Monsoon: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు .. 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం

|

Jun 06, 2024 | 6:26 AM

వేసవి ఎండ నుంచి ఉపశమనం కలిగిస్తూ తెలుగు రాష్ట్రాల ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు అందించింది. ఐదు రోజుల పాటు రాష్ట్రవ్యాప్తంగా మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. రుతుపవనాల రాకతో ఆంధ్రప్రదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. 

Monsoon: తెలుగు రాష్ట్రాలకు చల్లటి కబురు .. 5 రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం
Monsoon Hit In Ap And Ts
Follow us on

నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాల్లో ప్రవేశించి, చురుగ్గా కదులుతున్నాయి. వీటి ప్రభావంతో తెలుగురాష్ట్రాల్లో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్‌లో వేర్వేరు ప్రాంతాల్లో ఈదురుగాలులతో కూడిన వాన కురిసింది. శేరిలింగంపల్లి, చందానగర్‌, మియాపూర్‌.. మాదాపూర్‌, గచ్చిబౌలి, రాయదుర్గంలో జోరువాన కురిసింది. రోడ్లపై వర్షపునీరు పొంగిపొర్లింది. వాహనాలు భారీ సంఖ్యలో నిలిచిపోయాయి. దీంతో వాహనదారుల తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. మరోవైపు అల్లూరిజిల్లా ఏజెన్సీలో భారీ వర్షం కురిసింది.

రుతుపవనాల రాకతో  తెలంగాణ, ఆంధ్రపదేశ్ లోని కొన్ని జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తాయని తెలిపింది. నైరుతి రుతుపవనాలు రాబోయే 3 నుంచి 4రోజులలో కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని మరికొన్ని ప్రాంతాలలో ప్రవేశించే అవకాశం ఉందన్నారు.

నైరుతి బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఈ ఉదయం దక్షిణ ఆంధ్రప్రదేశ్ పరిసర ప్రాంతాలలో సగటు సముద్రమట్టానికి 3.1 నుంచి 4.5 కిలో మీటర్ల ఎత్తులో కేంద్రీకృతమై ఉందని వెల్లడించింది వాతావరణశాఖ. మరోవైపు నేడు మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరిస్తాయని.. పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది. తెలంగాణలోని నారాయణపేట, ఆంధ్రప్రదేశ్‌లోని నరసాపురం మీదుగా నైరుతి రుతుపవనాలు కదులుతున్నాయని వాతావరణ కేంద్రం ఒక ప్రకటనలో పేర్కొంది. వీటి ప్రభావంతో రాబోయే 3 నుంచి 4 రోజులలో తెలంగాణ, కోస్తా ఆంధ్రప్రదేశ్‌లోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.

 

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..