సరదాగా ఈత(Swimming) కొట్టేందుకు రిజర్వాయర్ లోకి దిగారు. ఈత రాకపోవడంతో ఒడ్డునే స్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో అదుపు తప్పి నీటిలో పడిపోయారు. సమీపంలో ఎవరూ లేకపోవడంతో లోతుల్లోకి వెళ్లిపోయారు. సమాచారం అందుకున్న గజ ఈతగాళ్లు వచ్చి చూసే సరికే ఇద్దరూ మృతి చెందారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర విషాదం నింపింది. విశాఖపట్నం(Visakhapatnam) జిల్లాలోని బుచ్చిరాజుపాలెం ప్రాంతానికి చెందిన తరుణ్ సాయి, కంచరపాలేనికి చెందిన లోహిత్ మరో ఐదుగురు స్నేహితులతో కలసి మేహాద్రి రిజర్వాయర్(Mehadri Reservoir) వద్దకు వెళ్లారు. సరదాగా ఈత కొట్టేందుకు నీటిలో దిగారు. తరుణ్‌సాయి, లోహిత్‌కు ఈత రాకపోవడంతో థర్మోకోల్ షీట్లను చుట్టుకుని ఒడ్డుకు స్నానాలు చేస్తున్నారు. ఈ క్రమంలో పట్టుతప్పి నీటి లోపలికి వెళ్లిపోయారు. స్నేహితులు గమనించి కేకలు వేసినా లాభం లేకుండా పోయింది. సమాచారం అందుకున్న స్థానికులు గజ ఈతగాడి సహాయంతో గాలించి ఇద్దరినీ బయటకు తీశారు. ఆస్పత్రికి తరలించేదుకు 108 అంబులెన్స్ సిబ్బందికి ఫోన్ చేశారు. వాహనం వచ్చి పరీక్షలు చేసి ఇద్దరూ మృతి చెందారని చెప్పడంతో స్నేహితులంతా కన్నీరుమున్నీరయ్యారు.
తుర్ల వెంకటరావు, గౌరిల ఒక్కగానొక్క కుమారుడు తరుణ్‌సాయి. ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. తల్లిదండ్రులు ఇద్దరూ కూలి పనులు చేస్తూ కుమారుడ్ని చదివిస్తున్నారు. స్నేహితులతో వెళ్లిన కుమారుడు విగతజీవిగా తిరిగి రావడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. మునికోటి గణేశ్, రత్న అలియాస్ బుజ్జిల రెండో కుమారుడు లోహిత్. ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. లోహిత్ స్నేహితునితో కలసి వెళ్లాడని, ఇంటికి తిరిగి వస్తాడని తల్లిదండ్రులు ఎదురుచూస్తూ ఉన్నారు. ఇంతలో నీట మునిగి మృతి చెందాడన్న విషయం తెలియగానే వారి దుఃఖానికి అవధులు లేకుండా పోయింది.
Also Read
Indian Soldier: అంతులేని ఆవేదన.. ఆర్మీ అధికారి ఆచూకీ చెప్పాలంటూ సుప్రీం కోర్టులో పిటిషన్..