
టమాట.. ఈ ఎర్ర పండు కుదిరితే రైతును అమాంతం ఆకాశానికి ఎత్తేస్తుంది. లేదంటే పాతాళానికి తొక్కేస్తుంది. గత కొన్నాళ్లుగా రైతులకు కన్నీళ్లు తెప్పించిన టమాట ధరలు ఎట్టకేలకు నవంబరు మూడో వారంలో పెరిగాయి. ప్రస్తుతం దీని ధరలు ఆకాశానికి ఎగబాకుతున్నాయి. ఇది యేటా ఏదో ఒక సందర్భంలో జరిగే తతంగమే అయినా ఎప్పుడూ టాక్ ఆఫ్ ది టౌన్‌గా దీని ధరలు వినిపిస్తూనే ఉంటాయి. ప్రస్తుతం సామాన్యులకు అందని ద్రాక్షగా మారింది టమాట. రెండు తెలుగు రాష్ట్రాల్లోని మార్కెట్లలో టమాటా ధరలు ఠారెత్తిస్తున్నాయి.

పది రోజుల కిందటి వరకు కిలో టమాట ధర రూ.10 నుంచి 20 రూపాయల వరకు పలికింది. ఇప్పుడు ఏకంగా కిలో రూ.80 వరకు చేరింది. తెలంగాణలోని రాయదుర్గం, వరంగల్, ఖమ్మం వంటి ప్రధాన మార్కెట్లలో టమాటా కిలో రూ.60 నుంచి రూ.80 వరకు పలుకుతుంది.

15 రోజుల్లోనే 50 శాతానికి పైగా నికరంగా ధర పెరిగినట్లు డేటా చెబుతోంది. ఇక రాష్ట్రాల వారీగా తీసుకుంటే.. చండీగఢ్ లో 112 శాతం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 40 శాతం, హిమాచల్ ప్రదేశ్ లో 40 శాతం మేర ధరలు పెరిగాయి. ఆంధ్రప్రదేశ్‌లోని మదనపల్లె మార్కెట్‌లో అయితే ఈ రోజూ కేజీ టమాట ధర రూ.63కు చేరింది. నిన్న మొన్నటి వరకు మొంథా తుపాన్ తీవ్ర బీభత్సం సృష్టించడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు.

ఈ తుపాన్ కారణంగా టమాటా పంట భారీగా దెబ్బతింది. దీంతో పంట దిగుబడి బాగా పడిపోయింది. గత ఏడాది ఇదే సమయంలో సగటున దాదాపు 700 మెట్రిక్ టన్నుల టమాటా మదనపల్లె మార్కెట్‌కు రాగా, ఈ రోజు మాత్రం కేవలం140 మెట్రిక్ టన్నుల టమాట మాత్రమే రావడం గమనార్హం. ఆంధ్రాప్రదేశ్‌తోపాటు కర్ణాటక, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో పంట దిగుబడి విపరీతంగా తగ్గింది.

దీంతో క్రమంగా దేశ వ్యాప్తంగా టమాట ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. రాబోయే నెల రోజుల్లో టమాట ధర రూ. 100కు చేరే అవకాశం ఉన్నట్లు మార్కెట్ నిపుణులు అంటున్నారు.