వేగంగా వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు.. కళ్ళముందే తగలబడిపోయిన ట్రావెల్ బస్సు..!

శ్రీకాకుళం జిల్లాలో కేవీఆర్ ట్రావెల్స్ ప్రైవేట్ బస్సు అకస్మాత్తుగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. ప్రయాణికులు సురక్షితంగా బయటపడటంతో ప్రాణనష్టం తప్పింది. ఈ ఘటన ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకుల నిర్వహణ లోపాలు, రవాణాశాఖ అధికారుల పర్యవేక్షణ రాహిత్యాన్ని మరోసారి వెలుగులోకి తెచ్చింది. ప్రయాణికుల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి.

వేగంగా వెళ్తున్న బస్సులో ఒక్కసారిగా మంటలు..  కళ్ళముందే తగలబడిపోయిన ట్రావెల్ బస్సు..!
Bus Fire Srikakulam

Edited By:

Updated on: Sep 19, 2026 | 8:09 PM

ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు ఇటీవల మృత్యు కుహరాలుగా మారుతున్నాయి. తరచూ ప్రమాదాల బారిన పడి అమాయకుల ప్రాణాలను బలిగొంటున్నాయి. ట్రావెల్స్ నిర్వాహకులు కాసులపై చూపిస్తున్న ఆసక్తి బస్సుల నిర్వహణ, ప్రయాణికుల భద్రతపై చూపించటం లేదు. అటు పట్టించుకోవలసిన రవాణాశాఖ అధికారులు సైతం ప్రమాదాలు జరిగినప్పుడు తూతూ మంత్రంగా తనిఖీలు చేపట్టి చేతులు దులుపుకుంటున్నారు తప్ప.. సరైన పర్యవేక్షణ చర్యలు చేపట్టటం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా శనివారం (సెప్టెంబర్ 19) శ్రీకాకుళం జిల్లాలో ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు వ్యాపించి బస్సు మొత్తం దగ్ధం అవ్వటంతో మరోసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల భద్రత ప్రమాణాలు చర్చనీయంశంగా మారాయి.

శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట సమీపంలోనీ జమ్ము జంక్షన్ వద్ద శనివారం ఉదయం కేవీఆర్ ట్రావెల్స్ బస్సు అగ్ని ప్రమాదానికి గురయింది. ప్రయాణిస్తున్న బస్సు నుండి అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. క్షణాల్లో మంటలు బస్సు మొత్తం వ్యాపించాయి. దీంతో బస్సులో ఉన్న ప్రయాణికులు అంతా ఒక్కసారిగా తీవ్ర భయాందోళనక గురయ్యారు. మంటలను గమనించి బస్సు సిబ్బంది నరసన్నపేట సమీపంలోనీ జమ్ము జంక్షన్ వద్ద రోడ్డు పై బస్సును ఆపి వేశారు. వెంటనే ప్రయాణికులు అప్రమత్తమై బయటకు పరుగులు పెట్టారు. దీంతో ప్రాణ నష్టం తప్పింది. కానీ మంటలు తీవ్రంగా వ్యాపించడంతో బస్సు పూర్తిగా దగ్ధమైంది. దట్టమైన పొగలు అలుముకొని మంటలు భారీగా ఎగిసిపడ్డాయి. ట్రాఫిక్ జామ్ అయింది.బస్సు విజయవాడ నుంచి శ్రీకాకుళం జిల్లా పలాసకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు ఫైర్ స్టేషన్ కి సమాచారం ఇవ్వగా పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే ఘటన స్థలికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన చోటుకి సమీపంలోనే విద్యుత్ వైర్లు
ఉన్నాయి. దీంతో పవర్ సప్లయ్ ను ఆపి ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు.

అగ్నిప్రమాదానికి ముందు శ్రీకాకుళం వద్ద బస్సు అకస్మాత్తుగా ఆగిపోయింది. ఆ సమయంలో ప్రయాణికులు బస్సు నుంచి దిగిపోవడానికి ప్రయత్నించగా, బస్సులో ఎలాంటి సమస్య లేదని సురక్షితంగా గమ్యస్థానానికి చేరుస్తామని బస్సు సిబ్బంది చెప్పి బస్సును తాత్కాలిక మరమ్మత్తు చేపట్టి తిరిగి బస్సును స్టార్ట్ చేసినట్టు ప్రయాణికులు చెబుతున్నారు. అనంతరం నరసన్నపేట సమీపానికి చేరుకునే సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు ప్రయాణికులు తెలిపారు. బస్సులో అధికంగా లగేజీ ఉండటమే మంటలు వేగంగా వ్యాపించడానికి కారణమై ఉండవచ్చని ప్రయాణికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ట్రావెల్స్ బస్సులో నిబంధనలకు విరుద్ధంగా లగేజ్ ను భారీగా రవాణా చేస్తున్నారని ప్రయాణికులు అంటూన్నారు. తమ గమ్యస్థానం అయిన శ్రీకాకుళంలోనే చాలా వరకు ప్రయాణికులు దిగిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో కేవలం ఐదుగురు మాత్రమే ప్రయాణికులు ఉన్నారు. దీంతో క్షణాల్లో ప్రయాణికులు ప్రమాదం నుండి బయటపడ్డారు. అదే ప్రయాణికులు సంఖ్య ఎక్కువ ఉంటే ప్రాణ నష్టం కూడా బారీగా జరిగి ఉండేది.

వీడియో ఇక్కడ చూడండి..

మరిన్ని క్రైమ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Loading...
Unable to load recommendations.
Follow Us