Tomato Prices: మండిపోతున్న టమాట ధర.. లబోదిబోమంటున్న ప్రజలు

|

May 14, 2022 | 10:26 AM

Tomato Prices: టమాట ధర మళ్లీ కొండెక్కింది. ముందే పెట్రోల్‌, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా మండిపోతుండగా,..

Tomato Prices: మండిపోతున్న టమాట ధర.. లబోదిబోమంటున్న ప్రజలు
Follow us on

Tomato Prices: టమాట ధర మళ్లీ కొండెక్కింది. ముందే పెట్రోల్‌, డీజిల్ ధరలతో పాటు నిత్యావసర సరుకుల ధరలు కూడా మండిపోతుండగా, ఇప్పుడు టమాట ధర పరుగులు పెడుతోంది. సామాన్యుడు సైతం ఎక్కువ ఉపయోగించేది టమాటే. దీని ధర పెరుగుతుండటంతో సామాన్యుడికి అందని ద్రక్షలా మారింది. ఇతర రాష్ట్రాల (States) నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడం కారణంగా టమాటా ధరలు భారీగా పెరిగాయి. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కన్పిస్తోంది. అంటే నెలాఖరు వరకు వంటింట్లో టమాటా కన్పించక పోవచ్చు. కొంత కాలంపాటు నేల చూపులు చూసిన టమాట ధర.. ఇప్పుడు ఒక్కసారి పెరిగిపోయింది. మూడు నెలల కిందట కిలో టమాట రూ.5 నుంచి రూ.8 వరకు ఉంది. కానీ మండుతున్న ఎండల మాదిరిగానే టమాట ధర అమాంతంగా రూ.100 చేరింది. రైతు బజార్లు, పెద్ద పెద్ద మార్కెట్లలో మంచి టమాటలు కిలో రూ.80 పలుకుతుంటే చిన్న చిన్న మార్కెట్లో రూ.100 వరకు చేరింది. ప్రస్తుతం హైదరాబాద్‌లోని మెండా మార్కెట్‌, బోయిపల్లి వంటి హోల్‌సేల్‌ మార్కెట్లతో పాటు మెహదీపట్నం, కూకట్‌పల్లి, ఎల్‌బీనగర్‌, ఎర్రగడ్డ వంటి ప్రధాన రైతు బజార్లలో కూడా టమాట కొరత తీవ్రంగా ఉంది. సాధారణ రోజుల్లో నగరానికి 80 నుంచి100 లారీలు దిగుమతి అవుతుంటే, ప్రస్తుత రోజుల్లో రోజుకు 50 లారీలు రావడం కూడా కష్టమైందని మార్కెట్‌ వర్గాలు చెబుతున్నాయి.

ఒక్కోచోట ఒక్కోలా ధర పలుకుతోన్నా, రేటు మాత్రం గుండె గుభేల్‌మనేలా రీసౌండ్ వస్తోంది. కర్నూలు మార్కెట్‌లో కేజీ టమాటా ధర 80 రూపాయలు పలికింది. రైతు బజార్‌లో 70 రూపాయలుండగా బయటి మార్కెట్‌లో పది రూపాయలు ఎక్కువగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఒక్కో చోట టమాటా ధర ఏకంగా 100 రూపాయిలు పలుకుతోంది. ధరలు ఈ స్థాయిలో మండిపోతుండటంతో కొనేదెట్టా అని వినియోగదారులు నిట్టూరుస్తున్నారు. కేవలం 10 రోజుల వ్యవధిలోనే కేజీ టమాటా ధర ఏకంగా 60-80 రూపాయల వరకు పెరిగింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు తగ్గడం, భారీ వర్షాలకు పంటలు దెబ్బతినడంతో టమాటా ధరలు భారీగా పెరిగినట్లు తెలుస్తోంది.

ఏపీ, తెలంగాణ.. రెండు రాష్ట్రాల్లోనూ టమటా ధరలు మండిపోతున్నాయి. టమాట కొనాలంటేనే జంకే పరిస్థితి ఏర్పడింది. కేవలం, వారం పది రోజుల్లోనే అమాంతం పెరిగిపోయింది టమోటా ధర. హైదరాబాద్‌లో అయితే కిలో టమోటా ధర క్వాలిటీని బట్టి కిలో 60 రూపాయల నుంచి 80 రూపాయలకు పలుకుతోంది. కొత్త పంట చేతికొచ్చే వరకు పరిస్థితి ఇలానే ఉండేలా కనిపిస్తోంది. దీంతో కొండెక్కిన టమాటా ధర ఈ నెలాఖరు వరకు కిందకు దిగకపోవచ్చని నిపుణులు చెబుతున్నారు. మెదక్‌లో కిలో టమాట హాఫ్ సెంచరీ మార్క్‌ దాటింది. ఈ ధర కూడా కేవలం రైతు బజార్‌లో మాత్రమే. ఇళ్ల దగ్గర చిల్లరగా కొనాలంటే మాత్రం ఇంకో పది, ఇరవై రూపాయలు వేసుకోవాల్సిందే.

ఇవి కూడా చదవండి

టమాట అధికంగా పండే ఆంధ్రప్రదేశ్‌లోనూ అదే పరిస్థితి నెలకొంది. కర్నూలు, చిత్తూరు, మదనపల్లి మార్కెట్లో కిలో టమోటా ధర ఎప్పుడో హాఫ్ సెంచరీ దాటేసిసింది. ఇప్పుడు సెంచరీ వైపు పరుగులు తీస్తోంది. ఇక, ఉత్తరాంధ్రలోనూ హైరేంజ్‌లోనే టమాట ధరలు పలుకుతున్నాయ్‌. విజయనగరంలో కిలో టమోటా 60 రూపాయలపైనే పలుకుతోంది. ఒకవైపు ఎండలు, మరోవైపు అకాల వర్షాలు… టమోటా దిగుబడిపై ఎఫెక్ట్‌ చూపించాయి. పంట దిగుబడి తగ్గిపోవడంతో ఆటోమోటిక్‌గా రేట్లు పెరిగిపోయాయి. మరోవైపు వ్యాపారుల సిండికేట్‌తో రేట్లు పేలిపోతున్నాయి. రానున్న రోజుల్లో ధరలు మరింతగా పెరిగే అవకాశం కనిపిస్తోంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి