
ఆంధ్రప్రదేశ్‌లో వేసవి సెలవులు అనంతరం జూన్ 12 శుక్రవారం పాఠశాలలు పున ప్రారంభం అయ్యాయి.. అన్నీ పాఠశాలలు ప్రారంభమై.. పిల్లలతో సందడిగా ఉంటే.. ఓ ప్రభుత్వ పాఠశాల మాత్రం మొదటిరోజే ప్రారంభానికి నోచుకోలేదు. వివరాల్లోకి వెళితే కడప జిల్లా ఒంటిమిట్ట మండలం చిన్న కొత్త పల్లి గ్రామంలో మండల పరిషత్ పాఠశాలకు గ్రామస్తులు తాళాలు వేసి నిరసన తెలిపారు. గత 60 సంవత్సరాలనుండి చిన్న కొత్తపల్లి లొని ప్రభుత్వ పాఠశాలలో 8 వ తరగతి వరకు విద్యార్థులు చదువుకోడానికి వీలుండేది. ఇటీవల ప్రభుత్వ తీసుకున్న విధానాల ప్రకారం ఈ పాఠశాలలో 6,7 తరగతులను తీసివేసి ఇంకో ఊరికి మార్చారు. గ్రామస్తులు గత ఏడాదే ఈ నిర్ణయాన్ని వ్యతిరేకించి ఉన్నతాధికారులకు విన్నవించుకున్నారు. కలెక్టర్ యాథావిధిగా 6,7 తరగతులను కొనసాగించేలా నిర్ణయం తీసుకున్నారు.
ఇదిలా ఉంటే ఈ సంవత్సరం నుండి 5 వ తరగతి వరకే పాఠశాల అని తెలవడంతో గ్రామస్తులు పాఠశాలకు తాళాలు వేసి గేట్ బయటే కూర్చుని ఆందోళనకు దిగారు. మొదటి రోజే పాఠశాలకు తాళాలు వేసి ఎవరూ లోపలికి వెళ్లకుండా మూసివేశారు. తమ పిల్లలు దూర ప్రాంతాలకు చదువుకోడానికి వెళ్ళ లేరని తమకు 6, 7 తరగతులు ఇక్కడే కొనసాగించాలని వారు ఆందోళన చేస్తున్నారు. ఇక్కడ ఈ తరగతులను ఎత్తివేయడం వల్ల తమ పిల్లలు పెన్నపేరూరు, మాధవరం, ఒంటిమిట్టకు వెళ్లి చదువుకోవడం కష్టం అవుతుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
Kadapa School Protest
తాము కూలీ చేసుకుని పిల్లలను చదివించుకుంటున్నామని తమ పిల్లలను దూర ప్రాంతాలకు వెళ్లి చదివించడానికి ఛార్జీలు కూడా పెట్టలేమాని వారు పేర్కొన్నారు. అంత దూరం తమ పిల్లలు వెళ్ళలేరని కావున తమకు తమ గ్రామంలో పాఠశాలలోనే 6,7 తరగతులు కొనసాగించాలని లేకుంటే తమ పిల్లలను చదువులు ఆపేసి ఇంటి వద్దే ఉంచుతామని వారు పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం నుండే ఉన్నత తరగతులు కొనసాగించాలని.. లేదంటే పాఠశాల తాళాలు తెరవమని గ్రామస్తులు పాఠశాల వద్దే ఆందోళన చేస్తున్నారు. కాగా.. ఈ ఘటనపై ఉన్నతాధికారులు ఆరా తీసినట్లు తెలిసింది.. దీనిపై త్వరలోనే సానుకూల నిర్ణయం వస్తుందని పేర్కొంటున్నారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..