
చిత్తూరు జిల్లా కార్వేటినగరం మండలం డి.యం. పురం ప్రభుత్వ పాఠశాలలో విషపురుగుల దాడి కలకలం రేపింది. క్లాస్‌లో చదువుతున్న విద్యార్థుల శరీరంపై ఒక్కసారిగా దురదలు రావడం కనిపించింది. దాదాపు 15 మంది విద్యార్థుల శరీరంపై దద్దుర్లు ఏర్పడడంతో అసలు ఏం జరిగిందో అర్థం కాని పరిస్థితి నెలకొంది. అస్వస్థతకు గురైన విద్యార్థుల విషయం తెలుసుకున్న పాఠశాల హెచ్ఎం తో పాటు ఉపాధ్యాయులకు అర్థం కాలేదు. కానీ, ఏదో విష పురుగు కాటుకు గురైనట్లు గుర్తించారు. 15 మంది విద్యార్థుల శరీరంపై దురదలు విషపురుగు కాటు కారణమని గుర్తించారు.
విద్యార్థుల పరిస్థితిని గమనించిన ఉపాధ్యాయులు వెంటనే అసలు కారణాన్ని వెతికే ప్రయత్నం చేశారు. పాఠశాల పరిసరాల్లో తిరుగుతున్న ఒక రకమైన విషపురుగు కాటు వల్లే పిల్లలకు ఈ పరిస్థితి వచ్చిందని వారు గుర్తించారు. ఆలస్యం చేయకుండా, దురదలతో ఇబ్బంది పడుతున్న విద్యార్థులందరినీ వెంటనే పుత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నాదముని రెడ్డి గారు ఈ విషయాన్ని వెంటనే కార్వేటినగరం ఎంఈఓ (MEO) విజయ్ కుమార్ గారి దృష్టికి తీసుకెళ్లారు. వారి ద్వారా ఉన్నతాధికారులకు సమాచారం చేరింది. పుత్తూరు ఆసుపత్రి వైద్యులు విద్యార్థులకు తక్షణమే అత్యవసర చికిత్స, యాంటీ అలర్జీ మందులను అందించారు. ఈ విషపురుగుల కాటు వల్ల ప్రాణాపాయం ఏమీ లేదని, పిల్లలందరూ క్షేమంగానే ఉన్నారని వైద్యులు స్పష్టం చేయడంతో అటు తల్లిదండ్రులు, ఇటు విద్యాశాఖ అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
ఇటీవలి కాలంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఇటువంటి వింత విషపురుగుల బెడద ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వర్షాకాలం ప్రారంభం కావడం, కుళ్ళిపోతున్న పదార్థాలు, చెత్తాచెదారం పెరగడంతో ఇవి ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ కీటకం చూడటానికి పొడవాటి శరీరంతో, చాలా పొట్టిగా ఉండే రెక్కల తొడుగులతో వింతగా ఉంటుంది. ఇది కుట్టడం లేదా శరీరంపై పాకడం వల్ల చర్మంపై తీవ్రమైన మంట, దురదలు వచ్చి పెద్ద పెద్ద దద్దుర్లు ఏర్పడతాయి. సాధారణంగా ఇవి మురికి ప్రదేశాలు, తడి ఎక్కువగా ఉండే కుళ్ళిపోయే వ్యర్థాల మధ్య పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి..