AP Rains: వాయుగుండం అలెర్ట్.. ఏపీకి వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరిక..

|

Nov 10, 2022 | 5:06 PM

నిన్న ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతుందని.. ఇది వచ్చే 24 గంటల్లో..

AP Rains: వాయుగుండం అలెర్ట్.. ఏపీకి వర్షాలే వర్షాలు.. ఆ జిల్లాలకు హెచ్చరిక..
Andhra Weather Report
Follow us on

ఆంధ్రప్రదేశ్‌ను వర్షాలు ముంచెత్తాయి. గడిచిన నాలుగైదు రోజులుగా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఇలా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో సతమతమవుతున్న రాష్ట్ర ప్రజలకు వాతావరణ శాఖ మరో హెచ్చరిక జారీ చేసింది. నైరుతి బంగాళాఖాతంలో నిన్న ఏర్పడిన అల్పపీడనం సముద్ర మట్టం నుంచి 7.6 కి.మీ వరకు విస్తరించి ఉన్న ఉపరితల ఆవర్తనంతో కొనసాగుతుందని.. ఇది వచ్చే 24 గంటల్లో మరింతగా బలపడే అవకాశం ఉందని అమరావతి వాతావరణ శాఖ తెలిపింది.

ఈ అల్పపీడనం నవంబర్ 12వ తేదీ ఉదయం నాటికీ వాయువ్య దిశగా కదిలి వాయుగుండంగా తమిళనాడు-పుదుచ్చేరి తీరాన్ని తాకనుందని పేర్కొంది. ఈ అల్పపీడన ప్రభావం దృష్ట్యా నవంబర్ 11 నుంచి 13 వరకు ఏపీలోని దక్షిణ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.

నవంబర్ 11 నుంచి 15 వరకు నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయంది. అలాగే ఆయా రోజుల్లో అన్నమయ్య, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో మోస్తరు వర్షాలు.. సత్యసాయి అనంతపూర్, నంద్యాల జిల్లాల్లో చిరుజల్లులు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక దక్షిణంలో స్థిరంగా కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం కారణంగా విశాఖపట్నం, విజయవాడ, కాకినాడ, ఒంగోలులోని పలు ప్రాంతాల్లో తక్కువ వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ వివరించింది.