
తిరువణ్ణామలైకి చెందిన తిరుమాల్, గాయత్రీ దంపతులు తిరుమలలోని శ్రీ వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాంగణంలో ఉన్న కల్యాణ వేదికలో ఈ నెల 28 న వివాహం చేసుకున్నారు. పెళ్లి చేసుకున్న తరువాత కళ్యాణ వేదిక నుంచి శ్రీవారి ఆలయం వద్దకు పసుపు బట్టలతోనే చేరుకున్న దంపతులు ఫోటోలకు ఫోజులిచ్చారు. కెమెరామెన్ల వెంట పెట్టుకుని వచ్చిన దంపతులు కాస్తా శృతి మించారు. ఆలయ ప్రాంగణంలో ఫోటోగ్రఫీ చేయరాదనే నిబంధన ఉన్నా కొత్తజంట తీసుకున్న ఫోటోలు, ఫోజులు అక్కడనున్న భక్తుల కంట పడింది. సెక్యూరిటీ సిబ్బంది గమనించకపోవడంతో ఆ వీడియోలు కాస్తా మీడియాకు చేరాయి.
దీనిపై స్పందించిన టిటిడి సెక్యూరిటీ ఆ జంట వివరాలపై ఆరా తీసింది. తిరువణ్ణామలైకి చెందిన తిరుమాల్, గాయత్రీ దంపతులుగా గుర్తించింది. శ్రీవారి ఆలయం ముందు ఫోటోషూట్ చేయరాదన్న విషయం ముందుగా తెలియకపోవడంతో అనుకోకుండా కొన్ని ఫోటోలు తీసినట్లు తెలుసు కున్నారు. అయితే, ఇది ఆలయ నియమాలకు విరుద్ధమని తెలిసిన వెంటనే, ఆ ఫోటోలను పూర్తిగా తొలగించినట్లు స్పష్టం చేశారు. ఈ అనుకోని తప్పు పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఆ జంట భక్తులను, టీటీడీ అధికారులను క్షమాపణలు కోరింది.
తాము చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తంగా, శ్రీవారి సేవ ద్వారా సేవలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపింది. ఇందుకు అవకాశం ఇవ్వాలని కోరింది. భక్తిసేవ ద్వారా తమ తప్పును పరిహరించుకోవాలని ఆకాంక్ష వ్యక్తం చేసింది. ఆలయ సంప్రదాయాలు, నియమాలు ప్రతి భక్తుడూ తప్పనిసరిగా గౌరవించాల్సినవేనని, ఈ ఘటనతో గుణపాఠం నేర్చుకున్నామని దంపతులు పేర్కొన్నట్లు టీటీడీ ప్రకటనలో పేర్కొంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.