Andhra Pradesh: పాము కరిచినా ప్రాణాలు పోవు.. మాది భరోసా అంటున్న ఏపీ ప్రభుత్వం

Andhra Pradesh: పాము కరిచిన చోట గాయం కోయడం.. నోటితో విషాన్ని పీల్చడం.. గట్టిగా తాడుతో కట్టడం.. సొంతంగా మందులు లేదా మూలికలు వేయడం చేయకూడదు. వెంటనే బాధితుడిని ప్రశాంతంగా ఉంచి.. కరిచిన భాగాన్ని కదలకుండా చేసి.. సమీప వైద్య కేంద్రానికి తీసుకెళ్లాలి..

Andhra Pradesh: పాము కరిచినా ప్రాణాలు పోవు.. మాది భరోసా అంటున్న ఏపీ ప్రభుత్వం
Snake

Edited By:

Updated on: Sep 19, 2026 | 5:58 PM

Andhra Pradesh: పాము కనిపిస్తే భయం.. కరిస్తే ప్రాణాలపై ఆశలు వదులుకోవడం.. సాధారణంగా కనిపించే పరిస్థితి ఇది. కానీ ప్రతి పాము కాటు ప్రాణాంతకం కాదంటోంది ఏపీ వైద్య ఆరోగ్య శాఖ. ప్రపంచవ్యాప్తంగా సుమారు 3,500 రకాల పాములు ఉన్నా.. వాటిలో కొన్ని జాతులు మాత్రమే విషపూరితమైనవని చెబుతోంది. ఏపీ రాష్ట్రంలో తాచుపాము, రక్తపింజర, కట్లపాము వంటి విషపూరిత పాములతో ప్రమాదం ఎక్కువగా ఉంటుందని తెలిపింది. ప్రజల్లో పాముకాటుపై అవగాహన పెంచేందుకు ఈ నెల 19 నుంచి 25 వరకు అంతర్జాతీయ పాముకాటు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోంది.

భయపడొద్దు.. వైద్యంలో ఆలస్యం చేయొద్దు

పాముకాటు జరిగినప్పుడు బాధితుడిని ప్రశాంతంగా ఉంచడం.. కరిచిన ప్రాంతాన్ని కదలకుండా చూడటం.. ఉంగరాలు, గాజులు, కడియాలు వంటి బిగుతైన వస్తువులను తొలగించడం ముఖ్యం. ఆ తర్వాత వీలైనంత త్వరగా ఆసుపత్రికి తరలించాలి. రాష్ట్రంలోని అన్ని స్థాయిల ప్రభుత్వ ఆసుపత్రుల్లో యాంటీ స్నేక్ వెనమ్ అందుబాటులో ఉంచినట్లు ప్రభుత్వం చెబుతోంది. అంతేకాదు.. ఆసుపత్రికి చేరుకునేలోపే అత్యవసర చికిత్స అందించేందుకు 108 అంబులెన్సుల్లోనూ యాంటీ వెనమ్ అందుబాటులోకి తెచ్చింది. ఇప్పటివరకు 9 కేసుల్లో 108 సిబ్బంది విరుగుడు మందు అందించారు.

కేసులు వేలల్లో.. మరణాలు మాత్రం తగ్గుతున్నాయ్

రాష్ట్రంలో పాముకాటు కేసులు నమోదవుతున్నా.. మరణాల సంఖ్య తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. 2024లో పాముకాటుతో 41 మంది మృతి చెందగా.. 2025లో 13కి తగ్గింది. 2026లో ఇప్పటివరకు 6 మరణాలు నమోదయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు 4,111 పాముకాటు కేసులు నమోదయ్యాయి. ఏప్రిల్ తర్వాత కేసులు పెరుగుతూ.. జూలైలో 890, ఆగస్టులో 1,051 కేసులు నమోదయ్యాయి.

శ్రీకాకుళంలో అత్యధిక కేసులు – అందుబాటులో యాంటీ వెనమ్

జిల్లాల వారీగా చూస్తే.. జనవరి నుంచి ఆగస్టు వరకు శ్రీకాకుళంలో అత్యధికంగా 706 పాముకాటు కేసులు నమోదయ్యాయి. పశ్చిమగోదావరిలో 369, విజయనగరంలో 307, కృష్ణాలో 296, ఏలూరులో 271 కేసులు నమోదయ్యాయి. కేసులు ఎక్కువగా నమోదవుతున్న ప్రాంతాల్లో వైద్య శాఖ అప్రమత్తమైంది. అవసరమైన వైద్య కేంద్రాల్లో యాంటీ స్నేక్ వెనమ్ నిల్వలను అందుబాటులో ఉంచింది. సెప్టెంబర్ 18 నాటికి రాష్ట్రవ్యాప్తంగా 2,807 మోతాదుల యాంటీ వెనమ్ నిల్వ ఉన్నట్లు అధికారులు తెలిపారు.

Ap Govt

కాటు వేస్తే ఇవి మాత్రం చేయొద్దు

పాము కరిచిన చోట గాయం కోయడం.. నోటితో విషాన్ని పీల్చడం.. గట్టిగా తాడుతో కట్టడం.. సొంతంగా మందులు లేదా మూలికలు వేయడం చేయకూడదు. వెంటనే బాధితుడిని ప్రశాంతంగా ఉంచి.. కరిచిన భాగాన్ని కదలకుండా చేసి.. సమీప వైద్య కేంద్రానికి తీసుకెళ్లాలి. రాత్రివేళ బయటకు వెళ్లేటప్పుడు టార్చ్, చెప్పులు ఉపయోగించడం.. ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచడం.. నేలపై నిద్రించకుండా జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పాముకాటు ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చని శాఖ సూచిస్తోంది. పాము కరిచిందంటే ప్రాణం పోయినట్టే కాదు.. భయపడకుండా, ఆలస్యం చేయకుండా సరైన వైద్యం అందించడమే ప్రాణాలను కాపాడే మార్గం.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Loading...
Unable to load recommendations.
Follow Us