Andhra Pradesh: ఏపీకి గుడ్ న్యూస్.. రూ.40 వేల కోట్లతో టాటా పవర్ ప్రాజెక్టులు..

|

Nov 11, 2024 | 8:22 PM

ఏపీలో పెట్టుబడులపై ప్రత్యేక దృష్టి సారించారు సీఎం చంద్రబాబు. టాటా గ్రూప్ చైర్మన్‌తో భేటీ అయి కీలక రంగాలపై చర్చించారు. పరస్పర సహకారంతో ప్రభుత్వం - టాటా గ్రూప్‌ కలిసి ముందుకెళ్లాలని నిర్ణయించారు.

Andhra Pradesh: ఏపీకి గుడ్ న్యూస్.. రూ.40 వేల కోట్లతో టాటా పవర్ ప్రాజెక్టులు..
Chandrababu Naidu - N. Chandrasekaran
Follow us on

పెట్టుబడుల కోసం పెద్ద పెద్ద సంస్థలకు రెడ్‌ కార్పెట్ పరుస్తోంది ఏపీ ప్రభుత్వం. సంస్థలకు కావాల్సిన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా అమరావతిలో టాటా గ్రూప్‌ సంస్థల చైర్మన్ చంద్రశేఖరన్‌తో భేటీ అయ్యారు సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్‌. రాష్ట్రవ్యాప్తంగా మరో 20హోటళ్ల ఏర్పాటుకి టాటా గ్రూప్ సంసిద్దత వ్యక్తం చేసింది. 40 వేల కోట్ల పెట్టుబడితో టాటా పవర్ సోలార్‌, విండ్ ప్రాజెక్ట్‌ల ఏర్పాటుపై చర్చించారు. విశాఖలో కొత్త ఐటీ డెవలప్‌మెంట్‌ సెంటర్ ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. విశాఖలో టీసీఎస్‌ ద్వారా 10వేల ఉద్యోగాలు కల్పించాలని నిర్ణయించారు.

టీసీఎస్‌ క్యాంపస్ కోసం ఇప్పటికే ఆ కంపెనీ ప్రతినిధులు భవనాలను పరిశీలిస్తున్నారు. మిలీనియం టవర్స్ ఖాళీగానే ఉన్నందున ఆ టవర్స్‌ లీజుకి ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. అయితే సొంత కార్యాలయాలను నిర్మించుకునే పనిలో ఉంది టీసీఎస్. ఈ క్రమంలో ఆ సంస్థ ఆసక్తి చూపిస్తే భూములు కేటాయించాలని ప్రభుత్వం భావిస్తోంది. మరో ఆరు నెలల్లో టీసీఎస్ కేంద్రం విశాఖలో ప్రారంభం అవుతుందని ఇప్పటికే లోకేష్‌ ప్రకటించారు. ఇప్పుడు ఆ దిశగా అడుగులు పడుతున్నట్టు స్పష్టమవుతోంది. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్‌-విజన్ 2047 రూపకల్పన అంశాలపై టాటా గ్రూప్ చైర్మన్‌తో చర్చించామన్నారు సీఎం చంద్రబాబు. 2047 నాటికి ఏపీని నంబర్ వన్ ప్లేస్‌లో నిలవడమే లక్ష్యమన్నారు. మేధావులు, పరిశ్రమలు, ప్రముఖులు సభ్యులుగా స్వర్ణాంధ్రప్రదేశ్‌@2047 ఆర్థికాభివృద్ధి కోసం టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేస్తున్నామన్నారు. వేర్వేరు రంగాల్లో ఇతర కంపెనీల భాగస్వామ్యం కల్పించే అంశాలపై ఇకపై విస్తృత చర్చలు ఉంటాయన్నారు చంద్రబాబు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి