AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘లక్ష’ణమైన మామిడి పండు.. పోషకాలు మెండు.. సెలబ్రిటీలు ఇష్టపడే మ్యాంగో

అసలే వేసవి సీజన్. మామిడి పండ్లు రుచి చూడకుండా ఈ కాలం పూర్తవదనే చెప్పాలి. మార్కెట్లో రకరకాల మామిడి పండ్లు కనిపిస్తే చాలు.. వాటి వైపు మనసు లాగేస్తుంది. సాధారణంగా మామిడి పండ్లు వందల రూపాయల కిలో ధరలోనే లభిస్తాయి. కానీ కిలో ధర లక్షల్లో ఉండే మామిడి పండు గురించి ఎప్పుడైనా విన్నారా? ప్రస్తుతం విశాఖలో అలాంటి అరుదైన మామిడి జాతి అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అదే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి రకంగా పేరొందిన మియాజాకి.

'లక్ష'ణమైన మామిడి పండు.. పోషకాలు మెండు.. సెలబ్రిటీలు ఇష్టపడే మ్యాంగో
Miyazaki Mango
Maqdood Husain Khaja
| Edited By: |

Updated on: Jun 01, 2026 | 1:28 PM

Share

వేసవికాలం వచ్చిందంటే దేశవ్యాప్తంగా మామిడి పండ్ల సందడి మొదలవుతుంది. భారతదేశంలోనే దాదాపు 1,500 రకాల మామిడి జాతులు సాగవుతున్నట్లు నేషనల్ హార్టికల్చర్ బోర్డు చెబుతోంది. అయితే వాటన్నింటిలోనూ ప్రత్యేక గుర్తింపు పొందింది మియాజాకి మామిడి.

జపాన్ నుంచి భారత్ వరకు…

మియాజాకి మామిడి జపాన్‌లోని క్యుషు ప్రాంతంలోని మియాజాకి నగరంలో అభివృద్ధి చేయబడింది. సాధారణ మామిడి పండ్లలా పసుపు రంగులో కాకుండా, ఈ పండ్లు మొదట ఊదారంగులో కనిపించి పక్వానికి వచ్చే కొద్దీ ముదురు ఎరుపు రంగులో నిగనిగలాడుతుంటాయి. ఆకర్షణీయమైన రంగు, ప్రత్యేకమైన రుచి, అధిక తీపి కారణంగా ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్‌ను సంపాదించుకున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ఈ పండ్ల ధర కిలోకు రూ.2 లక్షల నుంచి రూ.2.5 లక్షల వరకు పలుకుతుందని చెబుతారు. అందుకే దీనిని ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన మామిడి జాతిగా పరిగణిస్తారు.

తెలుగు రాష్ట్రాల్లోనూ సాగు

ఒకప్పుడు జపాన్‌కే పరిమితమైన ఈ అరుదైన మామిడి జాతి ఇప్పుడు భారతదేశంలోనూ సాగవుతోంది. ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా, ఉత్తరాంధ్ర ప్రాంతాలు, తెలంగాణలోని ఖమ్మం జిల్లాతో పాటు ఒడిశాలోని కొన్ని ప్రాంతాల్లో ఔత్సాహిక రైతులు మియాజాకి మామిడిని విజయవంతంగా సాగు చేస్తున్నారు. ఉత్తరాంధ్రలోని చంపావతి, గోస్తని, బహుదా నదీ పరివాహక ప్రాంతాల వాతావరణం ఈ పంటకు అనుకూలంగా ఉండటంతో ఎస్.కోట, గజపతినగరం, ఇచ్ఛాపురం ప్రాంతాల్లో పరిమిత స్థాయిలో సాగు చేస్తున్నారు.

విశాఖ మ్యాంగో మేళాలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్

గో ఆధారిత ప్రకృతి వ్యవసాయదారుల సంఘం ఆధ్వర్యంలో విశాఖ బీచ్ రోడ్డులోని బీజేపీ కార్యాలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సేంద్రియ మామిడి పండ్ల మేళాలో మియాజాకి ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ మేళాలో దాదాపు 40 రకాల మామిడి జాతులను ప్రదర్శనకు ఉంచారు. ఇమామ్ పసంద్, మల్లిక, అమృతం, కేసరి, స్వాగతం, చిలుకల మామిడి, కొబ్బరి మామిడి, బంగినపల్లి, సువర్ణరేఖ, దసేరి, రసాలు వంటి ప్రసిద్ధ రకాలు ఉన్నప్పటికీ సందర్శకుల చూపంతా మియాజాకిపైనే నిలిచింది.

ఎందుకింత ప్రత్యేకం?

మియాజాకి మామిడి ఒక్కో పండు సుమారు 350 గ్రాముల వరకు బరువు ఉంటుంది. ఇందులో దాదాపు 15 శాతం వరకు సహజ చక్కెరలు ఉండటంతో అత్యంత తీపి రుచిని కలిగి ఉంటుంది. యాంటీ ఆక్సిడెంట్లు, ఖనిజ లవణాలు, పలు పోషకాలు సమృద్ధిగా ఉండటం దీని ప్రత్యేకత.

జపాన్‌లో అత్యుత్తమ రంగు, ఆకారం, తీపి కలిగిన మియాజాకి పండ్లను ప్రత్యేకంగా ఎంపిక చేసి “ఎగ్స్ ఆఫ్ ద సన్” అనే ప్రీమియం బ్రాండ్ పేరుతో విక్రయిస్తారు. ఎర్రటి రంగు, ప్రత్యేక ఆకారం కారణంగా వీటిని డైనోసార్ గుడ్లు అని కూడా పిలుస్తారు.

ఇక్కడ ధర ఎంత?

అంతర్జాతీయ మార్కెట్లో లక్షల్లో ధర పలికే ఈ మామిడిపండ్లు విశాఖ మ్యాంగో మేళాలో కిలోకు సుమారు రూ.999 ధరకు అందుబాటులో ఉంచారు. ఆర్గానిక్ పద్ధతుల్లో సాగు చేసిన ఈ ప్రత్యేక పండ్లను కొనుగోలు చేసేందుకు సందర్శకులు ఆసక్తి చూపుతున్నారు.

మామిడిపండ్లలో రారాజు

ఫలాల్లో మామిడి రారాజు అయితే.. మామిడి రకాలలో మియాజాకి రారాజుగా నిలుస్తోంది. అరుదైన రంగు, అసాధారణ తీపి, అంతర్జాతీయ గుర్తింపు, లక్షల్లో పలికే ధర.. ఇవన్నీ కలిసి మియాజాకిని ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైన మామిడి జాతిగా నిలబెట్టాయి. అందుకే విశాఖ మ్యాంగో మేళాలో ఈ “సెలబ్రిటీ మ్యాంగో” ప్రధాన ఆకర్షణగా మారింది.

Follow Us