Tirumala: ఫొటోలో చూసి అమాయకులు అనుకునేరు.. తిరుమలలో వీళ్లు చేసే పనులు తెలిస్తే ఛీ అంటారు..

తిరుమలకు వచ్చే భక్తులారా జాగ్రత్త.. గదులు ఇప్పిస్తామంటూ వచ్చే దళారులను నమ్మి మోసపోకండి. నకిలీ ఆధార్ కార్డులతో టీటీడీ రూమ్‌లను బుక్ చేసి, భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల కేటుగాళ్ల ముఠాను పోలీసులు గుట్టురట్టు చేశారు. దీనికి సంబంధించి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం..

Tirumala: ఫొటోలో చూసి అమాయకులు అనుకునేరు.. తిరుమలలో వీళ్లు చేసే పనులు తెలిస్తే ఛీ అంటారు..
Tirumala Ttd Room Scam

Edited By:

Updated on: Aug 09, 2026 | 9:26 PM

తిరుమలలో శ్రీవారి దర్శనార్థం వచ్చే భక్తుల అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకుని మోసాలకు పాల్పడుతున్న ఒక అంతర్రాష్ట్ర దళారుల ముఠా గుట్టును టీటీడీ విజిలెన్స్, పోలీసు యంత్రాంగం రట్టు చేశాయి. నకిలీ ఆధార్ కార్డులతో వసతి గదులను పొంది, వాటిని భక్తులకు అధిక ధరలకు విక్రయిస్తున్న ఆరుగురు సభ్యుల ముఠాను తిరుమల పోలీసులు అరెస్ట్ చేశారు. గత కొంతకాలంగా తిరుమలలో వసతి గదుల పేరుతో అక్రమ వ్యాపారం సాగుతోందన్న పక్కా సమాచారంతో టీటీడీ విజిలెన్స్, పోలీస్ విభాగాలు ఉమ్మడిగా నిఘా పెట్టాయి. తిరుమల సీఆర్‌ఓ ఆఫీస్ వద్ద తిరుగుతున్న ఈ ముఠాను విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకుని పోలీసులకు అప్పగించారు. నిందితుల నుంచి నకిలీ ఆధార్ కార్డులతో పాటు 5 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.

నకిలీ గుర్తింపు కార్డులతో..

ఆధార్ కార్డుల్లోని ఫోటోలను మార్ఫింగ్ చేసి, నకిలీ గుర్తింపు కార్డులు సృష్టించేవారు. ఆ నకిలీ పత్రాలతో సీఆర్‌ఓ కార్యాలయం ద్వారా రూ.50, రూ.100, రూ.1,000 విలువైన గదులను బుక్ చేసేవారు. వసతి దొరకక ఇబ్బంది పడుతున్న అమాయక భక్తులను టార్గెట్ చేసి, టీటీడీ నిర్ణయించిన ధరల కంటే అధిక మొత్తాలకు ఆ గదులను విక్రయించేవారు. వసతి అక్రమాలతో పాటు తిరుమలలోని పీఏసీ కేంద్రాలు, ఇతర రద్దీ ప్రాంతాల్లో భక్తుల సెల్ ఫోన్లను కూడా దొంగిలిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది.

అరెస్ట్ అయిన నిందితులు

వివిధ రాష్ట్రాలకు చెందిన ఆరుగురు వ్యక్తులు ముఠాగా ఏర్పడి ఈ దందా నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితులు శ్రీనివాస్ (తెలంగాణ), ఇరప్పకాలప్ప (మహారాష్ట్ర), అమూల్ కుమార్ సింగ్ (బీహార్), విష్ణువర్ధన్ (ఆంధ్రప్రదేశ్), సందీప్ (ఆంధ్రప్రదేశ్), ప్రకాష్ (కర్ణాటక) రాష్ట్రాలకు చెందినవారు.

నమోదు చేసిన కేసులు

ఈ వ్యవహారంలో వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. సెల్ ఫోన్ల దొంగతనాలకు సంబంధించి Cr.No.84/2026 U/s 303(2) BNS, నకిలీ ఆధారాలు, చీటింగ్, గదుల అక్రమ విక్రయాలపై Cr.No.85/2026 U/s 318(4), 336(3), 340(2) BNS R/w 3(5) BNS వంటి సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు.

దళారులను నమ్మవద్దు

భక్తులు వసతి గదుల కోసం ఎలాంటి దళారులను ఆశ్రయించి మోసపోవద్దని టీటీడీ సీవీఎస్ఓ మురళీకృష్ణ, తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు విజ్ఞప్తి చేశారు. గదులు, సేవలను కేవలం టీటీడీ అధికారిక కౌంటర్లు లేదా అధికారిక ఆన్‌లైన్ వెబ్‌సైట్ ద్వారా మాత్రమే పొందాలని స్పష్టం చేశారు.

అనుమానాస్పద వ్యక్తులు లేదా దళారులు కనిపిస్తే ఫిర్యాదు చేయాల్సిన నంబర్లు..

  • పోలీస్ అత్యవసర సేవలు: 112
  • టీటీడీ టోల్ ఫ్రీ నంబర్లు: 155257, 0877-2263472
  • టీటీడీ విజిలెన్స్ హెల్ప్‌లైన్: 9866898630
Loading...
Unable to load recommendations.
Follow Us