Srisailam Temple: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు ఇది కదా కావాల్సింది.. సూపర్ గుడ్ న్యూస్..

శ్రీశైలం మల్లన్న భక్తులకు తీపికబురు వచ్చేసింది. శని, ఆది, సోమవారాల్లో శ్రీమల్లికార్జునస్వామివారి స్పర్శ దర్శన సమయాలను పెంచుతూ ఆలయ అధికారులు నిర్ణయం తీసుకున్నారు. జనవరి 6 నుంచి కొత్త విధానం అమల్లోకి రానుంది. పూర్తి వివరాలు తెలుసుకుందాం పదండి ... ..

Srisailam Temple: శ్రీశైల భ్రమరాంబ మల్లికార్జున స్వామి భక్తులకు ఇది కదా కావాల్సింది.. సూపర్ గుడ్ న్యూస్..
Srisailam Temple

Edited By:

Updated on: Dec 20, 2025 | 5:52 PM

శ్రీశైలం మల్లన్న దర్శనానికి వచ్చే భక్తులకు ఆలయ అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. భక్తుల సౌకర్యార్థం శ్రీమల్లికార్జునస్వామివారి స్పర్శ దర్శన సమయాలను పెంచుతూ కీలక నిర్ణయం తీసుకున్నారు. భక్తుల నుంచి వచ్చిన రిక్వెస్టుల మేరకు శని, ఆది, సోమవారాల్లో స్పర్శ దర్శన వేళలను పొడిగించినట్లు ఆలయ ఈవో శ్రీనివాసరావు తెలిపారు. ఈ కొత్త విధానం జనవరి 6 నుంచి అమల్లోకి వస్తుంది. జనవరి నెల నుంచి వీకెండ్స్‌లో.. మొత్తం ఆరు స్లాట్ల ద్వారా స్పర్శ దర్శనం టికెట్లు జారీ చేయనున్నారు. ఈ నిర్ణయంతో వీకెండ్‌లో భారీగా వచ్చే భక్తులకు మరింత సౌకర్యం కలుగుతుందని ఆలయ అధికారులు తెలిపారు. వారాంతాల్లో శ్రీశైలంలో దర్శనాల షెడ్యూల్‌ను మార్చారు. శని, ఆది, సోమవారాల్లో ఉదయం 6 గంటల నుంచి 7 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం ఉంటుంది. అనంతరం ఉదయం 7 గంటల నుంచి 8.30 గంటల వరకు స్పర్శ దర్శనం నిర్వహిస్తారు. తర్వాత ఉదయం 10.30 నుంచి 11.30 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం, అనంతరం ఉదయం 11.45 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు స్పర్శ దర్శనం అందుబాటులో ఉంటుంది. సాయంత్రం 7.45 నుంచి 8 గంటల వరకు వీఐపీ బ్రేక్ దర్శనం, ఆపై రాత్రి 9 నుంచి 11 గంటల వరకు భక్తులు స్పర్శ దర్శనం చేసుకునే వెసులుబాటు ఉంటుంది. భక్తులు స్పర్శ దర్శనం టికెట్లను www.aptemples.ap.gov.in, www.srisailadevasthanam.org వెబ్‌సైట్ల ద్వారా ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. అలాగే వాట్సాప్ నంబర్ 9552300009 ద్వారా కూడా టికెట్లు పొందే సౌకర్యం కల్పించారు.

అదేవిధంగా రూ.150తో శీఘ్ర దర్శనం, రూ.300తో అతిశీఘ్ర దర్శనం టికెట్లను ఆన్‌లైన్‌తో పాటు కౌంటర్ ద్వారా కూడా అందుబాటులో ఉంచారు. ప్రస్తుతం శ్రీశైలం మల్లన్న ఆలయంలో 14 రకాల సేవలు పూర్తిగా ఆన్‌లైన్‌లో అందుబాటులోకి వచ్చాయి. మనమిత్ర వాట్సాప్ గవర్నెన్స్ సేవల ద్వారా స్పర్శ దర్శనం, వసతి, శీఘ్ర దర్శనం, అతి శీఘ్ర దర్శనం వంటి సౌకర్యాలను భక్తులు సులభంగా పొందవచ్చని అధికారులు తెలిపారు. ఈ మార్పులతో శ్రీశైలంలో స్వామివారి దర్శనం మరింత సులభంగా, సౌకర్యవంతంగా మారుతుందని దేవస్థానం అధికారులు ఆశాభావం వ్యక్తం చేశారు. భక్తులు ఈ విషయాన్ని గమనించి సద్వినియోగం చేసుకోవాలని ఆలయ అధికారులు సూచించారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..