
ఇండియాలో నివసించే చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు అందరికీ ఆధార్ కార్డు తప్పనిసరి. ఈ గుర్తింపు ధృవీకరణ పత్రం లేనిది మీరు ఏ సేవలు దేశంలో పొందలేరు. పిల్లలు పుట్టగానే ఆధార్ కార్డు తీసుకునేందుకు హాస్పిటల్స్‌లోనే ప్రత్యేక కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. అయితే పిల్లలకు ఇచ్చే ఆధార్ కార్డులో బయోమెట్రిక్ డీటైల్స్ ఉండవు.

పిల్లలు కాస్త పెద్ద అయిన తర్వాత వాటిని అప్డేట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇందుకోసం స్కూల్స్‌లోనే ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేస్తున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లల బయోమెట్రిక్ వివరాలను వీటి ద్వారా సింపుల్‌గా అప్డేట్ చేయవచ్చు. తాజాగా ఏపీలోని పాఠశాలల్లో ప్రత్యేక ఆధార్ క్యాంపులను ఏర్పాటు చేసేందుకు రంగం సిద్దమైంది

నవంబర్‌లో ఆధార్ స్పెషల్ క్యాంపులు ఏర్పాటు చేయగా.. వీటికి మంచి స్పందన వచ్చింది. దీంతో అప్డేట్ చేసుకోనివారి కోసం GSWS శాఖ నిర్ణయం మేరకు డిసెంబర్‌లో కూడా ప్రత్యేక ఆధార్ క్యాంపులు నిర్వహించనున్నారు. డిసెంబర్ 16వ తేదీ నుంచి 24వ తేదీ వరకు ఈ క్యాంపులు అందుబాటులో ఉండనున్నాయి.

ఇంకా పెండింగ్‌లో ఉన్న ఆధార్ బయోమెట్రిక్ అప్డేట్ చేసేందుకు వీటిని ఏర్పాటు చేశారు. పిల్లలు లేదా విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాల్సిందిగా ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు తల్లిదండ్రులకు సూచనలు జారీ చేసింది.

5 సంవత్సరాలు నిండిన పిల్లలకు ఆధార్‌లో బయోమెట్రిక్ అప్డేట్ చేయడం తప్పనిసరి. అలాగే 15 సంవ్సరాలు నిండిన తర్వాత కూడా మళ్లీ అప్డేట్ చేయాలి. వీళ్లు ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా ప్రభుత్వం స్కూళ్లు, అంగన్ వాడీ, గ్రామ సచివాలయాల్లో ప్రత్యేక క్యాంపుల ద్వారా అప్డేట్ చేసుకోవచ్చు. పిల్లల వేలిముద్రలు, ఐరిస్ స్కాన్ వంటివి సేకరించి అప్డేట్ చేస్తారు.