Sharmila New Party: తెలంగాణలో షర్మిల పార్టీ ఏర్పాటు నిర్ణయంపై వైసీపీ ముఖ్యనేత, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి స్పందించారు. షర్మిల నిర్ణయంపై తప్పుడు భాష్యాలు వచ్చే అవకాశం ఉందని అభిప్రాయపడ్డారు. ఇదే అంశంపై మంగళవారం నాడు ఇక్కడ మీడియాతో మాట్లాడిన ఆయన.. షర్మిల తమ అందరి ఆత్మీయ సోదరి అని పేర్కొన్నారు. వైఎస్ జగన్ జైలులో ఉన్నప్పుడు వైసీపీకి అన్నీ తానై వ్యవహరించారని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు షర్మిల సుదీర్ఘ పాదయాత్ర చేశారని ఆయన గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రభుత్వాలు సరస్పర సహకారం ఉండాలని జగన్ భావించారని సజ్జల పేర్కొన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకు ఇబ్బంది ఉంటుందనే తెలంగాణలో పార్టీని వద్దనుకున్నామని ఆయన వెల్లడించారు.
పార్టీని బలోపేతం చేసేందుకు తెలంగాణలో ఏ ప్రయత్నం చేసినా.. ఏపీలో గ్యాప్ ఏర్పడే అవకాశం వస్తుందని జగన్ భావించారని చెప్పుకొచ్చారు. పార్టీ విస్తరణ వల్ల నష్టమే తప్ప ప్రయోజనం ఉండదని జగన్ అభిప్రాయం అని పేర్కొన్నారు. ఈ కారణంగానే షర్మిల పార్టీ ఏర్పాటు చేయాలనే నిర్ణయాన్ని కూడా వద్దని నచ్చజెప్పేందుకు జగన్ ప్రయత్నించారని ఆయన తెలిపారు. పార్టీ ఏర్పాటు వల్ల కలిగే కష్ట, నష్టాలు, రాజకీయంగా ఉన్న పరిమితులు ఇవన్నీ షర్మిలకు జగన్ వివరించారన్నారు. కానీ, షర్మిల తన స్వీయ అనుభవంతో పార్టీ ఏర్పాటు చేయాలని బలంగా నిర్ణయించుకున్నట్లు కనిపిస్తోందన్న ఆయన.. పార్టీ ఏర్పాటుకు సంబంధించి ప్రతి అంశానికి షర్మిలనే బాధ్యురాలు అవుతారని సజ్జల స్పష్టం చేశారు. అయితే జగన్, షర్మిల వ్యక్తిగత సంబంధాలకు, పార్టీలకు సంబంధం ఏమాత్రం ఉండబోదని ఆయన స్పష్టం చేశారు.
అయితే.. జగన్, షర్మిల మధ్య విబేధాలు ఉన్నాయంటూ వస్తున్న వార్తలపై సజ్జల క్లారిటీ ఇచ్చారు. షర్మిల, జగన్ మధ్య విబేధాలు లేవని, వారివి కేవలం భిన్నాభిప్రాయాలు మాత్రమే అని స్పష్టం చేశారు. తెలంగాణలో షర్మిలను పార్టీ పెట్టొద్దని జగన్ సూచించారని సజ్జల తెలిపారు. ఈ నిర్ణయం వల్ల తమపై నమ్మకం పెట్టుకున్న వారికి న్యాయం చేయలేమేమో అని జగన్ భావిస్తున్నారని చెప్పారు. అయితే, తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై షర్మిల ఇప్పుడే నిర్ణయం తీసుకోలేదని ఆయన పేర్కొన్నారు. రాజశేఖర్ రెడ్డి కూతురు అయిన షర్మిల సహజంగానే భిన్న ఆలోచనలు చేస్తుండొచ్చని, ఆ కారణంగానే ఆమె తెలంగాణలో పార్టీ ఏర్పాటుపై నిర్ణయం తీసుకుని ఉంటారని సజ్జన తన అభిప్రాయం వ్యక్తం చేశారు.
Also read: