తిరుమల (Tirumala) బ్రహ్మోత్సవాలపై టీటీడీ ఈవో ధర్మారెడ్డి కీలక ప్రకటన చేశారు. కరోనా కారణంగా రెండేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా నిర్వహించామని, కానీ ఈ సారి మాడవీధుల్లో వాహన సేవలు ఉంటాయని వెల్లడించారు. సెప్టెంబరు 27నుంచి ప్రారంభమయ్యే ఉత్సవాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎం జగన్ (CM Jagan) పట్టువస్త్రాలు సమర్పిస్తారని తెలిపారు. తిరుపతిలోని కేంద్రాల్లో సర్వదర్శనం టోకెన్లను ఎప్పటి నుంచి జారీ చేయాలనే విషయంపై చర్చించి తేదీపై ప్రకటన చేస్తామని చెప్పారు. తిరుమలలో గదులు పరిమిత సంఖ్యలోనే ఉన్నాయన్న ధర్మారెడ్డి.. భక్తులు వీలైనంత వరకు తిరుపతిలో అద్దె గదుల్ని ఉపయోగించుకోవాలని కోరారు. గదులను అద్దెకు ఇచ్చేందుకు యూపీఐ స్కానర్ వంటి డిజిటల్ ప్లాట్ ఫాంలను త్వరలోనే అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడించారు. అంతే కాకుండా కరోనా కారణంగా నిలిచిపోయిన అఖండ హరినామ సంకీర్తనను ఆగస్టు 1 నుంచి ప్రారంభిస్తామని చెప్పారు.
కాగా.. కలియుగవైకుంఠ వాసుడి బ్రహ్మోత్సవాలకు ముహూర్తం ఖరారైంది. సెప్టెంబర్ 27నుంచి తిరుమలేశుని సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరుగుతాయని టీటీడీ (TTD) ఈవో ధర్మారెడ్డి వెల్లడించారు. కరోనా కారణంగా గత రెండేళ్లుగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు ఏకాంతంగా జరిగాయి. ఈ ఏడాది కరోనా కేసుల సంఖ్య తగ్గడం, వ్యాప్తి తగ్గుముఖం పట్టడం వంటి కారణాలతో బ్రహ్మోత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించాలని టీటీడీ నిర్ణయించింది. సెప్టెంబర్ 27న ధ్వజారోహణంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు మొదలు కానున్నాయి.
అక్టోబరు 1న గరుడ సేవ, 2న బంగారు రథం, 4న మహారథం, 5న చక్రస్నానంతో బ్రహ్మోత్సవాలు (Brahmotsava) ముగిస్తాయని వివరించారు. ప్రభుత్వం తరఫున సెప్టెంబర్ 27న స్వామివారికి పట్టు వస్త్రాలు అందించేందుకు సీఎం జగన్ కు ఆహ్వానపత్రిక ఇస్తామని ధర్మారెడ్డి చెప్పారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల సందర్భంగా దివ్యాంగులకు ప్రత్యేక దర్శనాలతో పాటు వీఐపీ సిఫార్సు లేఖల దర్శనాలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. భక్తులు అధికంగా వచ్చే అవకాశం ఉందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి తెలిపారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి