
పల్నాడు జిల్లా నర్సరావుపేటలోని ఎల్టీ కాలనీ.. ఉదయాన్నే హాడావుడిగా ఉంది. కొంతమంది బ్యాంక్ పుస్తకాలు పట్టుకొని రాకెట్ ల్యాబ్ సంస్థ కార్యాలయం వద్దకు వస్తున్నారు. వచ్చిన వాళ్లకి సంస్థ సభ్యులు ఈకేవైసి చేస్తున్నారు. ఈకేవైసి ఓకే అయిన తర్వాత మూడు వేలు ఇవ్వాలంటూ వారి చేత కట్టించుకుంటున్నారు. చిలకలూరిపేటకు చెందిన నాగళ్ల వెంకట్రావు ఇదంతా చేయిస్తున్నాడు. ప్రతి రోజూ పదుల సంఖ్యలో మహిళలు వచ్చి రాకెట్ ల్యాబ్ సంస్థ కార్యాలయం వద్ద ఈకేవైసి చేయించుకోవడం కలకలం రేపింది.
నాగళ్ల వెంకట్రావు కాలనీ వాసులకి బంపర్ ఆఫర్ ఇచ్చాడు. కేరళలోకి పాలక్కాడ్ కు చెందిన అజీస్ సత్తి అనే వ్యాపారి పేద వాళ్ల ఖాతాల్లో పెద్ద ఎత్తున డబ్బు జమ చేయనున్నారని చెప్పాడు. వారి ఖాతాల ఈకేవైసి చేయించుకుని మూడు రూపాయలు కడితో మొదటి విడతలో మూడు లక్షల రూపాయలు, రెండో విడతగా కోటి రూపాయలు, మూడో విడతగా 25 కోట్ల రూపాయలు ఇవ్వనున్నారంటూ ప్రచారం చేశాడు. దీంతో కాలనీలో అనేక మంది వచ్చి తమ ఖాతాలు ఇచ్చి ఈకేవైసి చేయించుకోవడం మొదలు పెట్టారు. దాదాపు 200 మందికి పైగానే ఈకేవైసి చేయించుకున్నారు. ఇంకా అనేకమంది వస్తూనే ఉన్నారు. ఇలా రోజూ జరుగుతుండటంపై అనుమానం వచ్చిన స్థానికులు వీఆర్వోకి ఫిర్యాదు చేశారు.
వీఆర్వో వెంటనే ఈ విషయాన్ని పోలీసులు దృష్టికి తీసుకెళ్లారు. రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేశారు. నాగళ్ల వెంకట్రావుతో పాటు మరో నలుగురిని అరెస్ట్ చేశారు. వీరంతా ఒక ముఠాగా ఏర్పడి స్థానికులు వద్ద నుండి ఇప్పటికే ఆరు లక్షల రూపాయలు వసూలు చేసినట్లు సిఐ సుబ్బారావు తెలిపారు. వీరి వద్ద నుండి ఆరు లక్షల నగదు. ఒక ల్యాప్ టాప్, ఈకేవైసి బుక్స్, నాలుగు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇటువంటి మోసాలకు పాల్పడే వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు హెచ్చరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..