పశ్చిమగోదావరి జిల్లా, జులై 23: కొంగ జపం గురించి మీరు విన్నారా.. యస్ జపం చేయటం మంటే ఏకాగ్రత, స్థితప్రజ్ఞతతో దైవాన్ని ధ్యానించటం. పొలాలు, చెరువులు, నీటి మడుగుల్లో కొంగలు అంతే పట్టుదలతో నిలకడగా, నిబద్ధతతో ఏ మాత్రం కదలకుండా నిలబడి ఉంటాయి. దీనికి కారణం అవి దైవాన్ని ధ్యానించవు అచేతనంగా ఉన్నట్లు నటిస్తూ తన సమీపంలోకి చేపలు, పురుగులు రాగానే టక్కున వాటిని ముక్కున కరుచుకుని ఎగిరిపోతాయి. అందుకే మనసులో ఒకటి పెట్టుకుని క్రియలో మరోలా ప్రవర్తించే ప్రవర్తనకు ‘కొంగ జపం’ అనే పేరు వచ్చింది. ఇక విషయంలోకి వెలితే సాధారణంగా పక్షులకు రెండు కాళ్లు మాత్రమే ఉంటాయి. ఇటీవల పశువులు రెండు తలలు ఉన్న దూడలకు, నాలుగు కాళ్లు ఉన్న దూడలకు జన్మనివ్వడం వంటివి తరుచుగా చూస్తున్నాము. అపుడపుడూ ఇదే తరహాలో పసికందులు జన్మించిన ఘటనలు వెలుగుచూశాయి. కాని పక్షుల్లో నూ ఈ తరహా వింత జననం సంభవించే అవకాశాలు ఉన్నాయి.
తాజాగా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం మండలం దిరుసుమర్రులో నాలుగు కాళ్ళ కొంగ ప్రత్యక్షమైంది. దాసరి అజయ్ కుమార్ ఇంటి వద్ద ఒక తెల్లటి కొంగ కనిపించింది. అజయ్ కుమార్ కొంగ దగ్గరకు వెళ్ళినా అది కదలకుండా అలానే ఉంది. కొంగను పట్టుకున్న అజయ్ కుమార్ ఆశ్చర్యపోయాడు. మామూలుగా కొంగలకు రెండు కాళ్ళు ఉంటాయి. కానీ ఈ కొంగకు నాలుగు కాళ్ళు ఉన్నాయి. నాలుగు కాళ్ళు ఉన్న కొంగను స్థానికులు ఆశ్చర్యంగా చూశారు. నడవలేని స్థితిలో ఉన్న కొంగను స్థానికులే ప్రస్తుతం ఆహారం, నీరు అందిస్తున్నారు.
ఇటువంటివి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయని చెబుతున్నారు భీమవరం వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ పుండరీ బాబు. ఒక్కొక్కసారి రెండు అండాలు ఒకే గుడ్డులో నిక్షిప్తం అవుతాయి. ఒక అండం పెరిగి మరొక దానికి విస్తరిస్తుంది. అలాంటి సమయంలో పూర్తిగా ఫలదీకరణ జరగని అండంలోని భాగాలు అదనంగా ఎదుగుతాయి. దీంతో మనుషులైనా, జంతువులైనా , పక్షులు అయినా అసహజంగా కనిపిస్తాయి. శరీర ధర్మానికి భిన్నంగా ఇవి ఉండటంతో అవయవాలు ఎదుగుదల లో సమస్యలు తలెత్తి పుట్టిన కొద్ది గంటలు, రోజుల్లోనే ఇలా జన్మించిన జీవులు ఏదో ఒక ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొంటాయి. ఎక్కువ కాలం జీవించవు. అండ విభజనలో జన్యుపరమైన లోపం వల్ల ఇటువంటి విభిన్నమైన జీవులు పుడతాయని డాక్టర్ పుండరీ బాబు అన్నారు.
అయితే కొందరు ఇందులోనూ మూఢనమ్మకాలను పాటిస్తారు. ఎవరో చేతబడి చేయటం, మంత్రాలు ప్రయోగించటం వల్ల తమకు ఇలాంటి శిశువు పెట్టాడని శాంతులు, హోమాలు చేయిస్తారు. ఇక పాలిచ్చే పశువులకు ఇలాంటి దూడలు జన్మించటం అరిష్టంగా భావించి పూజలు చేయిస్తారు. కాని ఇది జన్యుపరమైన సమస్యల వల్ల అండం ఫలదీకరణ సమయంలో జరిగే లోపాలు వల్ల ఇలాంటి ఘటనలు వెలుగు చూస్తాయని వెటర్నరీ అదికారులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..