచె ప్రమాదవశాత్తు వారిని తాకింది. దీంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మృతులను గ్రామ నివాసితులు మేకల గణేష్ (18), తలపాల రమేష్ (18) గా గుర్తించారు. శ్రీ పొట్టి శ్రీరాములు జిల్లా వరికుంటపాడు మండలం బోనిగార్లపాడు గ్రామంలో ఆదివారం ఈ దారుణం చోటు చేసుకుంది..

నెల్లూరు జిల్లాలో దారుణం.. ఇద్దరు యువకులు సజీవదహనం!
Two Youths Electrocuted In Nellore

Updated on: Jan 26, 2026 | 6:11 AM

వరికుంటపాడు, జనవరి 26: పొలానికి కంచెగా విద్యుత్‌ వైర్లు ఏర్పాటు చేశాడో రైతు. ఆ విషయం తెలియక అటుగా బైక్‌పై వెళ్తున్న ఇద్దరు యువకులు ఆ విద్యుత్‌ వైర్లను తాకారు. అంతే ఒక్కసారిగా మంటలు ఎగసి పడటంతో ఇద్దరు అక్కడికక్కడే సజీవదహనం అయ్యారు. ఈ విషాద ఘటన ఆదివారం (జనవరి 25) పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే..

నెల్లూరు జిల్లా వరికుంటపాడు మండలం తూర్పు రొంపిదొడ్ల పంచాయతీ బోనిగర్లపాడు గ్రామానికి చెందిన మేకల గణేశ్‌ (18), తలపల రమేశ్‌ (18) బైక్‌పై వెళ్తున్నారు. రోడ్డు పక్కనే కంది పొలానికి రక్షణగా ఏర్పాటు చేసిన విద్యుత్‌ వైర్లను తాకారు. దీంతో విద్యుత్‌ తీగల నుంచి ఒక్కసారిగా హై ఓల్టేజ్‌ షాక్‌ తగలడంతో బైక్‌తో సహా దానిపై ఉన్న ఇద్దరు యువకులు అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. ఈ ఘటనలో వారు ప్రయాణిస్తున్న బైక్‌ పూర్తిగా దగ్ధమైంది. ఇద్దరు యువకులు కూడా దాదాపు బూడిదయ్యారు. సంఘటన సమయంలో చుట్టు పక్కల ఎవరూ లేకపోవడంతో వీరిని కాపాడే పరిస్థితి కూడా లేకుండా పోయింది. దీంతో స్థానికంగా తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.

ఈ విషాద మరణాలతో బోనిగర్లపాడు గ్రామం విషాద ఛాయలు అలముకున్నాయి. కుటుంబ సభ్యులు, గ్రామస్తులు దిగ్భ్రాంతికి గురయ్యారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాలను పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. అనంతరం కేసు నమోదు చేశారు. ఈ సంఘటనకు దారితీసిన పరిస్థితులు, వ్యవసాయ భూమిని అక్రమంగా విద్యుదీకరించడంపై దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ఆంధ్రప్రదేశ్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.