TDP vs YSRCP: చంద్రబాబు సంతకాలతో ఇంటింటికీ గ్యారెంటీ పత్రాలు.. ఫిర్యాదు చేస్తామంటున్న వైసీపీ..

| Edited By: Shaik Madar Saheb

Nov 26, 2023 | 12:12 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య రోజుకో వివాదం పుట్టుకొస్తుంది.. నకిలీ ఓట్లు, ఓట్ల గల్లంతుపై ఇప్పటికే రెండు పార్టీలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేస్తున్నారని ఇరు పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి.. ఈ పంచాయతీ కాస్తా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది.

TDP vs YSRCP: చంద్రబాబు సంతకాలతో ఇంటింటికీ గ్యారెంటీ పత్రాలు.. ఫిర్యాదు చేస్తామంటున్న వైసీపీ..
Andhra Pradesh Politics
Follow us on

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలకు ముందు అధికార, ప్రతిపక్షాల మధ్య రోజుకో వివాదం పుట్టుకొస్తుంది.. నకిలీ ఓట్లు, ఓట్ల గల్లంతుపై ఇప్పటికే రెండు పార్టీలు పరస్పర ఫిర్యాదులు చేసుకున్నాయి. తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లు తొలగించేస్తున్నారని ఇరు పార్టీలు విమర్శలు చేసుకుంటున్నాయి.. ఈ పంచాయతీ కాస్తా కేంద్ర ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లారు. డ్రాఫ్ట్ ఓటర్ జాబితా విడుదల తర్వాత ఈ వివాదం మరింత ముదిరింది. తాజాగా తెలుగుదేశం-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో పైనా కొత్త వివాదం మొదలైంది. తెలుగుదేశం-జనసేన పొత్తు ప్రకటనకు ముందు టీడీపీ రాజమండ్రి వేదికగా మినీ మేనిఫెస్టో ప్రకటించింది. బాబు ష్యురిటీ-భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో ఆరు హామీలు ప్రకటించారు టీడీపీ అధినేత చంద్రబాబు. చంద్రబాబు స్కిల్ కేసులో అరెస్ట్ కావడానికి ముందు వరకూ మినీ మేనిఫెస్టోను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టింది ఆ పార్టీ.. చంద్రబాబు అరెస్ట్‌తో పార్టీ కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోయాయి.. ఆ తర్వాత జనసేనతో పొత్తుతో మేనిఫెస్టో స్వరూపం కూడా మారింది.. తెలుగుదేశం-జనసేన ఉమ్మడి మేనిఫెస్టో రూపొందించారు. మొత్తం 11 అంశాలతో రూపొందించిన మేనిఫెస్టోకు ఇరు పార్టీల అధ్యక్షుల ఆమోదంతో ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇంటింటికీ వెళ్తున్న కార్యకర్తలు మేనిఫెస్టోపై కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. చంద్రబాబు సంతకాలతో ఉన్న హామీ పత్రాలు పంపిణీ చేయడం, ప్రజల నుంచి వివరాలు సేకరించడంపై వైసీపీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది.

అధికారంలోకి వస్తే ఎంత లబ్ది చేస్తామో చెబుతూ లెటర్లు

తెలుగుదేశం-జనసేన ఉమ్మడి మేనిఫెస్టోను రెండు పార్టీల నేతలు ప్రజల్లోకి తీసుకెళ్తున్నారు. ఇంటింటికీ వెళ్తూ కరపత్రాలు పంపిణీ చేస్తున్నారు. ఉమ్మడి మేనిఫెస్టోలో మొత్తం 11 అంశాలున్నాయి. వాటిలో టీడీపీ ముందుగా ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలు నేరుగా నగదు బదిలీ జరిగే పథకాలున్నాయి. మహిళలు, రైతులు, యువతకు సంబంధించిన హామీల్లో నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి నగదు బదిలీ చేసేలా హామీ ఇస్తున్నారు. ఇలా ఇంటింటికీ వెళ్తున్నప్పుడు ఆ ఇంట్లో ఉన్నవారి డేటా తీసుకుంటున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. డేటా తీసుకుని ఒక యాప్‌లో నమోదు చేస్తే ఓటీపీ వస్తుందని అంటున్నారు. ఇలా ఓటీపీ ద్వారా వచ్చే లింక్‌ను ఓపెన్ చేస్తే భవిష్యత్తుకి గ్యారంటీ కార్డు వస్తుంది. ఈ కార్డులో ఆ కుటుంబానికి కంగ్రాట్స్ చెప్పి 2024 జూన్ నుంచి ఎంత మొత్తం నగదు జమ చేస్తారో చెబుతున్నట్లు చంద్రబాబు సంతకం చేసినట్లుగా ఇస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ఒక కుటుంబంలో చదువుకునే విద్యార్థులు,18 ఏళ్ళు నిండిన మహిళలు, రైతులు ఎవరెవరు ఉంటే వారికి ఏడాది మొత్తంలో ఇచ్చే నగదును చూపిస్తూ గ్యారంటీ కార్డులు ఇస్తున్నారు. ఇలా ప్రజల దగ్గర డేటా తీసుకోవడం సైబర్ క్రైమ్ కిందకి వస్తుందని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రజల ఓటర్ కార్డులు తీసుకుని ఇలా ఇవ్వడం ఎన్నికల కమిషన్ రూల్స్ కు విరుద్ధం అనేది వైసీపీ వాదన. ప్రజల ప్రాథమిక హక్కులను ఉల్లంఘించేలా తెలుగుదేశం పార్టీ నేతలు వ్యవహరిస్తున్నారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంతో పాటు చాలా ప్రాంతాల్లో ఇలా ఇంటింటికీ ఇస్తున్న కరపత్రాలు పంపిణీ చేస్తున్నట్లు వైసీపీ నేతలు ఆధారాలు చూపిస్తున్నారు. దీనిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామంటూ పేర్కొంటున్నారు. తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ మేనిఫెస్టో అమలు సరిగా చేయలేదని.. వైసీపీ 99 శాతం హామీలు నెరవేర్చిందని చెబుతున్నారు. చంద్రబాబు సంతకాలతో ఇచ్చిన గ్యారంటీ పత్రాలు కూడా ఎన్నికల తర్వాత పక్కనపడేస్తారని వైసీపీ నేతలు ఎద్దేవా చేస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..