
ఉత్తరాంధ్ర ప్రజల చిరకాల వాంఛ త్వరలో సాకారం కాబోతుందా..? ఎప్పటినుంచో ఊరిస్తున్న సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలోనే పట్టాలెక్కనున్నాయా..? అందుకు ఏప్రిల్ మొదటి వారంలోనే ముహూర్తం ఖరారు అవుతుందా..? అవుననే అంటున్నాయి రైల్వే కార్మిక వర్గాలు. నెలాఖరు కల్లా కొత్త జోన్ అపాయింట్మెంట్ డే పై నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఏప్రిల్ లోనే జోన్ అమల్లోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం రైల్వేశాఖను గట్టిగా కోరుతోంది. ఇప్పటికే తాత్కాలిక జోన్ ప్రధాన కార్యాలయం సిద్ధమైంది. శరవేగంగా శాశ్వత కార్యాలయం నిర్మాణం జరుగుతుంది. మరి.. గెజిట్ నోటిఫికేషన్ విడుదల అయితేనే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయి. దానికోసమే ఆశగా ఎదురుచూస్తున్నారు ఉత్తరాంధ్రవాసులు.
విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్ డివిజన్లతో కొత్త జోన్
కేంద్రప్రభుత్వం విశాఖ కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ను ప్రకటించి ఏడాది గడుస్తోంది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, గుంతకల్.. ఈ నాలుగు డివిజన్లను కలిపి విశాఖ ప్రధాన కేంద్రంగా రైల్వే జోన్‌ను ఏర్పాటు చేసింది. వాల్తేరు డివిజన్‌ను కొనసాగిస్తూ విశాఖ డివిజన్‌గా పేరు మారుస్తూ రైల్వే బోర్డు అధికారక ఉత్తర్వులు కూడా ఎప్పుడో జారీ చేసింది. కానీ.. కొన్ని సమస్యలతో లేట్ అవుతూ వస్తోంది. ప్రస్తుతం ఆ సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతుండడంతో కొత్త రైల్వే జోన్ కార్యకలాపాలు పట్టాలెక్కబోతున్నాయి. ఇటీవల సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత మరింత స్పీడ్ పెరిగింది. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలకు ముహూర్తం ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఏప్రిల్ ఒకటి నుంచి నూతన రైల్వే జోన్ ప్రారంభం కానున్నట్లు సంకేతాలు కనిపిస్తున్నాయి. ఏప్రిల్ నుంచి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు ప్రారంభం అవుతాయన్నారు బీజేపీ ఎమ్మెల్యే విష్ణుకుమార్‌రాజు. అంతేకాదు.. వచ్చే ఐదేళ్లలో విశాఖపట్నం రూపు రేఖలు పూర్తిగా మారిపోతాయని చెప్పారు.
శరవేగంగా జోన్ కార్యాలయం నిర్మాణ పనులు
విశాఖలో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాల ప్రక్రియ కూడా తుది దశకు చేరుకుంది. జోన్ కార్యాలయం నిర్మాణ పనులు కూడా శరవేగంగా సాగుతున్నాయి. జోన్ ఏర్పాటుకు గెజిట్ విడుదలయితే కార్యకలాపాలు ప్రారంభమైపోతాయి. అయితే.. శాశ్వత కార్యాలయ భవనం అందుబాటులోకి వచ్చే అవకాశం లేకపోవడంతో తాత్కాలికంగా సిరిపురంలోని ది డెక్ భవనంలో రెండు అంతస్తుల్లో జీఎం కార్యాలయాన్ని సిద్ధం చేశారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్‌లో పని చేసేందుకు 959 మంది ఉద్యోగులను బదిలీ చేయాలని ఇటీవల రైల్వే శాఖ నిర్ణయం కూడా తీసుకుంది. ఇప్పటికే సౌత్ కోస్ట్ జీఎంగా సందీప్ మాధుర్‌తో పాటు.. వివిధ విభాగాల అధిపతులను కూడా నియమించింది. సిరిపురంలోని తాత్కాలిక కార్యాలయంలో హెచ్‌వోడీ ఛాంబర్లు సైతం సిద్ధం చేశారు. 1000 మంది ఉద్యోగులు విధులు నిర్వహించేలా తాత్కాలిక కార్యాలయాన్ని తీర్చిదిద్దారు. అందులో కొంతమంది విధులకు కూడా హాజరవుతున్నారు. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ విషయంలో గెజిట్ నోటిఫికేషనే ఆలస్యం అన్నారు ఈస్ట్ కోస్ట్ రైల్వే శ్రామిక యూనియన్ డివిజనల్ కోఆర్డినేటర్ రామ్మోహనరావు.
చివరి దశకు దక్షిణ మధ్య రైల్వే విభజన ప్రక్రియ
ఇక.. గెజిట్ నోటిఫికేషన్ విడుదలయితే సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పూర్తిస్థాయి కార్యకలాపాలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే దక్షిణ మధ్య రైల్వే విభజన ప్రక్రియ కూడా చివరి దశకు చేరుకుంది. ఆరు డివిజన్లతో సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే జోన్.. సికింద్రాబాద్, హైదరాబాద్, నాందేడ్‌కే పరిమితం కానుంది. విజయవాడ, గుంటూరు, గుంతకల్‌తో పాటు తూర్పు కోస్తా జోన్‌లోని కొంత భాగం.. కొత్తగా ఏర్పడే విశాఖ డివిజన్‌తో కలిపి సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు అవుతోంది. అయితే.. ఉద్యోగుల సర్దుబాట్ల విషయంలో కాస్త ఆందోళన నెలకొంది. కొత్తగా ఏర్పాటయ్యే రైల్వేజోన్‌లో స్థానికులకు ప్రాధాన్యత ఇవ్వాలనే డిమాండ్ ఉద్యోగుల్లో వినిపిస్తోంది. సౌత్ కోస్ట్ రైల్వే జోన్ ఏర్పాటు ఇప్పటికే చాలా లేటు అయిందని.. ఇప్పటికైనా కార్యకలాపాలు వెంటనే ప్రారంభించాలని ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నేతలు కోరుతున్నారు.
మొత్తంగా.. విశాఖ కేంద్రంగా సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కార్యకలాపాలు త్వరలో ప్రారంభం కానున్నట్లు ఆయా రైల్వే విభాగాల మాటల్లో స్పష్టమవుతోంది. అటు.. ఏప్రిల్ నుంచి ప్రారంభమవుతుందనే కూటమి నేతల ప్రకటనతో సౌత్ కోస్ట్ రైల్వే జోన్ పట్టాలెక్కి హై స్పీడ్‌లో దూసుకుపోవడం ఖాయంగా కనిపిస్తోంది.