
శ్రీశైలం వెళ్లే భక్తులకు ఏపీ ప్రభుత్వం తీపికబురు అందించింది. తెలుగు రాష్ట్రాల్లో ప్రముఖ పుణ్యక్షేత్రంగా ఉన్న శ్రీశైలంకు తరచూ తెలుగు రాష్ట్రాల నుంచి వేలమంది భక్తులు వస్తూ ఉంటారు. శ్రీ మల్లిఖార్జునస్వామిని దర్శించుకుని ఆనందం పొందుతారు. దీంతో శ్రీశైలంలో ఎప్పుడూ భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ దేవాదాయశాఖ అనేక నిర్ణయాలు తీసుకుంటుంది. శ్రీశైలంకు వచ్చే భక్తులకు సౌకర్యాల కల్పనపై దృష్టి పెట్టింది. టీటీడీ తరహాలో శ్రీశైలంలో అనేక సదుపాయాలు ప్రవేశపెడుతోంది. త్వరలో మహాశివరాత్రి రానుండటంతో శ్రీశైలంకు భక్తుల తాకిడి మరింత పెరగనుంది. ఈ క్రమంలో మహాశివరాత్రికి ఏర్పాట్లపై తాజాగా దేవాదాయశాఖ మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి సమీక్ష నిర్వహించారు.
శ్రీశైలంలో మహాశివరాత్రి సందర్భంగా ఈ నెల 8వ తేదీ నుంచి 18వ తేదీ వరకు బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా శ్రీశైలంలో స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఉచితంగా పాలు, బిస్కెట్లు, అల్పాహారం ఉచితంగా అందించాలని దేవాదాయశాఖ నిర్ణయం తీసుకుంది. క్యూలైన్లలో ఉండే భక్తులకు నిరంతరం వీటిని పంపిణీ చేయనున్నారు. అలాగే నాలుగు రోజుల పాటు భక్తులకు ఉచితంగా లడ్డూలు ఇవ్వాలని నిర్ణయించింది. వీటితో పాటు మంచినీరు సరఫరా చేయనున్నారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆలయ అధికారులతో మంత్రి ఆనం రాంనారాయణరెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా భక్తులకు ఇబ్బంది లేకుండా మౌలిక సదుపాయాలు కల్పించాలని ఆదేశించారు. సీఎం చంద్రబాబు ఆదేశాలతో భక్తులకు ఉచితంగా లడ్డూలతో పాటు పాలు, అల్పాహారం, బిస్కెట్లు, మంచినీరు అందించాలని అధికారులను ఆదేశించారు.
శ్రీశైలం వచ్చే భక్తులకు టోల్ ఫీజు భారం తప్పనుంది. ఈ నెల 14,15వ తేదీల్లో శ్రీశైలం వైపు వచ్చే అన్నీ టోల్ గేట్ల దగ్గర చార్జీలు వసూలు చేయకుండా వాహనదారులను అనుమతించాలని ఏపీ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. గత ఏడాది కంటే 50 శాతం అదనంగా ఏర్పాట్లు చేయాలని సూచించింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా శ్రీశైలంలో 3 వేల మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేయనున్నారు. ఇక ట్రాఫిక్ లేకుండా అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ఎప్పటికప్పుడు ట్రాఫిక్, భద్రతను పర్యవేక్షించనున్నారు. ఈ సమావేశంలో ఆనం రాంనారాయణ రెడ్డితో పాటు హోంమంత్రి అనిత కూడా పాల్గొన్నారు. భక్తుల భద్రతపై పోలీస్ ఉన్నతాధికారులకు పలు సూచనలు చేశారు. భక్తుల రద్దీని కట్టడి చేయాలని ఆదేశించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని అనిత తెలిపారు.