Tirumala: భారీగా పెరిగిన తిరుమల వెంకన్న హుండీ ఆదాయం.. మే నెలలో ఎంతో తెలిస్తే స్టన్ అవుతారు

|

Jun 05, 2022 | 1:33 PM

అష్టైశ్వరాలు ప్రసాదించే శ్రీనివాసుడి సన్నిధిలో లక్ష్మీకళ ఉట్టిపడుతోంది. కరోనా కారణంగా తగ్గిన హుండీ ఆదాయం మళ్లీ పుంజుకుంది. టోకెన్లు లేకుండానే దర్శనాలు భక్తులను అనుమతిస్తుండటంతో శ్రీవారి హుండీ ఆదాయం రోజు నాలుగు కోట్లకు చేరింది.

Tirumala: భారీగా పెరిగిన తిరుమల వెంకన్న హుండీ ఆదాయం.. మే నెలలో ఎంతో తెలిస్తే స్టన్ అవుతారు
Tirumala Balaji
Follow us on

Tirumala Hundi Income: వడ్డీ కాసులవాడి దర్శనం కోసం రోజు వేలల్లో భక్తులు వస్తూ ఉంటారు. కోరిన కోరికలు తీర్చే కోవేటి రాయుడికి భక్తులు కానుకలు సమర్పించుకోవడం అనవాయితీ. కాని, కరోనా మహమ్మారి కారణంగా గడిచిన రెండేళ్లుగా తిరుమలను సందర్శించే భక్తుల సంఖ్య బాగా తగ్గింది. ఆ ప్రభావం శ్రీవారి హుండీ ఆదాయంపైనా పడిపోయింది. కరోనా తగ్గినా ఆంక్షల కారణంగా తిరుమలకు భక్తుల రాకపోకలు తగ్గాయి. జూన్‌ 2020లో దర్శనాల పునరుద్ధరణ తర్వాత హుండీ డైలీ ఆదాయం 20 లక్షల రూపాయల్లోకి పడిపోయింది. ఈ క్రమంలో టీటీడీ అనేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఒక సమయంలో కార్పస్‌ ఫండ్‌ నుంచి డబ్బు తీసి ఉద్యోగులకు జీతాలు చెల్లించాల్సిన పరిస్థితీ ఏర్పడింది. ఈ మధ్య కాలంలో ఆంక్షలన్నీ సడలించి దర్శనాల సంఖ్యను TTD పెంచడంతో హుండీ ఆదాయంలోనూ పెరుగుదల కనిపిస్తోంది. కరోనా బారిన పడిన అనేక మంది భక్తులు కోలుకుంటే స్వామి వారిని దర్శించుకొని కానుకలు, ముడుపులు చెల్లించుకుంటామని మొక్కుకున్నారు. కరోనా నుంచి కోలుకున్న లక్షలాది మంది భక్తులు పరిమిత సంఖ్యలో దర్శనాల కారణంగా శ్రీవారిని దర్శించుకోలేకపోయారు. దీంతో చాలా మంది మొక్కులు వాయిదా పడుతూ వచ్చాయి.  ఏప్రిల్‌లో సర్వదర్శనం టోకెన్‌ జారీ కేంద్రాల దగ్గర తొక్కిసలాట జరగడంతో టోకెన్లు లేకుండా దర్శనాలకు అనుమతించాలని TTD నిర్ణయించింది. ఈ నిర్ణయంతో రెండేళ్లుగా మొక్కులు చెల్లించుకునేందుకు ఎదురు చూస్తున్న భక్తులు శ్రీవారి దర్శనం కోసం తిరుమలకు బారులుదీరుతున్నారు. దీంతో స్వామివారి హుండీ ఆదాయం పెరిగిపోయింది.

  • రోజువారీ సగటు హుండీ ఆదాయం రూ.4 కోట్లు
  • సెలవు రోజుల్లో రూ.5 కోట్లు

గడిచిన కొద్ది రోజులుగా స్వామివారి హుండీ ఆదాయం రోజుకు 4 కోట్లుగా ఉంటుంది. రద్దీ రోజుల్లో ఈ మొత్తం 5 కోట్లు దాటుతోంది.  మే నెలలో స్వామివారి హుండీ ఆదాయం అక్షరాల 129 కోట్లు 93 లక్షల 44 వేల రూపాయలు. ఇందులో నాణెల రూపంలో ఆదాయం 6 కోట్లు రాగా ముడుపుల రూపంలో 65 లక్షలు హుండీల్లో పడ్డాయి.  దాదాపు ఆరు లక్షల రూపాయల విలువ చేసే చలామణీలో లేని నాణేలు కూడా భక్తులు శ్రీవారి హుండీలో వేశారు. హుండీలో వేసిన నగదులో చిరిగిన నోట్లు 50 లక్షల రూపాయల మేరకు ఉన్నాయి.  కరోనా కారణంగా తగ్గిన హుండీ ఆదాయం ఇప్పుడు భక్తుల రాకతో మళ్లీ సిరులతో కళకళలాడుతోంది.

మరిన్ని ఆధ్యాత్మిక వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..