Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవం.. మరి డిప్యూటీ స్పీకర్ ఎవరు..?

|

Jun 21, 2024 | 9:16 PM

ప్రభుత్వం ఏర్పడింది, సభ్యులు ప్రమాణం చేశారు. స్పీకర్ ఎన్నిక ఏకగ్రీవమైంది. మరి డిప్యూటీ స్పీకర్ ఎవరు? ఇదే ఇప్పుడు ఏపీలో హాట్ టాపిక్. టీడీపీకి స్పీకర్ పదవి దక్కడంతో డిప్యూటీ స్పీకర్ మిగతా భాగస్వామ్య పక్షాలకు దక్కబోతుందా అన్న చర్చ నడుస్తోంది. డిప్యూటీ స్పీకర్ ఎంపిక విషయంలో అధినేతలు వివిధ సమీకరణాలపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.

Andhra Pradesh: ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవం.. మరి డిప్యూటీ స్పీకర్ ఎవరు..?
Ayyannapatrudu
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. అసెంబ్లీ సమావేశాల తొలి రోజు కండువాలతో వచ్చిన సభ్యులతో సభ కళకళలాడింది. ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం చేయించారు. ఏపీ అసెంబ్లీ స్పీకర్‌గా సీనియర్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఒకే నామినేషన్ రావడంతో అయ్యన్నపాత్రుడి ఎన్నిక ఏకగ్రీవమైంది. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం ఎమ్మెల్యేను స్పీకర్‌గా ప్రకటించారు అధికారులు. అయ్యన్న.. సభలో ఉన్న కూటమి ఎమ్మెల్యేల్లో అత్యంత సీనియర్‌. ఇప్పటి వరకు 7 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఒకసారి అనకాపల్లి ఎంపీగానూ విజయం సాధించారు. పలు శాఖలకు మంత్రిగా పనిచేసిన అనుభవం ఆయనకు ఉంది.

డిప్యూటీ స్పీకర్ పదవి ఎవరికి దక్కబోతుందన్నదే ఇప్పుడు ఉత్కంఠగా మారింది. స్పీకర్ చైర్‌ టీడీపీకి దక్కింది, డిప్యూటీ స్పీకర్ పదవి మిత్రపక్షాలకు ఇస్తారా అన్న చర్చ నడుస్తోంది. దీనిపై కూటమి పార్టీల మధ్య పెద్ద ఎత్తున డిస్కషన్ సాగుతోంది. ఇక్కడ కొన్ని సమీకరణాలు అత్యంత ఆసక్తికరంగా మారాయి. బీసీ సామాజిక వర్గానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యే అయ్యన్నపాత్రుడికి స్పీకర్ పదవి దక్కింది. రాయదర్గం ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులుకు డిప్యూటీ దక్కే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. కాల్వ కూడా టీడీపీకి చెందిన సీనియర్ ఎమ్మెల్యే. గతంలో మంత్రిగా పనిచేసిన అనుభవం కూడా ఉంది. రెండు పదవులు బీసీలకు ఇవ్వడం ద్వారా కూటమి బీసీలకు ప్రాధాన్యత ఇస్తుందనే సంకేతాలు తీసుకెళ్లేలా అధినేతలు కసరత్తు చేస్తున్నారు. లేదంటే జనసేన కూడా దక్కే అవకాశాలు లేకపోలేదు. ఈ విషయంలో మూడు పార్టీల మధ్య చర్చలు నడుస్తున్నాయి. జనసేనకు ఇస్తే ఓసీ సామాజిక వర్గానికి చెందిన నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం మాధవికి ఇస్తారనేది టాక్.

దీనికి మించి మరో లెక్క కూడా లేకపోలేదు. స్పీకర్, డిప్యూటీ ఒకే ప్రాంతానికి చెందిన వారికి రెండు పదవులు ఇవ్వకుండా వేరు వేరు ప్రాంతాలకు ఇవ్వడం ద్వారా అన్ని ప్రాంతాలకు ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని అధినేతలు లెక్కలు వేస్తున్నారు. ఇక పొన్నూరు ఎమ్మెల్యే దూళిపాళ్ల నరేంద్రకు చీఫ్ విప్ దక్కే అవకాశం ఉన్నట్లు సభ్యుల మధ్య చర్చ నడుస్తోంది. తొలిరోజు సభలో 171 మందితో ప్రమాణం చేయించారు ప్రొటెం స్పీకర్‌ బుచ్చయ్యచౌదరి. వ్యక్తిగత కారణాలతో ప్రమాణం చేయని ముగ్గురు ఎమ్మెల్యేలు జీవీ ఆంజనేయులు, పితాని సత్యనారాయణ, వనమాడి వెంకటేశ్వరరావు రెండో రోజు సభలో ప్రమాణం చేస్తారు. సభ్యుల ప్రమాణం తర్వాత సభలో స్పీకర్‌ పేరు ప్రకటిస్తారు.

తొలి రోజు సభలో ఉద్విగ్న క్షణాలు కనిపించాయి. బాలకృష్ణతో కలిసి వచ్చిన సీఎం చంద్రబాబు.. అసెంబ్లీ మెట్లపై ప్రణమిల్లారు. రెండున్నరేళ్ల తర్వాత అసెంబ్లీలో చంద్రబాబు అడుగుపెట్టారు. డిప్యూటీ సీఎం పవన్, మంత్రులు, ఎమ్మెల్యేలు సీఎంకు స్వాగతం పలికారు. అంతకు ముందు ఉండవల్లి నివాసం నుంచి బయల్దేరిన చంద్రబాబు.. వెంకటపాలెంలో స్వర్గీయ ఎన్టీఆర్ విగ్రహానికి ఎమ్మెల్యేలతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అసెంబ్లీ హాల్‌లో అడుగుపెట్టిన చంద్రబాబు-పవన్ ఆలింగనం చేసుకుని ఒకరికొకరు శుభాకాంక్షలు చెప్పుకున్నారు. నిజం గెలిచింది.. ప్రజాస్వామ్యం నిలిచింది అంటూ టీడీపీ ఎమ్మెల్యేలు ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం సీఎం చంద్రబాబుతో ప్రొటెం స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. ఆ తర్వాత డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ శాసనసభ్యుడిగా ప్రమాణస్వీకారం చేశారు. నారాలోకేష్‌తోపాటు మిగతా మంత్రులు ప్రమాణం చేశారు. ఎమ్మెల్యేగా ప్రమాణం చేసిన వైఎస్ జగన్.. ప్రొటెం స్పీకర్‌ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..