
తిరుమల తిరుపతి దేవస్థానానికి చెందిన శ్రీవేంకటేశ్వర భక్తి ఛానల్ నూతన చైర్మన్‌గా నియమితులైన శ్రీధరవర్మ అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు తిరుమల శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో వేద పండితుల ఆశీర్వచనాలు అందుకున్న ఆయన, అనంతరం అలిపిరి సమీపంలోని ఎస్వీబీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకుని పదవీ బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమానికి కూటమి నేతలతో పాటు నందమూరి కుటుంబ సభ్యులు, సినీ ప్రముఖులు భారీగా తరలివచ్చి ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం శ్రీధరవర్మ మాట్లాడుతూ.. శ్రీవారి ఖ్యాతిని, సనాతన హిందూ ధర్మ విశిష్టతను ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేయడంలో ఎస్వీబీసీ ఛానల్ కీలక భూమిక పోషిస్తోందని అన్నారు. ఉద్యోగులందరినీ సమన్వయం చేసుకుంటూ ఛానల్‌ను మరింత ముందుకు నడిపిస్తానని తెలిపారు. తనకు ఈ ఉన్నత బాధ్యతలను అప్పగించిన సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేష్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డిలకు ఆయన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు.
ఈ కార్యక్రమానికి హాజరైన నందమూరి కుటుంబ సభ్యులు శ్రీధరవర్మను ఘనంగా సత్కరించారు. నందమూరి మోహనకృష్ణ మాట్లాడుతూ.. శ్రీధరవర్మ తమకు సోదర సమానుడని గుర్తుచేసుకున్నారు. దివంగత ఎన్టీఆర్ కాలం నుంచే వారి కుటుంబం పార్టీతో, తమ కుటుంబంతో ఎంతో సన్నిహితంగా ఉందని, నాటి ఎన్టీఆర్ రాజు శ్రీవారి సేవకే ప్రాధాన్యమిచ్చి టీటీడీ అభివృద్ధికి భూమిని సైతం దానం చేశారని తెలిపారు. అటువంటి సేవాతత్పరత ఉన్న కుటుంబం నుంచి వచ్చిన శ్రీధరవర్మ ఈ పదవికి నూటికి వంద శాతం న్యాయం చేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
అదేవిధంగా నందమూరి రామకృష్ణ, నందమూరి మోహన రూప మాట్లాడుతూ.. నాలుగు తరాలుగా శ్రీవారి సేవలో అంకితభావంతో ఉన్న కుటుంబానికి ప్రభుత్వం సముచిత గౌరవం ఇచ్చిందని ప్రశంసించారు. విలువలకు కట్టుబడి పనిచేసిన ఎన్టీఆర్ రాజుగారి వారసత్వాన్ని శ్రీధరవర్మ సమర్థవంతంగా కొనసాగిస్తారని, ఎస్వీబీసీ ఛానల్‌ను మరింత ఉన్నత స్థానానికి చేరుస్తారని ధీమా వ్యక్తం చేశారు.