Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భిన్న వాతావరణ పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఏపీలో ఎండలు, వడగాలులు తీవ్రంగా ఉండగా.. కొన్ని జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. తెలంగాణలో కూడా ఉరుములు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

Weather Alert: అల్పపీడనం ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాల్లో ఆదివారం వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
Rain Alert

Updated on: May 16, 2026 | 6:36 PM

ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో భిన్న వాతావరణం కొనసాగుతోంది.. ఎండలతోపాటు.. వర్షాలు కూడా కురుస్తున్నాయి.. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెరుగుతున్న ఎండ తీవ్రత, వడగాలులు, ఉక్కపోత మరోవైపు పిడుగులతో కూడిన వర్షాలు పట్ల ప్రజలు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. శనివారం కర్నూలు జిల్లా నగరడోనలో 43.5డిగ్రీలు నమోదైందని తెలిపారు. అలాగే కర్నూలు జిల్లాలో 12 మండలాలు, నంద్యాల 10, కడప జిల్లాలో 6 మండలాలు మొత్తంగా 9జిల్లాల పరిధిలోని 41మండలాల్లో 40 డిగ్రీలకు పైగా ఉష్ణోగ్రతలు రికార్డు అయినట్లు ఆయన వెల్లడించారు.

ఆదివారం(17-05-26) విజయనగరం, మన్యం, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, పల్నాడు, మార్కాపురం, నంద్యాల, వైఎస్సార్ కడప జిల్లాల్లో ఎండ ప్రభావం ఎక్కువగా ఉండి 42-44.5 డిగ్రీల వరకు గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైందుకు అవకాశం ఉందన్నారు. చాలా మండలాల్లో వడగాలులు ప్రభావం చూపే అవకాశం ఉందని వెల్లడించారు.

ఏపీలోని ఈ ప్రాంతాల్లో వర్షాలు..

మరోవైపు నైరుతి, ఆనుకుని ఉన్న పశ్చిమమధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని ఏపిఎస్డీఎంఏ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందన్నారు. వీటి ప్రభావంతో ఆదివారం(17-05-26) మన్యం, అల్లూరి, పోలవరం, తూర్పుగోదావరి, కర్నూలు, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఉరుములతో వర్షం పడేటప్పుడు పొలాల్లో పనిచేసే రైతులు, పశుకాపరులు చెట్ల క్రింద నిలబడరాదని వెంటనే సురక్షిత భవనాల్లోకి వెళ్లాలని సూచించారు.

తెలంగాణ రాష్ట్రంలో రాగల మూడు రోజుల వరకు వాతావరణ విశ్లేషణ – వాతావరణ హెచ్చరికలు :

నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారి కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా ఉన్న ఉపరితల చక్రవాత ఆవర్తనం సగటు సముద్రమట్టం నుండి 4.5 కి. మీ ఎత్తువరకు కొనసాగుతోంది. నిన్న తూర్పు మధ్యప్రదేశ్ ప్రాంతం నుండి అంతర్గత కర్ణాటక వరకు సగటు సముద్ర మట్టం నుండి 0.9 కి మీ ఎత్తులో కొనసాగిన ద్రోణి ఈరోజు బలహీనపడింది.

రాగల 3 రోజులకు వాతావరణ సూచన: (Weather Forecast)

శనివారం, ఆదివారం తెలంగాణ రాష్ట్రంలోని ఒకటి రెండు జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో రానున్న మూడు రోజులలో గరిష్ట ఉష్ణోగ్రతలు క్రమేపి రెండు నుంచి మూడు డిగ్రీలు పెరిగే అవకాశం ఉంది. ఈరోజు రేపు రాష్ట్రంలోని కొన్ని జిల్లాలలో ఉరుములు మెరుపులు, 30 నుండి 40 కి మీ వేగం కలిగిన ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us