
గద్వాల జిల్లా ఐజాకు చెందిన మెడికో ప్రియాంక.. రాజమండ్రిలో పీజీ చదువుతోంది. ఆగస్టు 3న స్నేహితుడితో కలిసి సినిమా చూసి స్కూటీపై వెళ్తోంది. కానీ, అంతలోనే ఘోరం. మాల్ గేట్ దాటేలోపే అంతా ఐపోయింది. మద్యం మత్తులో కారును వేగంగా పోనిచ్చి స్కూటీని ఢీకొట్టారు అగంతకులు. కారుతో మూడుసార్లు స్కూటీని బలంగా ఢీకొట్టినట్లు సీసీ ఫుటేజీల్లో క్లియర్‌గా కనిపిస్తోంది. రాత్రి 10 గంటలకు స్వతంత్ర ఆస్పత్రి నుంచి సమాచారం అందుకుని, మరో వైద్య విద్యార్థి ఉమేష్ స్టేట్మెంట్ తీసుకొని పోలీసులు కేసు నమోదు చేశారు. నిందితులు ఆల్కహాల్ తీసుకుని డ్రైవ్ చేసినట్టు ఆధారాలు దొరికాయి. అటు, ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్ అయిన మెడికో ప్రియాంక.. హైదరాబాద్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో మూడురోజులుగా మృత్యువుతో పోరాడింది. అప్నియా టెస్ట్ చేయాలని వైద్యులు ప్రయత్నించినా, ఆమె శరీరం సహకరించలేదు. శరీరంలో సోడియం లెవల్స్ 16 కంటే తక్కువగా ఉండటంతో ట్రీట్‌మెంట్ సాధ్యం కాలేదు. ప్రియాంకను ఎలాగైనా కాపాడానికి డాక్టర్లు విశ్వప్రయత్నం చేశారు. ఐనా, ఫలితం లేకపోయింది. ప్రియాంక చనిపోయింది.
కానీ ఇంతటి సెన్సిటివ్ కేసును పోలీసులు ఎలా డీల్ చేశారు? సెక్షన్లు పదేపదే మార్చడంతో కేసును తప్పుదోవ పట్టించే కుట్ర జరుగుతోందా? అని ఆరోపణలూ వినిపించాయి. అందుకే, ఆదివారం ఉదయం రాజమండ్రి ప్రకాశ్‌నగర్‌లో పోలీసుల్ని ప్రియాంక తండ్రి వెంకేటేష్. డీఎస్పీలు దేవరాజ్, సుభాష్‌తో మాట్లాడారు. కేసులో సెక్షన్లు వీక్‌గా ఉన్నాయా, దోషులకు శిక్షలు పడేలా విచారణ జరుగుతోందా.. అని ఆరా తీశారు. ఇది ముమ్మాటికీ మర్డరేనన్నది ఆయన వాదన. తప్పతాగి యాక్సిడెంట్ చేసేవారిని వదిలిపెట్టకూడదన్నది ఆయన ఆక్రోశం. యాక్సిడెంట్ చేసి ప్రియాంక మరణానికి కారకులైన దశ్వంత్, ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్‌పై ఇప్పటికే హత్యాయత్నం కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపించారు. ఉద్దేశపూర్వకంగా ప్రియాంకను ఢీకొట్టారని తెలిస్తే హత్యాయత్నం కేసును హత్యకేసుగా మారుస్తారు. కేసులో ప్రమేయం ఉన్నవారందరినీ అరెస్టు చేస్తామని ఎస్‌పీ కిషోర్ తెలిపారు.
ప్రియాంక మృతిపై సీఎం చంద్రబాబు విచారం వ్యక్తం చేశారు. నిర్లక్ష్యంతో నిండు ప్రాణం కోల్పోవడం కలిచివేసిందని చెప్పారు. ప్రియాంక మృతికి కారణమైన వారు ఇప్పటికే జైల్లోనే ఉన్నారని.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామన్నారు. ఈ సందర్భంగా ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీతో ఫోన్‌లో మాట్లాడిన సీఎం.. బాధిత కుటుంబానికి రూ.20లక్షల ఆర్థికసాయం ప్రకటించారు. ప్రియాంక మృతిపై పవన్‌కల్యాణ్ కూడా తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ప్రియాంక మృతి తనను ఎంతో కలిచివేసిందన్నారు. నిందితులకు కఠినశిక్ష పడేలా చర్యలు తీసుకుంటామన్న పవన్..
ప్రియాంక కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అటు ప్రియాంక ఘటనపై హోంమంత్రి అనిత ఆరా తీశారు. ఆమె తండ్రి వెంకటేష్‌తో ఫోన్‌లో మాట్లాడారు. అండగా ఉంటామని భరోసానిచ్చారు. ఘటన జరిగిన మాల్ యాజమాన్యం పాత్రపై కూడా సందేహాలొచ్చాయి. యాక్సిడెంట్ జరిగి, మనిషి ప్రాణాపాయ స్థితిలో ఉంటే, గేట్లు మూసివేసిన సెక్యూరిటీ సిబ్బంది తీరు కూడా అనుమానాస్పదమే. మొత్తానికి మద్యం మత్తు, ర్యాష్ డ్రైవింగ్.. అన్నీ కలిసి ఒక మెడికో ప్రాణం తీశాయి. బంగారు భవిష్యత్తున్న ప్రియాంకను లేకుండా చేశాయి. తల్లిదండ్రులకు పుట్టెడు శోకాన్ని మిగిల్చాయి.