ఒంగోలు(Ongole) లో జరిగే టీడీపీ మహానాడుకు పార్టీ అగ్రనేతలు, ముఖ్య నాయకులు పయనమయ్యారు. రేపటి నుంచి ప్రారంభం కానున్న పసుపు పండుగకు అన్ని జిల్లాల నుంచి నేతలు ప్రయాణమయ్యారు. మంగళగిరి నుంచి బైక్ లు, కార్లలో పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu), ఇతర నేతలు భారీ ర్యాలీగా బయల్దేరారు. మార్గమధ్యంలో చిలకలూరిపేట, మార్టూరు, అద్దంకి ప్రాంతాల్లో వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న పార్టీ శ్రేణులు ఈ ర్యాలీలో కలుస్తాయి. ఒంగోలు నగర పరిధిలోని త్రోవగుంట నుంచి మంగమూరు రోడ్డు, మున్సిపల్ ఆఫీస్, చర్చిసెంటర్ మీదుగా హోటల్ సరోవర్‌కు చేరుకుంటారు. సాయంత్రం టీడీపీ(TDP) పొలిట్ బ్యూరో సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో మహానాడులో చర్చించాల్సిన అంశాలు, తీర్మానాలపై నిర్ణయం తీసుకునే అవకాశముంది. మహానాడులో అంతా భాగస్వాములు కావాలని చంద్రబాబు సంతకం చేసిన డిజిటల్ ఆహ్వాన పత్రికలను పార్టీ నేతలకు పంపించారు. ఒంగోలులో నిర్వహిస్తున్న మహానాడులో రాజకీయ, సాంఘిక, ఆర్థిక, ఆరోగ్య, అంశాలపై చర్చతోపాటు ప్రభుత్వ ప్రజా వ్యతిరేక నిర్ణయాలు, అప్రజాస్వామిక విధాలను ఎండగట్టనున్నట్లు పార్టీ శ్రేణులు పేర్కొన్నారు.
మరోవైపు మహానాడు సభకు స్థలం ఇవ్వకపోవడం, ఆర్టీసీ బస్సులకు అనుమతులు ఇవ్వకపోవడంతో పాటు, ప్రైవేటు వాహనాలకు అడ్డంకులు సృష్టిస్తున్నారంటూ టీడీపీ నేతలు మండి పడుతున్నారు. ఎన్ని అడ్డంకులు ఎదురైనా మహానాడును ఘనంగా నిర్వహిస్తామని చెపుతున్నారు. ఈ మహానాడు వేదికగానే పార్టీ అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో తిరిగి అధికారం దక్కించుకొనే దిశగా తమ కార్యాచరణ ప్రకటించటంతో పాటుగా.. పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నారు. అదే విధంగా ప్రజల్లోకి వెళ్లే విధంగా కీలక నిర్ణయాలు ప్రకటించే అవకాశం ఉంది.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి