ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో.. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్‌పై.. కోర్టులలో పిటిషన్ల ఫైట్ కొనసాగుతోంది. కోర్టుల్లో అయన వేస్తున్న పిటిషన్లపై ప్రతికూల తీర్పులే వస్తున్నాయి. స్కిల్ స్కామ్ దగ్గర నుంచి.. అంగళ్లు దాడి, ఇన్నర్ రింగ్ రోడ్డు స్కాం వరకు… అన్ని కేసులు.. కోర్టుల్లో విచారణలు పెండింగ్‌లో ఉన్నాయి. అటు.. గురువారం నుంచి అక్టోబర్ 2 వరకూ.. కోర్టులకు హాలిడేస్ కావడంతో.. బుధవారం జరిగే విచారణపై ఉత్కంఠ నెలకొంది. అటు సుప్రీం కోర్టులో అయితే బాబుకు ప్రతికూలతే ఎదురైంది.
స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ బుధవారం సుప్రీంకోర్టులో విచారణకు వచ్చింది. అయితే బెంచ్‌లోని తెలుగు న్యాయమూర్తి జస్టిస్ ఎస్వీఎన్ భట్టి.. విచారణకు విముఖత చూపించారు. సంజీవ్ ఖన్నా బెంచ్‌లో నాట్ బిఫోర్ మీ అన్నారు జస్టిస్ భట్టి. దీంతో మరో బెంచ్‌కు పిటిషన్‌ను బదిలీ చేశారు. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా పడింది. ఈ విషయాన్ని సీజేఐ ధర్మాసనం ముందుకు తీసుకెళ్లారు బాబు లాయర్ లూథ్రా. మరో ధర్మాసనం, లేదా సీజేఐ ధర్మాసనం ఇప్పుడే విచారించాలని ఆయన కోరారు. దీంతో పిటిషన్ విచారణను సీజేఐ ధర్మాసనం టేకప్ చేసింది. కేసు విచారణను అక్టోబర్ 3కు వాయిదా వేసింది. విచారణను మరో బెంచ్‌కు బదిలీ చేస్తామని సీజేఐ ధర్మాసనం తెలిపింది. అక్టోబర్ 3న అన్ని విషయాలు వింటామని పేర్కొంది.
తొలుత చంద్రబాబు తరఫు న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై నిర్ణయం తీసుకున్న సీజేఐ.. బుధవారం విచారణ చేపట్టేందుకు అంగీకరించారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఎ కింద గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండా స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో తనపై నమోదు చేసిన కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు సుప్రీం కోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
చంద్రబాబు బెయిల్, సీఐడీ కస్టడీ పిటిషన్లపై ఏసీబీ కోర్టులో మధ్యాహ్నం విచారణ జరగనుంది. చంద్రబాబు తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రమోద్ దూబే.. సీఐడీ తరఫున వాదనలు స్పెషల్ పీపీ వివేకానంద వాదనలు వినిపించనున్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో బెయిల్ కోరుతూ చంద్రబాబు పిటిషన్ వేయగా.. బాబును మరో 5 రోజులు కస్టడీకి ఇవ్వాలని సీఐడీ పిటిషన్ వేసింది. అటు అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో మరో కీలక పరిణామం చోటుచేసుకున్న తెలిసిందే. ఈ కేసులో.. తొలిసారిగా.. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేరును చేర్చింది ఏపీ సీఐడీ. ఏ14గా పేరు చేర్చి విజయవాడ ఏసీబీ కోర్టులో సీఐడీ మెమో దాఖలు చేసింది. రింగ్ రోడ్డు కేసులో ఏ1 గా చంద్రబాబు, ఏ2గా నారాయణలతో పాటు లింగమనేని రమేష్, బిల్డర్ అంజనీకుమార్ ఉన్నారు. తాజాగా ఈ వ్యవహారంలో లోకేష్ పేరును కూడా చేర్చారు. అమరావతి రింగ్‌రోడ్ కేసుకు సంబంధించి లోకేశ్ హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ వేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..