
కర్నూలు జిల్లాలో ఒకే సమయంలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు వ్యక్తులు దారుణ హత్యకు గురవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపుతోంది. మృతుల్లో ఒక మహిళ, పురుషుడు ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మొదటి మహిళ హత్య విషయానికి వస్తే కాటసాని శివలీల (75) సాయి వైభవ్ నగర్లో నివాసం ఉంటున్నారు. ఈమె భర్త కొన్నేళ్ల క్రితమే చనిపోయాడు. కుమారుడు డాక్టర్ గంగాధర్ రెడ్డి అమెరికాలో ఉన్నారు. కాగా శివలీలకు తన అల్లుడు చంద్రశేఖర్రెడ్డి తోడుగా ఉంటున్నారు.
ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం అల్లుడు చంద్రశేఖర్ రెడ్డి ఇంటికి వచ్చే సరికి శివలీల డైనింగ్ హాలులో తీవ్ర గాయాలతో రక్తం మడుగులో పడున్నారు. దీంతో అతను శివలీలను వెంటనే కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆమెను పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె మెడలోని బంగారు ఆభరణాలు, చేతిలో గాజులు లేక పోవడంతో దొంగతనానికి వచ్చిన దుండగులు ఈ హత్య చేసి దోచుకెళ్లినట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ విక్రాంత్ పాటిల్, కర్నూలు డీఎస్పీ బాబూప్రసాద్, కర్నూలు మూడో పట్టణ సీఐ శేషయ్య, ఇతర సీఐలు ఘటనా స్థలాన్ని పరిశీ లించారు. శివలీల కుడి చెవి వెనుక పదునైన ఆయుధంతో పొడిచిన ఆన వాళ్లు పోలీసులు గుర్తించారు. సుపరిచితులే ఈ దారుణానికి ఒడిగట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరో హత్య విషయానికికొస్తే.. ఎన్.ఆర్. పేటకు చెందిన షేక్ ఇజ్ హర్ అహ్మద్ (42) బంగారు వ్యాపారిగా, స్వర్ణకారుడిగా పనిచేస్తున్నారు. సోమవారం సాయంత్రం రాధాకృష్ణ థియేటర్ సమీపంలోని మసీదులో ప్రార్థన ముగించుకుని బయటకు రాగానే హంతకులు మూకుమ్మడిగా దాడి చేశారు. కత్తితో ఆయన ముఖంపై, ఛాతీ భాగంలో విచక్షణా రహితంగా పొడిచారు. కుడిచేతి హస్తం తెగిపోయాలా నరికి పారిపోయారు. బాధితుడిని కర్నూలు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. రెండురోజుల కిందట పాతబస్తీలోని ఘనిగల్లీకి చెందిన మాజీ కార్పొరేటర్ కుమారులైన ఇమ్రాన్, ఇర్ఫాన్లతో ఇజార్ అహ్మద్ కు గొడవ జరిగిందని, వారే హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.