Heatwave: భగ్గున మండుతున్న తెలుగు నేల.. పిట్టల్లా రాలుతున్న జనం..

ఆకాశమే ఒక అగ్నిగుండమైంది. పగలు, రాత్రి అనే తేడా లేకుండా తెలుగు నేలను నిప్పుల కొలిమిలా మారుస్తూ.. భానుడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. ఇది కేవలం ఎండాకాలం కాదు, నిలువునా మనుషుల ప్రాణాలను హరిస్తున్న ఒక అగ్ని తాండవం! తెలుగు నేలపై గురు, శుక్ర, శని.. ఈ మూడు రోజుల్లోనే కనీసం 150 మందికి పైగా చనిపోయారంటే.. కచ్చితంగా ఇదో ప్రకృతి వైపరీత్యమే. ఇక పౌల్ట్రీకి వచ్చిన నష్టం బర్డ్‌ఫ్లూ కంటే ఎక్కువ.

Heatwave: భగ్గున మండుతున్న తెలుగు నేల.. పిట్టల్లా రాలుతున్న జనం..
Heatwave

Updated on: May 24, 2026 | 9:25 PM

ఆకాశంలో వేల అగ్నిబాణాలతో సూర్యారావు విరుచుకుపడుతుంటే.. భూమి అల్లాడిపోతోంది. పొద్దున్నే గడియారంలో ఎనిమిదో గంట కొట్టకముందే భాస్కరుడు తన వేడి సెగలను భూమిపైకి విసురుతున్నాడు. మధ్యాహ్నానికి మార్తాండుడు ఉగ్రరూపం దాల్చి, మనుషులను నిలువునా ఫ్రై చేసి పారేస్తున్నాడు. ‘నేను కన్ను తెరిస్తే మాడిపోవాల్సిందే’ అన్నట్టుగా దినకరుడు మండే నిప్పులను కురిపిస్తుంటే, జనం పిట్టల్లా రాలిపోతున్నారు.

తెలంగాణలో గురువారం 22 మంది చనిపోయారు. శుక్రవారం అయితే అంతకు మించి. ఏకంగా ఆ ఒక్కరోజే 34 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇక శనివారం నాడైతే ఉగ్రరూపం చూపించాడు సూర్యుడు. ఏకంగా 51 మందిని బలితీసుకున్నాడు. ఏపీలోనూ అదే పరిస్థితి. గత రెండు రోజుల్లోనే 37 మంది ప్రాణాలు అనంతవాయువులో కలిసిపోయాయి.

తెలుగు రాష్ట్రాల్లో అత్యంత జాగ్రత్తగా ఉండాల్సిన జిల్లాలు రెండున్నాయి. ఒకటి ఉమ్మడి వరంగల్, మరొకటి ఉమ్మడి ఖమ్మం. ఈ రెండు జిల్లాలకు అటుఇటు ఆనుకుని ఉన్న జిల్లాల ప్రజలు కూడా అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఏపీలో పల్నాడు, కృష్ణా, ఎన్టీర్, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఎండతీవ్రత దారుణంగా ఉంది. నిప్పుల కొలిమి ఎలా ఉంటుందో తెలియకపోతే.. ఈరెండు జిల్లాల్లో అడుగుపెడితే తెలుస్తుంది. ఆ రేంజ్‌లో ఆదిత్యుడు దంచికొడుతున్నాడు.

ఊపిరి పీల్చుకుందామంటే గాలిలో తేమ లేదు. కేవలం వేడి సెగలు మాత్రమే ఉన్నాయి. పోనీ సూర్యాస్తమయం అయ్యాక ఊరట లభిస్తుందా అంటే అదీ లేదు. రాత్రి వేళ కూడా రవి వెదజల్లిన వేడి.. గోడల నుంచి, భూమి నుంచి పైకి ఉబికి వస్తూనే ఉంది. గాలి ఆడక, ఉక్కపోతతో రాత్రిళ్లు కూడా ఊపిరాడకుండా చేస్తోంది.

మనుషులే కాదు.. మూగజీవాలు కూడా తట్టుకోలేకపోతున్నాయి. రోజూ లక్షల కోళ్లు చనిపోతున్నాయ్. బర్డ్‌ఫ్లూ కంటే ఎక్కువ నష్టం తీసుకొచ్చింది ఈ ఎండాకాలం. ఒక్క ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోనే రెండు రోజుల్లో 10 లక్షల కోళ్లు చనిపోయాయ్. తూర్పుగోదావరి జిల్లాలో లక్షలాది కోళ్లు ప్రాణాలు కోల్పోయి, పౌల్ట్రీ పరిశ్రమకు 54 కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది. మే 27 వరకు వాతావరణ శాఖ ‘రెడ్ అలర్ట్’ ప్రకటించింది. అంటే.. దివాకరుడు మరి కొన్ని రోజులు తన అగ్ని తాండవాన్ని ఆపనని హెచ్చరిస్తున్నాడు!

సూర్యారావ్ వార్నింగ్‌ను తేలిగ్గా తీసుకోవద్దు. అన్నాడంటే చేస్తాడంతే. నిర్లక్ష్యంగా ఉండి, ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో బయటకు వస్తే ప్రాణాలతో చెలగాటం ఆడడమే. సో, ఆ ఐదు గంటలు ఇల్లు దాటకండి, లేదా నీడ పట్టున ఉండండి. సూర్యుడి కంటికి దొరికితే వడదెబ్బ గ్యారంటీ. దాహం వేసినా, వేయకపోయినా ప్రతి అరగంటకు నీళ్లో, మజ్జిగో, ఓఆర్ఎస్ తాగుతూనే ఉండండి. ఒక్కోసారి నీడలో ఉన్న వాళ్లకి కూడా వడదెబ్బ తప్పదు. ఏదేమైనా, ఇది ప్రకృతి ఇస్తున్న ఓ హెచ్చరిక. అప్రమత్తంగా ఉండడం ఒక్కటే ప్రాణాలకు రక్ష.

ఆంధ్రాలో ఎండలు రికార్డు స్థాయికి చేరాయి. ఆదివారం (మే 24) ఈ సీజన్లోనే అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.మరో 3 రోజుల పాటు ఇదే తీవ్రత కొనసాగే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. ఆదివారం చిట్యాల (తూర్పుగోదావరి) 48.3°C (ఈ సీజన్లోనే అత్యధికం) నమోదు అయింది.

మే 25 (సోమవారం) ఉష్ణోగ్రతల అంచనా:

45°C – 47°C: కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, పోలవరం, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు,ప్రకాశం.

43°C – 45°C: విజయనగరం,మన్యం, కాకినాడ, మార్కాపురం, నెల్లూరు.

40°C – 43°C: రాయలసీమ జిల్లాలు, శ్రీకాకుళం, అల్లూరి, విశాఖ,అనకాపల్లి.

ద్రోణి ప్రభావంతో ఏపీలోని మార్కాపురం, ప్రకాశం, కర్నూలు, నంద్యాల, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉంది. మన్యం, అల్లూరి, పోలవరం, అనకాపల్లి, మిగిలిన రాయలసీమ జిల్లాల్లో చెదురుమదురుగా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉదయం11-4 మధ్య వీలైనంత వరకు బయటకు రావద్దు. ఉరుములు, మెరుపులతో వర్షం పడేటప్పుడు చెట్ల కింద, విద్యుత్ స్తంభాలు, హోర్డింగ్స్ కింద నిలబడకూడదు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

 

Follow Us