సత్యసాయి జిల్లాలోని బుక్కపట్నంలో లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడిన సబ్‌రిజిస్ట్రార్ శ్రీనివాస్‌నాయక్ ఆత్మహత్య చేసుకున్నారు. విచారణలో ఉండగానే.. అధికారుల కళ్లుగప్పి పరారైన శ్రీనివాస్‌నాయక్ చెన్నైలోని లాడ్జిలో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన సత్యసాయి జిల్లాలో కలకలం రేపింది. వివరాల్లోకెళితే.. సత్యసాయి జిల్లా పుట్టపర్తి మండలం బ్రాహ్మణపల్లికి చెందిన లింగాల సురేంద్రారెడ్డి.. తన సొంత ఆస్తిని మార్చిలో రిజిష్టర్ చేసుకున్నారు. అందుకుగాను అప్పట్లో 30 వేలు లంచం ఇచ్చారు. స్టాంపు డ్యూటీ తక్కువతో రిజిస్ట్రేషన్ చేసినట్లు ఆడిట్‌లో తేలిందంటూ.. మరో లక్ష ఇవ్వాలని డాక్యుమెంట్ రైటర్ శ్రీహరి, అతనిపై ఒత్తిడి తెచ్చారు. చివరికి 50వేలకు ఒప్పందం కుదరగా.. ఈనెల 16న బాధితుడు ఏసీబీ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. దాంతో.. బుధవారం సాయంత్రం సురేంద్రారెడ్డి పదివేలు తీసుకుని సబ్‌రిజిస్ట్రార్ వద్దకు వెళ్లగా.. డాక్యుమెంట్ రైటర్‌కు ఇవ్వాలని సూచించారు. ఆ డబ్బులు డాక్యుమెంట్ రైటర్ నుంచి సబ్‌రిజిస్ట్రార్‌కు అందగానే ఏసీబీ అధికారులు దాడి చేసి సబ్‌రిజిస్ట్రార్‌తోపాటు డాక్యుమెంట్ రైటర్ శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు.
ఈ క్రమంలో..అర్ధరాత్రి వరకు వారిద్దర్నీ ఏసీబీ అధికారులు విచారించగా.. భోజన విరామ సమయంలో వాళ్ల కళ్లుగప్పి శ్రీనివాసుల నాయక్ పరారయ్యారు. అయితే.. సబ్ రిజిస్ట్రార్ పరార్ అయ్యేందుకు ఓ వ్యక్తి సహకరించినట్లు గుర్తించారు పోలీసులు. బైక్ మీద సబ్ రిజిస్ట్రార్ పరారవుతున్న దృశ్యాలు సీసీటీవీ కెమెరాలో రికార్డ్ అయ్యాయి.
సీసీ ఆధారంగా.. సబ్ రిజిస్ట్రార్ కోసం అధికారులు గాలిస్తుండగా..అతడు చెన్నైలో ఆత్మహత్య చేసుకున్నట్లు సత్యసాయి జిల్లా పోలీసులకు సమాచారం అందింది.. చెన్నైలోని ఓ లాడ్జ్ లో ఉరివేసుకుని శ్రీనివాస్ నాయక్ సూసైడ్ చేసుకున్నారని చెన్నై పోలీసులు సత్యసాయి జిల్లా పోలీసులు సమాచారం ఇచ్చారు.
దీంతో శ్రీనివాస్ నాయక్ డెడ్ బాడీని తీసుకొచ్చేందుకు చెన్నై బయలుదేరి వెళ్లారు సత్యసాయి జిల్లా పోలీసులు.. సబ్‌రిజిస్ట్రార్ సూసైడ్ బాధాకరం అంటూ ఎస్పీ మాధవరెడ్డి విచారం వ్యక్తం చేశారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..