మండే ఎండల నుంచి ఉపశమనం.. ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు!

భానుడి భగభగలతో అల్లాడుతున్న ఏపీ ప్రజలకు గుడ్‌న్యూస్. నైరుతి రుతుపవనాలు రాష్ట్రాన్ని తాకాయి. ప్రస్తుతం రాయలసీమ, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో విస్తరిస్తున్న రుతుపవనాలు త్వరలో మరిన్ని ప్రాంతాలకు చేరనున్నాయి. దీంతో పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉండగా, ఎండల తీవ్రత కూడా తగ్గే సూచనలు కనిపిస్తున్నాయి.

మండే ఎండల నుంచి ఉపశమనం.. ఏపీని తాకిన నైరుతి రుతుపవనాలు!
Andhra Pradesh Monsoon

Edited By:

Updated on: Jun 06, 2026 | 1:37 PM

కొన్ని రోజులుగా భానుడి భగభగలతో అల్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో వర్షాకాలానికి నాంది పలికే నైరుతి రుతుపవనాలు ఆంధ్రప్రదేశ్‌ను తాకాయి. ప్రస్తుతం రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో రుతుపవనాలు క్రమంగా విస్తరిస్తున్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది.

గత కొద్దిరోజులుగా 40 డిగ్రీలకుపైగా నమోదవుతున్న ఉష్ణోగ్రతలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇలాంటి సమయంలో నైరుతి రుతుపవనాల ప్రవేశం ఉపశమనం కలిగించే అంశంగా మారింది. వాతావరణ పరిస్థితులు కూడా రుతుపవనాల విస్తరణకు పూర్తిగా అనుకూలంగా ఉన్నాయని అధికారులు చెబుతున్నారు.

రాబోయే రెండు నుంచి మూడు రోజుల్లో రుతుపవనాలు రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించే అవకాశం ఉంది. దీంతో పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశముందని అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ జిల్లాలు, దక్షిణ కోస్తా ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు పేర్కొంటున్నారు.

రుతుపవనాల ప్రభావంతో గరిష్ఠ ఉష్ణోగ్రతలు క్రమంగా తగ్గే అవకాశం ఉంది. దీంతో మండే ఎండల నుంచి ప్రజలకు కొంత ఊరట లభించనుంది. మరోవైపు రైతులు కూడా రుతుపవనాల రాకపై ఆశగా ఎదురుచూస్తున్నారు. ఖరీఫ్ సాగు పనులకు ఇవి ఊతమివ్వనున్నాయి. ఎండలతో ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వేళ.. నైరుతి రుతుపవనాల ఎంట్రీతో ఏపీ ప్రజలకు చల్లని కబురు అందింది. ఇప్పుడు అందరి చూపు తొలి వర్షాలపైనే ఉంది.

రాబోయే 2-3 రోజుల్లో నైరుతి రుతుపవనాలు మధ్య అరేబియా సముద్రంలోని మరికొన్ని ప్రాంతాలు, మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాలు, తమిళనాడులోని మిగిలిన ప్రాంతాలు, నైరుతి బంగాళాఖాతం, పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలోని మరికొన్ని ప్రాంతాలు, ఈశాన్య రాష్ట్రాల్లోకి మరింతగా విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..  

 

Follow Us